మంగళగిరి: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్ పెంచామన్నారు. అవసరానికి తగ్గట్టుగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని, రెమిడెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ‘కరోనా రోగులు పూర్తిగా కోలుకొని తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకునే విధంగా సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా అవసరమైన చర్యలన్నింటిపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరికీ కావాల్సిన వైద్యం, ఆస్పత్రుల్లో సౌకర్యాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదు. ఎక్కడైనా పొరపాటు జరిగితే మా దృష్టికి తీసుకురండి.. సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఉందని తెలిసిన వెంటనే బెడ్స్ పెంచడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఆక్సిజన్ కొరత లేకుండా, రెమిడెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. కనీస విచక్షణ, ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం మీద కూడా రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు తీరుతో ప్రజలు కూడా క్షోభను అనుభవిస్తున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏనాడూ చంద్రబాబు ఆలోచించిన పాపాన పోలేదు. తనను ఓడించారని ప్రజల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వం సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలు చేపడుతుంటే.. ప్రతిదాంట్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ప్రజలకు అండగా ఉండాలనే కనీస జ్ఞానం లేని చంద్రబాబు.. ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. ఆక్సిజన్, బెడ్స్ కొరత అంటూ, రెమిడెసివిర్ ఇంజక్షన్ దొరకడం లేదని చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జూమ్ మీటింగ్‌లతో లోకేష్, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రానికి వస్తే వాళ్లను ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తెలుస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు, లోకేష్‌లను ఎవరూ క్షమించరు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాలని చంద్రబాబును కోరుతున్నా’ అని మంత్రి ఆళ్ల నాని సూచించారు.