శ్రీకాకుళం: సంక్షేమం అంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గత 20 నెలల్లో సీఎం వైయస్ జగన్ చేపడుతున్న పథకాలే పంచాయతీల్లో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుల విజయానికి కారణమయ్యాయని తెలిపారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపోల్స్‌లోనూ పంచాయతీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం వైయస్ జగన్ మీద ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమం అటకెక్కిందన్నారు. ప్రజలు ఇప్పుడు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన డ్రామాని చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన అన్నారు. ఎన్ని డ్రామాలు వేసినా మసి పూసి మారేడు కాయ చేయలేరని తెలిపారు. సీఎం వైయస్ జగన్ మంత్రి వర్గంలో పనిచేయడం గొప్పవరమని కృష్ణదాస్ చెప్పారు. అమరావతి రైతుల దీక్షలు చంద్రబాబు పుణ్యమే అని విమర్శించారు. రైతును మేము గౌరవిస్తామని.. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, పెన్షన్లు నిలిపివేస్తున్నామనడం అవాస్తవమన్నారు. అర్హులు అయితే చాలు పార్టీతో తమకు సంబంధం లేదని డిప్యూటీ సీఎం కృష్ణదాసు తేల్చిచెప్పారు.