కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ 

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా అక్రమంగా తోడేస్తోంది

తాడేపల్లి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని, జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వ‌ర‌కు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందన్నారు. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని, శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదన్నారు. తెలంగాణ పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద ఎటువంటి పర్యావరణ అనుమతి లేకుండా నిర్మిస్తోందని, ఈ అక్రమ ప్రాజెక్టుతో శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవన్నారు.ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకొని, ఏపీకి న్యాయం చేయాల్సిందిగా కేంద్రమంత్రిని లేఖ ద్వారా కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top