ముస్లీం యువతపై దేశద్రోహం కేసులు పెట్టినప్పుడు ఎక్కడ దాక్కున్నావ్ రామోజీ..?

ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి  ఎస్‌.బి. అంజాద్‌ బాషా 
 
మైనార్టీలపై చంద్రబాబు, రామోజీలది కపట ప్రేమ

ముస్లీం యువతపై దాడులంటూ రాతలు సరికాదు

 రాజకీయ గొడవల్లో అన్ని మతాల వారు ఉండటం సహజమే..

 బాబు కోసమే రామోజీ మతచిచ్చును రాజేస్తున్నాడు  

 బాబు హయాంలోనే మైనార్టీలపై దాడులు
 
నువ్వు పెట్టిన దేశద్రోహం కేసులు ఏ మైనార్టీ మర్చిపోడు చంద్రబాబూ...

 బాబుకు ముస్లీంలంటే ఆది నుంచీ చిన్నచూపే..

 ఆయన మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకీ చోటివ్వలేదు

 మైనార్టీలపై బాబు, రామోజీలది కపటప్రేమ

 మతవిద్వేషాల్ని రెచ్చగొట్టేవిధంగా ఈనాడు కథనాలు 

 అన్ని వర్గాలనూ చేయిపట్టుకు నడిపించే నాయకుడు వైయ‌స్‌ జగన్

ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి శ్రీ ఎస్‌.బి. అంజాద్‌ బాషా స్పష్టీకరణ

వైయ‌స్ఆర్ జిల్లా: ముస్లీం యువతపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దేశద్రోహం కేసులు పెట్టినప్పుడు రామోజీ రావు ఎక్కడ దాక్కున్నాడ‌ని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి  ఎస్‌.బి. అంజాద్‌ బాషా సూటిగా ప్ర‌శ్నించారు. ఈరోజు ఈనాడు రామోజీరావు తన పత్రికలో మతవిధ్వేషాలను రెచ్చగొట్టే వార్త రాశాడు. ముస్లీం యువతపై దాడులంటూ రాయడం ఎంతవరకు సబబు...? ఈ సందర్భంలో నేను చంద్రబాబు ప్రభుత్వాన్ని గుర్తుచేస్తు న్నాను. ముస్లీం మైనార్టీ సామాజికవర్గాలంటే ముందునుంచీ చంద్రబాబుకు చిన్నచూపే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీలకు స్థానం కల్పించలేదు. కనీసం, గెలవగలిగే అసెంబ్లీ స్థానాలనూ ఏనాడూ ముస్లీంలకు కేటాయించలేదు. , ఆయనకు ఆదాయపరంగా, విద్యాపరంగా వెనుకబడిపోయి, చిన్న చిన్న కూలిపనులతో కష్టపడి బతికే ముస్లీం మైనార్టీ వర్గాలంటే చంద్రబాబుకు చాలా హీనమైన అభిప్రాయం ఉండేది. ఈ విషయాలన్ని తెలిసీ కూడా ఆనాడు రామోజీరావు ఎందుకు స్పందించలేదు. మైనార్టీలను అణగొదొక్కింది చంద్రబాబేనని ఈనాడు పత్రికలో ఎందుకు రాయలేదు..?

వైయ‌స్‌ఆర్‌ కడప జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడారు.

 చంద్రబాబు పాలనలో మైనార్టీలకు ఏం ఒరగబెట్టారు..?
పదవులు, పనుల్లోనూ అన్నింటా ముస్లీం మైనార్టీలను చంద్రబాబు ప్రభుత్వం పక్కనబెట్టింది. 2014 నుంచి 2019 వరకు బాబు ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఏం జరిగింది..? భారతదేశ చరిత్రలో మైనార్టీకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులకు దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు... మరి మైనార్టీలేం పాపం చేశారని  ఈనాడు రామోజీరావుకు అడగడానికి నోరు రాలేదా..? గతంలో చంద్రబాబు కడప జిల్లాలో కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందివ్వాలని అనుకుంటే..  ఒక శాసనసభ్యుడని కూడా చూడకుండా నన్ను హౌస్‌ అరెస్టు చేశారు. 

ముస్లీంలపై దాడుల్ని మా ప్రభుత్వం ఉపేక్షించదుః
గ్రామాల్లో రాజకీయ ఘర్షణలు జరిగినప్పుడు వాటిల్లో పాల్గొనే వాళ్లు అన్ని కులాలు, మతాలకు చెంది ఉంటారు. అలాంటి గొడవలప్పుడు పోలీసులు శాంతిభద్రతలను కాపాడే భాగంగా ఇరువర్గాలను కట్టడి చేస్తుంటారు. అంతేగానీ, ఎవరినైనా మతాన్ని అడిగి వాళ్లను కట్టడి చేస్తారా..? అదేమాదిరిగానే నిన్న పల్నాడు జిల్లాలో ఒక చిన్న సంఘటన చోటుచేసుకుంది. దీనిపై  ప్రభుత్వం లోతైన విచారణ చేస్తుంది. గొడవలకు పాల్పడిన వారిని  గుర్తించి పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు పంపారు. నిజంగా, ముస్లీం యువతపై దాడులు జరిగితే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంత పెద్దస్థాయి వ్యక్తులైనప్పటికీ తప్పు చేస్తే ఉపేక్షించే పరిస్థితే లేదు. 

మంచిని రాయడం చేతకాదా..?
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక నవరత్నాల్లో భాగంగా 87శాతం అన్ని సామాజికవర్గాలకు లబ్ధి జరుగుతుంటే ఈనాడు పత్రిక ఎక్కడా రాయడం లేదు. ఒక్క  మైనార్టీలకే ఈ నాలుగేళ్లలో డీబీటీ, నాన్‌డీబీటీ కింద రూ. 21,600 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన ఘనత మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది.  ఆది నుంచి చంద్రబాబుకు మైనార్టీలంటే చిన్నచూపని, ఆయన పనిగట్టుకుని మైనార్టీలపై వివక్ష చూపుతాడని ఈనాడు రామోజీరావుకు తెలియదా..? గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం జరిగినప్పుడు రామోజీ ఒక్క వార్త కూడా రాయలేదు. మా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుకుని మైనార్టీలు సుఖసంతోషాలతో ఉన్నారని ఈనాడు ఎందుకు రాయదు..?   

 నాడు ‘నారా హమారా..’ కేసుల్ని మరిచారా..?
గుంటూరులో మైనార్టీలకు సంబంధించిన ‘నారా హమారా..’ అంటూ టీడీపీ బహిరంగ సభ జరుగుతుంటే.. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదని మైనార్టీ యువత ఒక ప్లకార్డు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహ కేసులు బనాయించి జైళ్లకు పంపడాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మర్చిపోతాడు. కానీ వీటిని ముస్లీంలు ఏ విధంగా మరిచిపోగలరు..? ఈవిధమైన మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నాలను రామోజీరావు తన పత్రికలో ఎందుకు ప్రచురించలేదు.?

మాపై కేసుల్ని ఉపసంహరిస్తేనే ఓర్వలేని బాబుః 
ఇదే గుంటూరులో ముస్లీం యువతపై భారీగా కేసులు నమోదు చేసి చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది. ఆరోజుల్లో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా.. పోలీసుస్టేషన్లలో న్యాయం జరిగే అవకాశం లేకపోయినా ముస్లీం మైనార్టీలు నోరుమెదిపే పరిస్థితి లేదు. అందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం కేసులు బనాయిస్తే.. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి రాగానే కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటే బాబు ఓర్వలేని ప్రయత్నాలకు పాల్పడిన సంగతి ప్రతీ ఒక్క ముస్లీం మైనార్టీ గుర్తుంచుకుంటాడు. 

నా మైనార్టీలకు అన్న జగనన్నః
నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాడా..?  50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వాలని చట్టం చేసి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, అది మా జగన్‌మోహన్‌రెడ్డి గారే అని గర్వంగా చెప్పుకుంటాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ముందెన్నడూ ఎరుగని విధంగా  మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నప్పుడు రామోజీరావుకు ఎందుకు కనిపించడంలేదు..? ‘నా మైనార్టీ..’ అంటూ  మైనార్టీలను చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వాలు గతంలో లేవు. జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనలో మైనార్టీలకు పెద్దపీట వేస్తూ.. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నాడు. అన్ని నామినేటెడ్‌ పదవుల్లో మైనార్టీలకు అగ్రపీఠం వేసి 12 మందికి రాష్ట్ర చైర్మన్‌ పదవులు, నలుగురు శాసనసభ్యులు, నలుగురు శాసనమండలి సభ్యులు కాగా అందులో ఒక మైనార్టీ మహిళకు డిప్యూటీ చైర్మన్‌ పదవి కట్టబెట్టి మైనార్టీ నాయకులుగా మమ్మల్ని పైమెట్టుకు తీసుకెళ్లారు. 

పచ్చమీడిమా పంథా ఇకనైనా మార్చుకుంటే మంచిదిః
ముస్లీం మైనార్టీ వర్గాలపై చంద్రబాబుతో పాటు ఆయన్ను భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా తాను అనుసరిస్తున్న పంథాను మార్చుకోవాలి.  బాబు హయాంలో మైనార్టీలపై మీరెందుకు ప్రేమ చూపలేకపోయారు..? ఇప్పుడున్న ప్రభుత్వం చూపుతున్న ప్రేమను చూసి మీరెందుకు తట్టుకోలేకపోతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పదవులు, సంక్షేమ పథకాల అందజేతలో మైనార్టీలకు వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఈ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడటం సమంజసం కాదు. మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మైనార్టీలను జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే, మేమంతా ఆయనకు అండగా ఉన్నాం. మంచి జరిగే కార్యక్రమాలపై వార్తలు రాయడం తప్ప కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను మానుకోవాలని చంద్రబాబు, రామోజీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

Back to Top