మాట తప్పని నాయకులు వైయస్‌ జగన్‌

బీసీలను చంద్రబాబు వాడుకొని వదిలేశాడు

వైయస్‌ జగన్‌తోనే బడుగుల అభివృద్ధి సాధ్యం

జననేతను ముఖ్యమంత్రిని చేయడానికి సహకారం అందిస్తాం

28న అమరావతిలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతాం

కేంద్ర మాజీ మంత్రి, బీసీ నాయకురాలు కిల్లి కృపారాణి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షకు ఆకర్షితురాలినై పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నానని కేంద్ర మాజీ మంత్రి, బీసీ నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో ఆమె జననేతతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం 28వ తేదీన వైయస్‌ జగన్‌ సమక్షంలో అమరావతిలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భేటీ అనంతరం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు చేసిన పాదయాత్ర ప్రజా సంకల్పయాత్ర మాదిరిగా విజయవంతం సాధించలేదన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర వైయస్‌ జగన్‌ తానేంటో ప్రజలకు చెప్పారన్నారు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధికి వైయస్‌ జగన్‌ పడుతున్న తపనకు బలం చేకూర్చడానికి, ఆయన్ను ముఖ్యమంత్రి చేయడానికి సహాకారం అందించడం కోసం వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వివరించారు. 

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేస్తున్నాడని కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ బీసీ గర్జనలో డిక్లరేషన్‌ ప్రకటించి బీసీలకు ఏటా రూ. 15 వేల కోట్లు, ఐదేళ్లలో రూ. 75 కోట్లు కేటాయించి సంక్షేమానికి పాటుపడతానని చెప్పారన్నారు. బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు, దేశ సంస్కృతి, సంప్రదాయం అని చెప్పారన్నారు. తినే తిండి నుంచి పడుకునే పరుపు వరకు ఎక్కే బండి దగ్గర నుంచి ఉండే ఇల్లు వరకు బీసీలను వాడుకుంటున్నారు తప్పితే. ఎవరూ సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. కానీ, వైయస్‌ జగన్‌ బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు సాగుతున్నారన్నారు. బీసీలకు కార్పొరేషన్ల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  మాట తప్పని మడప తప్పని వైయస్‌ వంశంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

నాలుగేళ్లు ప్రత్యేక హోదాపై ఉక్కుపాదం మోపి, రకరకాలుగా మాట్లాడి ప్రజల మనోభావాలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు అని కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రత్యేక హోదా సంజీవనా..? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని మాట్లాడారన్నారు. అంతటితో ఆగకుండా కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా..? అని చంద్రబాబు అవమానించారన్నారు. ఎన్నికలు దగ్గరపడ్డాయని ప్రత్యేక హోదా కోసం తానే పాటుపడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలెవరూ విశ్వసించరన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, రైతుల కళ్లలో సంతోషం ఇవన్నీ వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు.  

   
Back to Top