తాడేపల్లి: తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించిన పార్టీ నాయకులు, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన ఐదేళ్ల పాలనలో అంబేడ్కర్ ఆశయాలను నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు. అంతే కాకుండా అంబేడ్కర్ భావజాలం భవిష్యత్ తరాలకు చేరాలనే ఉద్దేశంతో రూ.400 కోట్లు వెచ్చించి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టతో పాటు, ఆయన పేరుతో ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కులమతాలకు అతీతంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన అందిస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కులాలు, వర్గాల పేరుతో ప్రజలను విడగొడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఇంకా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, విద్యా రంగాన్ని నాశనం చేయడంతో, పేద పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జగన్‌గారు నిర్మించారనే అక్కసుతో అంబేడ్కర్ స్మృతివనాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబుకి, అంబేడ్కర్ పేరెత్తే అర్హత కూడా లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ జగన్‌గారి మీద కోపంతో అంబేడ్కర్ విగ్రహానికి పోటీగా అంతకన్నా పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పడం, కచ్చితంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడమేనని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..: అంబేడ్కర్ ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు: లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ. – దేశంలో విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరికీ సమానమైన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం, ఆయన నడిచిన మార్గంలో, ఆయన ఆశయాలతోనే ఐదేళ్లపాటు వైయస్ జగన్ గారు పాలన సాగించారు. కులమతాలు, పార్టీలు అనే తారతమ్యం లేకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడు భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా భూమి ఆకాశం ఉన్నంతకాలం మన మధ్యనే ఉంటారు. భావితరాలకు అంబేడ్కర్ భావజాలం చేరకూడదనే కుట్ర : మేరుగు నాగార్జున. మాజీ మంత్రి. – ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. పేద ప్రజల గుండె చప్పుడుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపడేసి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తున్నారు. ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల పరిస్థితి దారుణంగా తయారైంది. వారం వారం అప్పులతో చంద్రబాబు రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలకు తీవ్రంగా వెన్నుపోటు పొడిచాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. పేదలను చదువులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది :టీజేఆర్ సుధాకర్‌బాబు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. – దేశ నిర్మాణంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశ ముద్ద బిడ్డ అంబేడ్కర్‌ను స్మరించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే అవుతుంది. ఆయన రచించిన రాజ్యాంగం భావిభారత నిర్మాణానికి దిక్సూచి వంటిది. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని అంబేడ్కర్ ఎంతగానో తపించే వారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్, తన హయాంలో ఐదేళ్ల పాలనలో విద్యా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు మనబడి ద్వారా ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు థీటుగా తీర్చిదిద్దారు. ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ హయాంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యావిధానాలు తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే చంద్రబాబు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాజ్యాంగంతో స్వేచ్ఛ, సమానత్వం :కొమ్మూరి కనకారావు. పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్. – సమాజానికి దశ, దిశ నిర్దేశించిన గొప్ప నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ఆయన రచించిన రాజ్యాంగ లక్ష్యాలను వైయస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో సాధించారు. అన్ని వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించి అంబేడ్కర్ కోరుకున్న సామాజిక సమానత్వం, మహిళా సాధికారత తన పాలన ద్వారా చూపించారు. మళ్లీ వైయస్ జగన్ గారిని సీఎంగా చేసుకున్నప్పుడే రాష్ట్ర పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం పొందగలుగుతారు. అంబేడ్కర్ విగ్రహం పెడితే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు :జూపూడి ప్రభాకర్‌రావు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. – అంబేడ్కర్ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ గారి పాలన సాగింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో అందిన ఇంగ్లిష్ మీడియం చదువులకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. అందరికీ నాణ్యమై విద్య అందాలన్న అంబేడ్కర్ ఆశయాలకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఇలాంటి ప్రభుత్వానికి అంబేడ్కర్ పేరెత్తే అర్హత కూడా లేదు. 2014–19 మధ్య తన ఐదేళ్ల పాలనలో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు శంకుస్థాపనకే పరిమితం అయితే, వైయస్ జగన్ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్తించి, స్మృతివనాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఆ అక్కసుతోనే అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కనీసం చంద్రబాబు అక్కడికెళ్లి నివాళులు అర్పించకపోగా, కనీస వసతులు కల్పించకుండా అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం పెడితేనే ఓర్వలేకపోతున్న చంద్రబాబు ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని భావించడం ఒట్టి మాటే. అక్కసుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం సరికాదు :నందమూరి లక్ష్మీ పార్వతి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. – రాజ్యాంగ నిర్మాణంలో తన పేరును కూడా చేర్చమని ఎంతో పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారు ఆ పోరాటానికి తగినట్టుగానే భవిష్యత్ తరాలకు దిక్సూచిని అందించే గొప్ప రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలను పైకి తెచ్చేవిధంగా ఆయన రచించిన రాజ్యాంగం వేదాలకన్నా గొప్పది. అంబేడ్కర్ ఆశయాలను, లక్ష్యాలను సాధించిన గొప్ప నాయకులు వైయస్ జగన్ ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో పని చేస్తున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన వైయస్ జగన్ కృషిని ఎంత పొగిడినా తక్కువే. తాను నిర్మిస్తానని నమ్మించి పక్కన పెట్టేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ నిర్మించారని చంద్రబాబుకి అక్కసు. ఆ అక్కసుతోనే అంతకన్నా పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ సీఎం అయ్యాక మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి.