వారెవరైనా ఉపేక్షించేది లేదు

అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

అమరావతి: అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే  కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరించారు. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్ట్‌లలో నిఘా పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మద్యం అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేసి, మళ్లీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్‌ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్‌ స్టాక్‌ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్‌ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ లాక్‌డౌన్‌ కారణంగా మద్యం అమ్మకాలను నిషేధించారని తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమించి కొంతమంది టీడీపీ అనుకూల బార్‌ ఓనర్లు మద్యాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతమైన ధరలకు విక్రయిస్తున్న ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు. దీంతో వెంటనే ఆ బార్ల లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే చిత్తూరులో టీడీపీకి చెందిన భాస్కర్‌ నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో అతని బార్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేశామని వెల్లడించారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తే 18004254868, 94910 30853, 0866 2843131 ఈ టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని మంత్రి నారాయణస్వామి సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top