విజయవాడ: దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు.. రాజకీయాల గురించి మాట్లాడటం పద్ధతి కాదని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపీకి జరగకూడదనే సీఎం వైయస్ జగన్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. అమరావతి రాజధాని కాదని సీఎం వైయస్ జగన్ ఎప్పుడైనా చెప్పారా..? ప్రశ్నించారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చంద్రబాబు చెప్తే బాగుండేదన్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.