మద్యం బ్రాండ్లపై టీడీపీ తప్పుడు ప్రచారం

మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు

మద్యం షాపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై వేటు

ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము రికవరీ చేస్తున్నాం

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

విజయవాడ: మద్యం బ్రాండ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం షాపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై వేటు వేశామని, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రికవరీ చేస్తున్నామన్నారు. తప్పు చేసిన అధికారులపై సస్పెన్షన్‌ వేటుతో పాటు జైలు శిక్ష కూడా విధించామని చెప్పారు. మంత్రి నారాయణస్వామి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం షాపుల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యల్లో భాగంగా ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామన్నారు. 

విశాఖలో జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించామని, సీఎం ఆదేశాల మేరకు ఎంక్వైరీ వేశామని చెప్పారు. మద్యంలో రూ.25 లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు హెడ్‌ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతో పాటు వీరిలో కొంతమందిని జైలుకు పంపించామన్నారు. మొత్తం కేసుల్లో సుమారు రూ.2,56,82,340 ఆదాయ దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.1,07,66,320 రికవరీ చేశామని, ఇంకా రూ.1,49,16,020 రికవరీ చేయనున్నట్లు వివరించారు.   

ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానం మేరకు మద్యపాన నిషేధం పథకాన్ని ప్రభుత్వం చక్కగా అమలు చేస్తోందని మంత్రి నారాయణ స్వామి చెప్పారు. మద్య నిషేధం పథకం వల్ల ప్రతి కటుంబం సంతోషంగా ఉందన్నారు. సెబ్‌ ఏర్పాటు చేసి.. దాని ద్వారా అనేక మార్పులు తీసుకువచ్చారని, డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు సెబ్‌లో చాలా నియమ నిబంధనలతో పనిచేస్తున్నారని వివరించారు.  

‘ప్రెసిడెంట్‌ మెడల్‌ విక్సీ చంద్రబాబు హయాంలోనే వచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టలరీలకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ డిస్టలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవే. బాబు హయాంలో మద్యం ఏరులై పారింది. టీడీపీ హయాంలో జరిగిన మద్యం అవకతవకలు, మద్యం కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో తెలిపితే.. దానికి సమాధానం చెబుతా’ అని మంత్రి నారాయణస్వామి అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top