పశ్చిమ గోదావరి: గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఏజెన్సీలో వెంటనే మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. బుట్టాయిగూడంలో 10 ఎకరాలు స్థలంలో రూ. 75 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏడు ఐటీడీఏ పరిధిలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి ఆళ్ల నాని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.11,400 కోట్లను సీఎం వైయస్ జగన్ కేటాయించారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అదనoగా మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడేo కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి ఆళ్ల నాని తనిఖీ చేశారు. అనంతరం బుట్టాయిగూడం కమ్యూనిటీ హాస్పిటల్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో మళ్లీ ఏజెన్సీకి వస్తానని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం నూతనంగా మంజూరైన మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి స్థలాన్ని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు.