విజయవాడ: సీఎం వైయస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేస్తోందని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. సీఎం వైయస్ జగన్‌ను కించపరిచేలా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈవో స్పష్టం చేశారు. సీఈవోకు ఫిర్యాదు చేసిన వారిలో లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మద్దాళి గిరి, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఎ.నారాయణమూర్తి, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఉన్నారు.