ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్ఛందంగా ముందుకురండి

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్‌లో జరిగిన ప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 711 మంది పాల్గొన్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా చెప్పారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరం పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారని, దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామన్నారు. వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారన్నారు. ఎవరూ భయపడవద్దని, ప్రజలందరి ఆరోగ్యం కోసం ప్రార్థనలకు వెళ్లినవారంతా బయటకు రావాలన్నారు. దేవుడి దయవల్ల కరోనా వైరస్‌ వల్ల రాష్ట్రంలో ఎవరూ మరణించలేదని, జిల్లా వ్యాప్తంగా 138 మంది శ్యాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపగా, 65 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రొద్దుటూరులో ఏడుగురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. 

Back to Top