ఆ రెండింటినీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది

న‌గ‌రి బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం

ప్రతి పిల్లాడిని, పాప‌ను చెయ్యి పట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నాం

తద్వారా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం

జ‌గ‌న‌న్న విద్యాదీవెన పిల్లల భవిష్యత్ మార్చబోయే పథకం

ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

8,44,336 తల్లుల ఖాతాల్లో రూ.రూ. 680.44 కోట్లు జ‌మ చేస్తున్నాం

విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ. 15,600 కోట్ల ఆర్థిక సాయం అందించాం

విద్యాసంస్థల్లో వ‌స‌తులు, బోధ‌న బాగాలేక‌పోతే 1902కు ఫోన్ చెయ్యండి

విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చాం.. కేవ‌లం నాలుగేళ్ల‌లో రూ.69,266 కోట్లు ఖ‌ర్చు చేశాం

ఎంత‌మంది పిల్ల‌లున్నా బ‌డుల‌కు, కాలేజీల‌కు పంపించండి.. వారిని మీ అన్న‌, మీ త‌మ్ముడి ప్ర‌భుత్వం చ‌దివిస్తుంది

నాలుగేళ్ల పాల‌న‌లో రూ.2.33 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్చాం

గత పాలనకు, మీ బిడ్డ పాల‌న‌కు మ‌ధ్య తేడా గమనించండి

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

సొంతకొడుకుపై నమ్మకంలేక దత్తపుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చి తెచ్చుకున్నాడు

చంద్రబాబు రాజకీయం చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్దాలే

గొడవలు సృష్టించి శవరాజకీయాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారు

మ‌నం మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. మంచి జ‌రిగితే మీ బిడ్డ‌కు మీరే సైనికులుగా నిల‌బ‌డండి

చిత్తూరు: ‘‘నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంతో పోటీపడాలంటే వారి ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని ఈ రెండింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని మనస్ఫూర్తిగా నమ్మి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో నాలుగేళ్ల పాలనలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి పిల్లాడిని చెయ్యి పట్టుకొని పెద్ద చదువులు చదివించి.. తద్వారా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెనతో వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తూ అక్షరాల 9,32,235 మంది పిల్లలకు మంచి చేస్తూ నేరుగా బటన్‌ నొక్కి 8,44,336 మంది పిల్లల తల్లుల ఖాతాల్లోకి అక్షరాల రూ.680 కోట్లను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు. నగరిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో విద్యా దీవెన పథకం ద్వారానే అక్షరాల 26,98,728 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 24,53,389 మంది పిల్లల తల్లుల ఖాతాల్లోకి కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 11,317 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూర్తి ప్ర‌సంగం..
దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమం నగరి నుంచి శ్రీకారం చుడుతున్నాం. మీ అందరి ఆప్యాయతల మధ్య, చెరగని చిరునవ్వుల మధ్య నిల్చొని, మీ ప్రేమానురాగాల మధ్య మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడి సదా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నగరిలో జరుగుతున్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం. తల్లిదండ్రుల పేదరికం పిల్లల పెద్ద చదువులకు, వారి భవిష్యత్తుకు అడ్డు రాకూడదనే మంచి మనసుతో పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరించే ఈ కార్యక్రమమే జగనన్న విద్యా దీవెన అని చెప్పడానికి గర్వపడుతున్నా. వంద శాతం పూర్తి ఫీజును ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే రీయింబర్స్‌ చేసే కార్యక్రమం. ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలలకు సంబంధించిన ఫీజును పెద్ద చదువులు చదువుతున్న పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా నేడు జమ చేస్తున్నాం. 

17–20 సంవత్సరాల మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంతో పోటీపడాలంటే వారి ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని మనస్ఫూర్తిగా నమ్మి పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. అలాంటి చదువులు పేదకుటుంబంలోని ప్రతి పిల్లాడికి అందాలని, ఆ తల్లిదండ్రులకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని వందశాతం ఫీజులు తల్లుల అకౌంట్‌లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన, అదే మాదిరిగా ఆ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు మాత్రమే కాదు.. భోజన, వసతి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని జగనన్న వసతి దీవెన పేరుతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. 

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి ఐటీఐ విద్యార్థికి రూ.10 వేల చొప్పున. పాలిటెక్నిక్‌ చదువుతున్న పిల్లాడికి రూ.15 వేల చొప్పున, డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు చదువుతున్న పిల్లలకు రూ.20 వేల చొప్పున సంవత్సరానికి రెండు దఫాల్లో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన పథకంతో ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల రూ.4,275 కోట్లు ఆ పిల్లల పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లో జమ చేశాం. 

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కేవలం ఈ రెండే పథకాల ద్వారా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు తోడుగా ఉంటూ, ఆ కుటుంబాలకు అండగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన సొమ్ము అక్షరాల రూ.15,600 కోట్లు అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఫీజులు మొత్తం నేరుగా కాలేజీల యాజమాన్యాలకు ఇవ్వకుండా.. పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ తల్లిదండ్రులు ఆ కాలేజీలకు వెళ్లి.. పిల్లలు ఎలా చదువుతున్నారని తెలుసుకోవాలి. కాలేజీల్లో విద్యా బోధన, వసతులు బాగాలేకపోతే వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు.. తల్లిదండ్రులకు ఇస్తూ విద్యా దీవెన సొమ్ము తల్లుల ఖాతాల్లో జమ చేసి వారి ద్వారానే ఫీజులు కట్టించే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. డబ్బు వచ్చిన వారం, పది రోజులకు ఆ కాలేజీలకు వెళ్లి పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి.. వసతులు ఎలా ఉన్నాయి.. బోధన ఎలా చేస్తున్నారో అడగండి.. బోధన, వసతులు సరిగ్గా లేకపోయినా ఆ కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు మీ అన్న మీ చేతుల్లో పెడుతున్నాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తున్నాను. వసతులు, బోధన బాగోలేకపోయినా, అధిక ఫీజులు డిమాండ్‌ చేసినా వెంటనే 1902 నంబర్‌కు ఫోన్‌ చేయండి.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి తప్పిదాలు చేయకుండా కట్టడి చేస్తుంది.. యాక్షన్‌ తీసుకుంటుంది. ఈ అధికారాన్ని నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టి ఫీజులు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. 

మనందరి ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే విద్యావిధానంలో ఎంతగా విప్లవాత్మక మార్పులు తెచ్చామో ఈ సందర్భంగా ప్రతి పిల్లాడికి, ప్రతి అక్కచెల్లెమ్మలకు తెలిసి ఉండాలి. 

 • పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వం. పిల్లలను చదువులకు పంపించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. 
 • ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగ్, బైలింగ్వెల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం, షూస్, డిక్షనరీ ఇటువంటివి అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్స్‌ తెరిచే రోజు ఇచ్చేలా విద్యా కానుక కార్యక్రమం తీసుకువచ్చాం. 
 • స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకువచ్చే కార్యక్రమం నాడు–నేడుతో అడుగులు వేగంగా వేయిస్తున్నాం. 
 • గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చాం. ప్రతి గవర్నమెంట్‌ బడిలోనూ బైలింగ్వెల్‌ టెక్స్‌›్టబుక్స్‌ తీసుకువచ్చి పిల్లలకు తోడుగా ఉంటూ.. బైజూస్‌ కంటెంట్‌ కూడా పిల్లల చదువుల కరికుళంలోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగేళ్లలో జరిగింది. 
 • మూడో తరగతి నుంచి ఇప్పటికే గవర్నమెంట్‌ బడుల్లో సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టును తీసుకువచ్చాం. క్లాస్‌ రూమ్‌కు ఒక టీచర్‌కు కూడా గతిలేని పరిస్థితుల్లో ఉన్న గత పాలనకు, ఈరోజు సబ్జెక్ట్‌కు టీచర్‌ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల్లో మీ అన్న, మీ తమ్ముడి పాలనలో జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా
 • మూడో తరగతి నుంచే టోఫెల్‌ ఓరియంటేషన్‌తో బోధన కూడా వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సీబీఎస్‌ఈ సిలబస్‌తో ప్రారంభించి ఏబీ, ఏజీసీఎస్సీ ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ దిశగా కూడా మన గవర్నమెంట్‌ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నా. 
 • ఇంతకు ముందు ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా.. నాడు–నేడు పూర్తయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ను డిజిటలైజ్‌ చేస్తూ ఇంటరాక్టీవ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 64 వేల క్లాస్‌ రూమ్‌లకు సంబంధించి 31 వేల క్లాస్‌ రూమ్స్‌లో ఐఎఫ్‌బీ ప్యానల్స్‌ ఏర్పాటయ్యాయి. ఈ డిసెంబర్‌ నాటికి మిగిలిన 33 వేల క్లాస్‌రూమ్స్‌లో ఏర్పాటవుతాయి. ఇలాంటి గొప్ప అడుగు పడింది కూడా మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 
 • 8వతరగతిలోకి రాగానే ఆ పిల్లాడికి, ప్రతి పాపకు ఆ చదువులను ప్రోత్సహిస్తూ పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని తాపత్రయపడుతూ ట్యాబ్స్‌ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది కూడా ఈ నాలుగు సంవత్సరాల మీ అన్న, మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

గవర్నమెంట్‌ బడుల్లో రోజుకో మెనూతో మధ్యాహ్న భోజనం గోరుముద్ద కార్యక్రమంతో విపరీతమైన మార్పులు తీసుకువచ్చాం. ప్రతి పిల్లాడు ఏం తింటున్నాడు.. తినే ఆహారం బాగుందా లేదా అనే ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అంటే అది కేవలం మీ అన్న పరిపాలనలోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా. 
అంగన్‌వాడీ పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తూ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. స్కూళ్లలో ఆడపిల్లల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. 
చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే కచ్చితంగా ప్రతి ఒక్కరూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనతో వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫాను కూడా ఉన్నత విద్యను మరింత ప్రోత్సహిస్తూ తీసుకువచ్చిన కార్యక్రమాలు..

పెద్ద చదువుల కోసం..
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ అన్న ప్రభుత్వంలో ఏ రకంగా అడుగులు పడ్డాయో గమనిస్తే..
ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలి. ప్రతి ఒక్కరూ డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదవాలి.. చదువులు మానేసే పరిస్థితి ఉండకూడదని పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన తీసుకువచ్చాం. విద్యకు సంబంధించిన ఖర్చు మాత్రమే కాకుండా బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చులు భరిస్తూ వసతి దీవెన పథకం తీసుకువచ్చాం. ఈ రెండే కాకుండా ప్రతి విద్యార్థి చదువుల్లో గొప్ప అడుగులు వేయాలని మొట్టమొదటి సారిగా ప్రపంచంతో పోటీపడుతూ విదేశాల్లో టాప్‌50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీస్‌లో దాదాపు 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం రూ.1కోటి 25 లక్షల వరకు వారి ఫీజులను సైతం పూర్తిగా చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు.. ఒక్క మన రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో తప్ప అని ప్రతి అక్కకు తెలియజేస్తున్నాను.
మన రాష్ట్రంలో పేద పిల్లల కుటుంబాల తలరాతలు మార్చేది కేవలం ఈ కార్యక్రమాల మీదనే. కరికుళంలో మార్పులతో అడుగులు వేస్తున్నాం. కరికుళంలో మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ తీసుకువచ్చాం. జాబ్‌ ఓరియంటెడ్‌గా అడుగులు వేస్తున్నాం. డిగ్రీ చదువుల్లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ కచ్చితం చేశాం. ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. కేవలం ఈ పథకాల మీద మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,266 కోట్లు. 

రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని గొప్పగా జీవించే పరిస్థితి రావాలని మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా పర్వాలేదు.. చదువుల కోసం మీరు ఇబ్బందులు పడొద్దు.. పిల్లలను బడులకు, కాలేజీలకు పంపించండి. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో ఎలాంటి కత్తిరింపులు లేవు. ప్రతి పిల్లాడిని చదివించే బాధ్యత నాది. తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా ప్రతి పిల్లాడికి విద్యా దీవెన, వసతి దీవెన మీ అన్న, మీ తమ్ముడు ఇచ్చి చదివిస్తాడని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు తెలియజేస్తున్నాను. 

మనందరి ప్రభుత్వం ఇంటింటా ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, జెండర్‌ పరమైన న్యాయం అందాలని, పిల్లలకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు, ప్రతి సామాజికవర్గానికి మంచి చేయాలని వేస్తున్నాం. 

మరోవైపు ఇంటింటికీ, ఏ సామాజికవర్గానికి, ప్రాంతాలకు ఏ మంచీ చేయని గత పాలకుడు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు చెబుతాను. 

 • దుర్మార్గమైన ఆలోచనలు చేసే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 28 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు.. మరీ చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్‌ అయినా ప్రజలకు గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నా.. గత ప్రభుత్వం పేరు చెబితే, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్‌ కూడా గుర్తుకురాదు.. ఆలోచన చేయండి.. గతానికి, నాలుగు సంవత్సరాల మన పాలనకు తేడా ఏంటో ఆలోచన చేయండి. 
 • చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అందరికంటే ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు మాట ఇస్తే.. ఆ మాటను నిలబెట్టుకున్నాడా..? చంద్రబాబు ఏదైనా వాగ్దానం చేసి నిలబెట్టుకున్నాడా..? ఒక్కసారి ఆలోచన చేయండి. 
 • అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తినడానికి కూడా వెనకాడడు. చివరకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి చంద్రబాబు. 
 • సొంత బలం మీద, కొడుకు మీద నమ్మకం లేదు. కాబట్టే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అద్దెకు తెచ్చుకుంటున్నాడు. చంద్రబాబు మనస్తత్వం, రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలతో నిండిపోయింది. 
 • చంద్రబాబు, కొడుకు, దత్తపుత్రుడు వీరంతా మీటింగ్‌లలో మాట్లాడుతున్నప్పుడు వీరి మాటలు, భాష ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి మాటలోనూ కుతంత్రం చేయాలి, రెచ్చగొట్టడం, గొడవలు సృష్టించాలని, తద్వారా శవరాజకీయాలు చేయాలని వీరి మాటల్లో కనిపిస్తున్నాయి. వీరితో పాటు ఎల్లో మీడియా చంద్రబాబును ఏరకంగా మోస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 • ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకునే గత చరిత్ర ఏదీ లేదు కాబట్టి వీరంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఇవే జీవితంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నారు. 
 • చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లలో జరిగిన ఘటన అందరికీ తెలుసు. కార్లలో తుపాకులు పెట్టుకొని మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు. క్రరలు ఎత్తారు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. పర్మిషన్‌ ఉన్న దారిలోనే ప్రయాణం చేయండి.. అనుమతి లేని దారులకు వెళ్తే లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుంది.. దయచేసి అనుమతి తీసుకున్న దారుల్లో వెళ్లండి అని చెప్పిన పోలీసులపై క్రరలు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. చివరకు ఓ పోలీస్‌ సోదరుడి కన్ను కూడా పోగొట్టారు. అక్షరాల 47 పోలీసుల మీద దాడి చేశారు. దాడి చేసి, రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చేయాలనే దిక్కుమాలిన ఆలోచన కలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. 

ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయల్దేరాడు.. ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలిసి.. రాష్ట్రంలో తనపై హత్యాయత్నం చేయడానికి పోలీసులు యత్నించారని ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడంట. దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని.. అధికార పార్టీపై నెపమోపడానికి ఢిల్లీకి బయల్దేరాడు. ఇలాంటి దారుణమైన అబద్ధాలు, మోసాలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా..? ఎన్టీఆర్‌ సీఎం కుర్చీని లాగేసుకున్నాడు.. వెన్నుపోటు పొడిచాడు.. ఎన్టీఆర్‌ పార్టీని లాగేసుకున్నాడు.. ఎన్టీఆర్‌ చావుకు కారణం కూడా వీరే అయ్యారు. కానీ, ఇదే వ్యక్తులు, ఇదే దుర్మార్గులు మళ్లీ ఎన్టీఆర్‌ చనిపోగానే.. ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కొని, ఫొటోలకు దండలు వేస్తారు.. ప్రతి రోజూ దండం పెడుతూ ప్రతిరోజూ ఫొటోలు దిగుతూ తిరుగుతున్నారు. ఎన్టీఆర్‌ పేరు మీద ఒక కాయిన్‌ రిలీజ్‌ చేస్తుంటే.. ఆ కార్యక్రమంలో కూడా నిసిగ్గుగా పాలుపంచుకుంటాడు ఇదే చంద్రబాబు. 

చంద్రబాబు రైతులను మాయమాటలతో మోసం చేశాడు. ఎన్నికల వేళ 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. రుణాలు కట్టకండి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటు వేయండి అని చెప్పి రైతులను నిట్టనిలువునా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రుణాలు కట్టొద్దు.. బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ తీరుస్తాడని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. అక్కచెల్లెమ్మలను వంచించడమే కాకుండా వారి తరఫున కడుతున్న సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ప్రతి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి నిలువునా దగా చేశాడు. చివరకు పిల్లలను, నిరుద్యోగులనూ వదల్లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల భృతి ఇస్తానన్నాడు.. ఎంతమందికి నెల నెలా నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చాడు..? ప్రతి అడుగులోనూ మోసమే. 

ఎన్నికలకు ముందు ఇదిగో మ్యానిఫెస్టో అని తీసుకువస్తాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. ఎన్నికల తరువాత మేనిఫెస్టో వెతికితే ఆయన వెబ్‌సైట్‌లో కూడా మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గం అంటాడు.. ఎన్నికల తరువాత ప్రజలకు నరకం చూపించే వ్యక్తి చంద్రబాబు. 

ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తికి.. చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వానికి తేడా ఎంత ఉందో ఆలోచన చేయండి. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు, అప్పులు ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్‌ సమస్యలు.. ఖర్చులు పెరిగి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావించాం. సాకులు వెతకాలేదు, కారణాలు చూపి తప్పించుకోవాలనే ఆలోచన చేయలేదు.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే నా అక్కచెల్లెమ్మలు బాగుండాలనే తపన, తాపత్రయంతో నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. రూ.2.33 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్చాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 

అదే రాష్ట్రం, అదే ప్రభుత్వం, అదే బడ్జెట్‌.. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. గతంలో చేసిన అప్పుల గ్రోత్‌ కంటే మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. అప్పట్లో చంద్రబాబు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు. అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే.. అప్పట్లో పాలన దోచుకో, పంచుకో, తినుకో.. ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, టీవీ5కి ఇంత, దత్తపుత్రుడికి కాసింత, చంద్రబాబుకు మిగిలినందంతా.. జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే ప్రతి అడుగులోనూ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో చూశారు. 

ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా గతం కంటే తక్కువే. కానీ, మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి వివక్ష లేదు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో డబ్బులు వెళ్తున్నాయి. తేడా గమనించాలని కోరుతున్నాను.

అభివృద్ధి గురించి విమర్శించి మాట్లాడే వారికి సమాధానం చెప్పండి.. గవర్నెన్స్‌లో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా దేశానికే రోల్‌ మోడల్‌గా ఆంధ్రరాష్ట్రంలో పాలన జరుగుతుందంటే.. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా.. మీరు కూడా వారిని అదే అడగండి. 

రూపురేఖలు మారిన స్కూళ్ల పరిస్థితిని, కాలేజీల పరిస్థితిని చూపించండి. గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వస్తుంది.. నాడు–నేడుతో పనులు జరుగుతున్నాయి. ఐఎఫ్‌బీ ప్యానల్స్, పిల్లల చేతుల్లో ట్యాబ్స్, కరికుళంలో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన, ఏ పిల్లాడు ఎక్కడా ఇబ్బంది పడకుండా చదువుల్లో వేగంగా అడుగులు ముందుకేస్తున్నాడు. ఇది కాదా అభివృద్ధి అని గట్టిగా ప్రశ్నించండి. 

ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. మొట్టమొదటి సారిగా ప్రివెంటీవ్‌ కేర్‌ను విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా దేశానికే పరిచయం చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. నాడు–నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గవర్నమెంట్‌ ఆస్పత్రి కూడా సెంట్రల్‌ గవర్నమెంట్‌ కంటే బెటర్‌గా పనిచేసే పరిస్థితిలోకి వెళ్తుంది. ఈరోజు 53 వేల మంది ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌ అయ్యారు. స్పెషాలిటీ డాక్టర్ల కొరత నేషనల్‌ యావరేజ్‌లో 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో కేవలం 3.98 శాతం మాత్రమే. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరేంటీ అని ప్రశ్నించండి. మా అన్న ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో ఉన్న మొత్తం పోర్టులు 6 పోర్టులు ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయని చెప్పండి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు, ఒక ఫిషింగ్‌ హార్బర్‌తో ఏకంగా 10 ఫిషింగ్‌ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతుంది కూడా మీ అన్న హయాంలోనే అని చెప్పండి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా నంబర్‌ వన్‌స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పండి. 

మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు.. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి అదే నిజం అని నమ్మించే వ్యవస్థలు వారికి తోడుగా ఉన్నాయి. వారి మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు లేదు.. మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు.. మీ బిడ్డలో కల్మషం లేదు.. మీ బిడ్డ నమ్ముకుంది చేసిన మంచిని. వీరు చెబుతున్న అబద్ధాలను, మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేద అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం.. మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి అని తెలియజేస్తున్నాను. 

మంచి చేసే పరిస్థితులు దేవుడు మెరుగ్గా ఇవ్వాలని, ఇంకా మంచి చేసే రోజులు రావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనందరి ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top