ప్ర‌తి కుటుంబం ఆనందంగా ఉండాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి త‌ప‌న‌

 డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు 

 తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబం నిరంతరం ఆనందంగా ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుక్షణం పరితపిస్తున్నార‌ని డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు  పేర్కొన్నారు. నవరత్నాలు – ద్వైవార్షిక మంజూరు కార్యక్రమం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు, లబ్ధిదారులు మాట్లాడారు. 

మంత్రి ఏమన్నారంటే... 
అందరికీ నమస్కారం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబం నిరంతరం ఆనందంగా ఉండాలని సీఎంగారు అనుక్షణం పరితపిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలని ఆలోచన చేయడం, ఆ ఆలోచనను అమలు చేయడం, ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్‌ మోడ్‌లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఏ కారణం చేతనైనా ఎవరికైనా లబ్ధి రాకపోయినా ఆ కుటుంబం కూడా మాకు జగనన్న చేస్తారు అనే నమ్మకం, ధైర్యంతో మాకు చెబుతున్నారు. అవ్వాతాతలు మా మనవడు మాకు చేస్తున్నారు అనడం, చిన్నారులు కూడా మా జగన్‌ మామ ఇస్తున్నారనడం, మేం చక్కగా చదువుకుంటున్నామంటే మా జగన్‌ మామే కారణం అంటున్నారు. గతంలో ఒకరికి వస్తే నలుగురికి వచ్చేవి కావు, కానీ ఇప్పుడు శాచురేషన్‌ మోడ్‌లో ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్‌ గారు మళ్ళీ సీఎం అయితేనే మేం ఆనందంగా ఉంటామని ప్రజలు అంటున్నారు. ధన్యవాదాలు.

ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి

అందరికీ నమస్కారం, ప్రజలకు మేలు చేయాలంటే మీరు తీసుకున్నటువంటి అనేక సాహసోపేతమైన అనేక నిర్ణయాలు ఉదాహరణగా చెప్పవచ్చు. జగనన్న పాలనలో మూడు స్తంభాలు ఏమంటే మొదటిది పారదర్శకత, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ అందించడం, రెండోది జవాబుదారీతనం ఇందులో గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. మూడోది అవినీతిరహిత పాలనలో భాగంగా డీబీటీ కింద నేరుగా లబ్ధిదారులకు రూ. 2.33 లక్షల కోట్లు సాయం చేయడం. ఇవి దేశంలోనే ఆదర్శమైన పాలనకు నిదర్శనంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలా చేయలేదు, ఏ పథకాలు ఎవరికి ఇచ్చారో తెలీని పరిస్ధితి, కానీ ఇప్పుడు వెతికిమరీ అందజేస్తున్నారు. ప్రతి పేదవాడి కళ్ళలో సంతోషం, వారి ఇళ్ళలో సౌభాగ్యం నింపాలని మీరు తపన పడుతున్నారు, ప్రజలు మా భవిష్యత్‌ నువ్వే జగనన్నా అంటున్నారు, ఇది సహించలేని ప్రతిపక్షం రోడ్ల మీదకొచ్చి మొరుగుతున్నారు, కానీ వారు ప్రజల హృదయాలు గెలుచుకోలేరు. ప్రజలందరి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారు. జనం మెచ్చిన పాలనలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

కళ్యాణి, లబ్ధిదారు, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా

అన్నా నమస్కారం, నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలకు రెండు విడతలుగా అమ్మ ఒడి వచ్చి మూడో విడత రాలేదు, ఎందుకు రాలేదా అని బాధపడ్డాను, అప్పుడు వలంటీర్‌ వచ్చి మీ బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ కాలేదు అది చేయిస్తే డబ్బు వస్తుందన్నారు, నేను ఆ పని చేసి వలంటీర్‌కు ఇచ్చాను. దాంతో నాకు అమ్మ ఒడి వచ్చింది, గతంలో మేం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు గడప దగ్గరకే వచ్చి అన్నీ అందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా రాకపోయినా మళ్ళీ ఇస్తున్నారు. మా పాలిట మీరు దేవుడు అన్నా. మేం గతంలో ఎన్నడూ ఇలాంటి పరిపాలన చూడలేదు. మా పిల్లలకు చక్కటి పుస్తకాలు ఇచ్చి బాగా చదువు చెబుతున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, మేం కూడా అంతగా పెట్టలేం అన్నా, మీరు సొంతమేనమామలా చూసుకుంటున్నారు. నాడు నేడు కింద స్కూల్స్‌ బాగా అభివృద్ది చేశారు, టీచర్స్‌ కూడా బాగా చెబుతున్నారు, ఈ నాలుగున్నరేళ్ళ పాలన చాలా బావుంది, మేం సంతోషంగా ఉన్నాం, మీరు నవరత్నాలు ప్రవేశపెట్టి మమ్మల్ని రత్నాలుగా తీర్చిదిద్దారు, మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి, ధ్యాంక్యూ అన్నా.

నాగశేషు, లబ్ధిదారు, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా

నమస్తే సార్, నేను చేనేత కార్మికుడిని, నేను గతంలో కూలి మగ్గం నేసేవాడిని కానీ ఇప్పుడు సొంతమగ్గం నేస్తున్నాను. గత జులైలో నేతన్న నేస్తం కి అప్లై చేసుకుని వెరిఫికేషన్‌ సమయంలో లేకపోవడంతో రాలేదు, మళ్ళీ అప్లై చేసుకుంటే ఇప్పుడు అప్రూవ్‌ అయి డబ్బులు రావడంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో మేం పనితనం మెరుగుపరుచుకుని ఇంకా మా సామర్ధ్యం పెంచుకుంటాం, మాకు మీ వల్ల సొంతింటి కల నెరవేరింది, మాకు అనేక పథకాలు అందుతున్నాయి, కూలీమగ్గం వల్ల రోజుకు రూ. 200 వచ్చేవి కానీ ఇప్పుడు సొంతమగ్గం వల్ల రోజుకు రూ. 500 సంపాదిస్తున్నాను. మా ప్రాంతంలో గవర్నమెంట్‌ స్కూల్స్‌ కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా చేశారు. మా ఇంటి దగ్గరే సచివాలయం ఉండడంతో ప్రభుత్వమే మా ఇంటి దగ్గర ఉందనే సంతోషంగా ఉంది. మా ధర్మవరంలో నేతన్న నేస్తం గతంలో ఎప్పుడూ రాలేదు, కానీ మీరు ఇస్తున్నారు, మీకు మా నేతన్నల తరపున కృతజ్ఞతలు, మా బడుగు బలహీనవర్గాల కోసమైనా మీరు మళ్ళీ సీఎం కావాలి, మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం, థ్యాంక్యూ సార్‌. 

నాగరాజ, లబ్ధిదారు, తిమ్మాయపాలెం, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా

అన్నా నమస్కారం, నేను పదిహేనేళ్ళుగా టైలరింగ్‌ వృత్తిలో ఉన్నాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల వల్ల చేదోడులో భాగంగా మొదటి ఏడాది తీసుకున్నాను, కానీ తర్వాత టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల తీసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నాకు మళ్ళీ వచ్చాయి, నాకు ఇద్దరు పిల్లలు, వారిని ఇంగ్లీష్‌ మీడియం చదివించలేకపోయాననే బాధ గతంలో ఉండేది కానీ ఇప్పుడు కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌మార్చారు, నేను కలలో కూడా అనుకోలేదు ఇంత మార్పు వస్తుందని, మీరు మరింత కాలం సీఎంగా ఉంటే మా పిల్లల చదువులు పూర్తవుతాయి, అందరూ లీడర్స్‌ అవుతారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే డైనమిక్‌ లీడర్‌ మీరు అన్నా, నాకు పెట్టుబడి సాయం కూడా అందుతుంది, నాకు అన్నదమ్ములు లేరు, సొంత అన్న కూడా ఇంత చేయలేరు, మీరు నాకు దేవుడు ఇచ్చిన అన్న, నాకు గతంలో వికలాంగుల ఫించన్‌ రాలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరంలో అప్లై చేశాను, నాకు సర్టిఫికెట్‌ కూడా వచ్చింది, నాకు కూడా త్వరలో వికలాంగుల పెన్షన్‌ వస్తుంది, మీరు ఎంత న్యాయబద్దంగా పనిచేస్తున్నారో ప్రభుత్వం కూడా అంతే న్యాయబద్దంగా పనిచేస్తుంది, వంట గదికే పరిమితం అయ్యే మహిళలను ఒక మహిళా శక్తిగా, ఆదిశక్తిగా తీర్చిదిద్దారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా, మా అందరి దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి, మాకు మీరే సీఎంగా ఉండాలి, మిమ్మల్ని తప్పనిసరిగా గెలిపించుకుంటాం.

Back to Top