తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ (ఏవీఎస్‌ఎమ్, విఎస్‌ఎమ్) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌ను సీఎం వైయస్ జగన్ సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. ఈఎన్‌సీ చీఫ్‌గా రాజేష్ పెంధార్కర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ వివరించారు. తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్‌సీ) ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో బహుపాక్షిక నావికా విన్యాసమైన మిలన్ 2024 కు విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 57 దేశాల నుంచి ప్రముఖులు, నౌకాదళాల భాగస్వామ్యం ఉంటుందని అంచనా, మిలన్ 2024 విశేషాలను సీఎంతో పంచుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. సీఎం వైయస్ జగన్‌కు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను రాజేష్ పెంధార్కర్ బహూకరించారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ విఎస్‌సి రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిషోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ ఉన్నారు.