తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఈరోజు ఉదయం దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయం వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా..? అర్థం కావడం లేదన్నారు. ఛీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం వీర్రాజు వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సింహం లాంటి వ్యక్తి, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని మంత్రి నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ప్రధాని మోడీ గుర్తించాలన్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం వైయస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు మెండుగా ఉంటాయన్నారు.