ప్రజారోగ్య పరిరక్షణలో ఎంత ఖర్చుకైనా వెనకాడం

వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం

రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరం, వ్యాక్సిన్లపై ప్రధానికి సీఎం లేఖ రాశారు

ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

ఆక్సిజన్‌ వృథా కాకుండా ప్రతి జిల్లాలో మానిటరింగ్‌ సెల్‌

రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు

క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధ్వజం

మంగళగిరి: ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలను పేదలకు అందించిన సీఎం వైయస్‌ జగన్‌.. వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నీచ రాజకీయాలు చేస్తూ చంద్రబాబు వికృతానందం పొందుతున్నాడని మండిపడ్డారు. వ్యాక్సిన్ల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తెలియదా..? సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ గురించి తెలియదా..? అని చంద్రబాబును మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. 

కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేట అయ్యింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సబ్‌ కమిటీ సభ్యులు, మంత్రులు మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘కోవిడ్‌ నియంత్రణ కార్యక్రమాల్లో ప్రధానమైన అంశాలు ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజక్షన్, బెడ్స్, డాక్టర్స్‌ రిక్రూట్‌మెంట్, టెస్టింగ్, హోంఐసోలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు వంటి అంశాలపై గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ భేటీలో చర్చించడం జరిగింది. 

తిరుపతిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా, ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. నిన్న జరిగిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్‌ పైపులైన్‌లన్నింటినీ పరిశీలించాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్‌ నిల్వల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.  

మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో దాదాపు రెట్టింపు కేసులను ఎదుర్కొంటున్నాం. అంతకు ముందు సుమారు 10 వేల కేసులు ఎదుర్కొంటే.. ఈ రోజు దాదాపు 20 వేలకు పైబడి కేసుల సంఖ్య నమోదవుతుంది. మొదటి వేవ్‌లో 15 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నప్పటికీ గరిష్టంగా 240 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే ఉపయోగించుకునేవాళ్లం. 15 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌లో 50 శాతం ఖాళీగానే ఉండేవి. కానీ, రెండో దశలో వైరస్‌ సోకిన వారికి ఆక్సిజన్‌ తప్పనిసరి అయిపోయింది. గతంలో 15 వేలు ఉంటే.. సెకండ్‌ వేవ్‌లో 25,500 ఆక్సిజన్‌ బెడ్స్‌ పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మరో 10 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ను జిల్లాల్లో సిద్ధం చేస్తున్నాం. 

కేంద్రం 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే మన రాష్ట్రానికి కేటాయించింది. ఆక్సిజన్‌ పూర్తిగా వినియోగించుకుంటున్నప్పటికీ కొరత ఎదుర్కొంటూనే ఉన్నాం. ఆక్సిజన్‌ వినియోగం, స్టోరేజీ, ఉత్పత్తికి సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ అనేక సూచనలు చేశారు. వాటి అమలుకు అధికారులను ఆదేశించారు. మరింత సమర్థవంతంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆక్సిజన్‌ సరఫరాను పెంపొందించుకునేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఎంపిక చేసి స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించారు. 

కేంద్రం నుంచి ఆక్సిజన్, వ్యాక్సిన్‌ తెప్పించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కోవిడ్‌ పరిస్థితులను వివరిస్తూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉందని ప్రధానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆక్సిజన్‌ కోటా పెంచుతుందని ఆశిస్తున్నాం. ఆక్సిజన్‌ స్టోరేజీ కెపాసిటీని పెంచుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. 600 మెట్రిక్‌ టన్నులకు పెంచుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 

జిల్లాల్లోని టీచింగ్, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో దాదాపు 49 మినీ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిధులు కూడా జోడించి ప్రతి జిల్లాలో నూతనంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

సీఎం విజ్ఞప్తుల మేరకు మొదట్లో 420 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ఆక్సిజన్‌ కేటాయింపు.. నేడు 590 మెట్రిక్‌ టన్నుల కోటా సాధింంచుకోగలిగాం. భవిష్యత్తులో కోటాను పెంచాల్సిన అవసరాన్ని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్సిజన్‌ ఎక్కడా వృథా కాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలో మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. నెల్లూరులో అధికారులు ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయడం ద్వారా వార్డుల్లో నిరంతర పర్యవేక్షణతో దాదాపుగా 4–5 టన్నుల ఆక్సిజన్‌ను ఆదా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కూడా పర్యవేక్షణకు మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ జాగ్రత్తగా చేయాలని ఆస్పత్రుల యాజమాన్యాన్ని, మానిటరింగ్‌ సెల్‌ వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. 

వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరించి బాధ్యత లేని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. రాజకీయ లబ్ధిపొందాలని వికృతానందంతో మాట్లాడుతున్నాడు. సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ గురించి చంద్రబాబుకు తెలియదా..? ప్రజల పట్ల కక్షపూరిత ధోరణితో బాబు వ్యవహరిస్తున్నారు. భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం చంద్రబాబుకు సన్నిహితులు.. బాబు ఒక్క మాట చెబితే రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కోటా పెంచుతారు ఆలోచన చేయండి అంటే.. నాకేం సంబంధం.. నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు. 

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలనే సాహసోపేతమైన నిర్ణయాన్ని సీఎం వైయస్‌ జగన్‌.. ఇతర రాష్ట్రాలకంటే ముందుగా తీసుకున్నారు. రూ.1600 కోట్లు వ్యాక్సినేషన్‌కు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. 7 కోట్ల వ్యాక్సిన్లలో 73 లక్షల డోసులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన వ్యాక్సిన్‌ డోసులు ఇస్తే ప్రజలకు సత్వరమే వ్యాక్సిన్‌ ఇస్తామని, కోవిడ్‌ బారి నుంచి ప్రజలను రక్షించుకుంటామని కేంద్రాన్ని అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ఒకే రోజు 6 లక్షల డోసులు వేశాం. 6 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు కూడా రాశాం. కరోనా లాంటి విపత్కర సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం.. రూ.1600 కోట్లు వ్యాక్సిన్లకు వెనకాడుతారా..? అన్న ఇంగింతం కూడా లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు’ అని మంత్రి ఆళ్ల నాని ధ్వజమెత్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top