రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తాడేపల్లి: ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు 9 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని, వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మంత్రి ఆళ్ల నాని ∙మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్ష బెడ్స్‌ సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 బెడ్స్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. అదే విధంగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారని, ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, నిత్యావసరాలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారని, ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఈ రోజు సమీక్షలో ఆదేశించారు. 500 ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌ మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నచోట ప్రజల కదలికలను కట్టడి చేసేందుకు నిత్యావసరాల కోసం ఇంటికి ఒక్కరికే పాస్‌ ఇస్తున్నామన్నారు.

వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. టెలీ మెడిసిన్‌ ద్వారా మందులు సరఫరా చేస్తామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీనే అని, దేశంలో దాదాపు 10 లక్షల టెస్టులు జరిగితే.. దానిలో 1,14,937 టెస్టులు ఏపీలోనే చేయడం జరిగింది. మిలియన్‌ జనాభాకు 2,152 పరీక్షలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 488 మంది డిశ్చార్జ్‌ అయ్యారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 
 

 

Back to Top