ఏలూరు జిల్లా: అప్పులపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి పార్టీల నేతలు, ఎల్లోమీడియా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ విఫరీతంగా అప్పులు చేస్తున్నారని విష ప్రచారం చేశారని తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా.. వారు అల్లిన కట్టుకదలన్నీ బట్టబయలు అయ్యాయని తెలిపారు. వైయస్ జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశాడంటూ శ్రీలంకతో పోల్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైయస్ జగన్ రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారన్నారు. తాజాగా ఈ ప్రభుత్వమే కేవలం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే అని ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక కేవలం 9 నెలల్లోనే లక్ష కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇటీవల జీడీ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలను దూలం నాగేశ్వరరావు తప్పుపట్టారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులకు ఏ పనులు చేయవద్దు, పథకాలు ఇవ్వవద్దని చంద్రబాబు అనడం దుర్మార్గమన్నారు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హులన్నారు. వైయస్ జగన్ హయాంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.