‘అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’ 

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’  అని దుయ్యబట్టారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైయ‌స్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్‌నాథ్‌ ఎండగట్టారు.

పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్‌లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు.

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. 

Back to Top