రాజమండ్రి: అత్యంత పారదర్శకంగా కరోనా నివారణ చర్యలు చేపడుతున్నామని, టెస్టులు చేయడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు ఆళ్ల నాని, విశ్వరూప్, కన్నబాబు, ఎంపీ మార్గాని భరత్ కరోనా నివారణ చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు సీఎం వైయస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కరోనా నివారణకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. టెస్టులు ఎక్కువగా చేయడం వలనే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. టెస్టులు చేస్తే పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతాయని తెలిసినా కూడా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సీఎం సూచించారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ నివారణ చర్యలు ఏ విధంగా అమలు అవుతున్నాయి.. ఆస్పత్రులు, డాక్టర్ల పనితీరు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆహార నాణ్యత వంటి అంశాలను పరిశీలన చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 6 కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయని, అదనంగా మరో 4 ఆస్పత్రులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం 2 కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయని, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరొకటి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారన్నారు. జిల్లాలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా డాక్టర్లు, స్టాఫ్, నర్సులు, టెక్నిషియన్స్ రిక్రూట్‌మెంట్ త్వరలో పూర్తిచేస్తామని మంత్రి ఆళ్ల నాని వివరించారు. పారదర్శకంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు సరికాదని మంత్రి ఆళ్ల నాని ధ్వజమెత్తారు. విపత్కర పరిస్థితులను రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నామని వివరించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహార నాణ్యతపై దృష్టిపెట్టామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఎక్కడా రాజీపడకుండా ప్రతి కోవిడ్ పేషెంట్‌పై రూ.500 వెచ్చిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ వైద్యానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని దహనం చేయడంలో బంధుమిత్రులు ఎటువంటి అపోహలకు పోవద్దన్నారు.