నాడు చెప్పులేయించి.. నేడు పాదపూజ అంటూ బాబు డ్రామాలు

చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చాడా..? 

సిగ్గు, శరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే

రాజమండ్రి సభకు ఎన్టీఆర్‌ అభిమానులు వెళ్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

ఎన్టీఆర్‌కు నిజమైన అభిమానులు వైయస్‌ఆర్‌ సీపీలోనే ఉన్నారు

డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ: స్వర్గీయ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన, మానసికంగా వేధించి, ఆయన చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. పిల్లనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను మానసికంగా వేధించి చంపేసి.. నేడు పాదపూజ చేస్తా అంటూ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి పేరుతో చంద్రబాబు ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి కొట్టు మీడియాతో మాట్లాడుతూ.. సిగ్గు, శరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. బాబు దుర్మార్గ పరిపాలన చూసే 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారన్నారు. మహానాడు కోసం బలవంతపు జనసమీకరణ చేస్తున్నారన్నారు. పదవిలో ఉండగా చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చాడా..? ఎప్పుడైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అడిగాడా..? అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టి గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని మంత్రి కొట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. 

కాపుల ఓట్ల కోసం రిజర్వేషన్‌ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేశాడని గుర్తుచేశారు. చంద్రబాబు మాయలో కాపు సామాజికవర్గం పడొద్దని కోరారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కాపులకు అండగా నిలిచారన్నారు.  ∙తుని ఘటన కేసులను సైతం వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. ఎన్టీఆర్‌కు నిజమైన అభిమానులు వైయస్‌ఆర్‌ సీపీలోనే ఉన్నారన్నారు. మొదటి నుంచీ ఎన్టీఆర్‌ను గౌరవించింది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమేనని చెప్పారు. రాజమండ్రి సభకు ఎన్టీఆర్‌ అభిమానులు వెళ్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.  
 

Back to Top