ఇదే నా రాష్ట్రం..ఇదే నా కుటుంబం

కమలాపురం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు

ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని నేను అనడం లేదు

దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అనడం లేదు

నాయకుడనే వాడికి విశ్వసనీయత ఉండాలి

గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసింది

మన ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చాం

గడప గడపకూ వెళ్లి జరిగిన సంక్షేమాన్ని వివరిస్తున్నాం

 జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శ్రీకారం

కమలాపురం నియోజకవర్గంలో రూ.905 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు

వైయస్‌ఆర్‌ జిల్లా: ఇదే నా రాష్ట్రం..5 కోట్ల ప్రజలే నా కుటుంబం..ప్రజల సంక్షేమమే నా విధానమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నేను ప్రజలనే నమ్ముకున్నానని, చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదని వెల్లడించారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. జిందాల్‌ కంపెనీ ఆధ్వర్యంలో రూ.8,800 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే..గతంలోనూ అదే బడ్జెట్‌..ఇప్పుడూ అదే బడ్జెట్‌..గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. గజదొంగల మాదిరిగా దోచుకోవడం, పంచుకోవడమే వారి పని అని వివరించారు. కమలాపురంలో రూ.905 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

 ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...: 

ఈ రోజు కమలాపురం నియోజకవర్గంలో నా కుటుంబసభ్యుల మధ్య ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.
 
చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు ఇప్పడే కాదు.. నాన్న చనిపోయిన తర్వాత కూడా, నాన్న చనిపోలేదు మా గుండెల్లోనే ఉన్నాడు, నువ్వు మా బిడ్డ.. రాష్ట్రం వైపు నువ్వు చూడు మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం అని మీరు దీవించి పంపితే ఈ రోజు మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవుడు ఆశీస్సులతోఎన్నో మంచి పనులు చేయడంతో పాటు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వా తాతలకు మంచి చేసే అవకాశం ఇచ్చి మీ సమక్షంలో నన్ను ఉంచినందుకు పేరు, పేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

దివంగత నేత హాయంలోనే....
కమలాపురం నియోజకవర్గంలో ఈరోజు మంచి పనులకు ప్రారంభోత్సవం జరుగుతుంది. పులివెందుల పొరుగునే ఉన్న నియోజకవర్గం మాత్రమే కాదు.. ఇక్కడ ఉన్న వెనుకబాటును జయించడం కోసం, గాలేరు నగరి తీసుకునిరావడం కోసం అప్పట్లో దివంగత నేత నాన్నగారు చేసిన పనులు నేను చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ కృష్ణా నది ? ఎక్కడ కడప జిల్లా ? అటువంటి కృష్ణానది కడప జిల్లాకు వచ్చిందంటే ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిగారు కృషి ఎంత ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత....
నాన్నగారు తర్వాత ఆగిపోయిన ఇరిగేషన్‌ పనులన్నీ మనం చూస్తున్నాం. చిత్రావతి డ్యామ్‌ను నాన్నగారి హయాంలో పూర్తిగా నిర్మించారు. అంతకముందు దశాబ్ధాలు పాటు ఎవరూ పట్టించుకోలేదు. నాన్నగారు పూర్తి చేసిన ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలవని పరిస్థితి. 10 టీఎంసీల సామర్ధ్యమున్న ఆ ప్రాజెక్టులో గతంలో ఏ రోజూ పూర్తిగా నీళ్లు నింపని పరిస్థితి. మూడు టీఎంసీల నింపితే గగనం. అటువంటి చిత్రావతిలో ఇవాళ 10 టీఎంసీల నీళ్లు నింపగలిగాం అంటే కారణం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.250 కోట్లతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చాం కాబట్టే.. 10 టీఎంసీల నీళ్లు నింపగలిగాం.

గండికోట ప్రాజెక్టు..
గండికోట ప్రాజెక్టునే తీసుకుంటే.... 27 టీఎంసీల సామర్ధ్యం. నాన్నగారి హయాంలో దేవుడి దయతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయగలిగారు.  27 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆ ప్రాజెక్టులో ఏ రోజు కూడా కనీసం 10–13 టీఎంసీల నీళ్లు నింపలేని పరిస్థితి. గత ప్రభుత్వ 5 సంవత్సరాల పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. 
మరలా మీ బిడ్డ ముఖ్యమంత్రిఅయిన తర్వాత అదే గండికోటకు మరో రూ.550 కోట్ల ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద మీ బిడ్డ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు గండికోటలో 27 టీఎంసీల నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న బ్రహ్మం సాగర్‌ 17 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు. ఏ రోజు కూడా గత ప్రభుత్వ హయాంలో కనీసం 5–6 టీఎంసీల నీళ్లు కూడా నింపని పరిస్థితి. అటువంటి బ్రహ్మంసాగర్‌కు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగు గంగ కెనాల్‌ మోడరనైజేషన్‌ కింద రూ.500 కోట్లు ఖర్చు చేసి, జీరో టూ 42 కిలోమీటర్ల వరకూ లైనింగ్‌ పనులు పూర్తి చేస్తే.. ఈ రోజు బ్రహ్మంసాగరంలో 17 టీఎంసీల పుల్‌ రిజర్వాయర్‌ కెపాసిటీతో నీళ్లు నిలబడ్డాయి.

మన కళ్లెదుటనే ఉన్న ఈ ప్రాజెక్టుల పరిస్థితి కాస్త అర్దం కావాలనే చెప్పాను. కారణం ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మన జిల్లా గురించి కానీ, ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి కానీ, జిల్లాలో రైతాంగం గురించి కానీ ఏ రోజూ పట్టించుకున్న దాఖలాలు గతంలో ఎప్పడూ జరగలేదు. మళ్లీ ఈ రోజు అటువంటి పరిస్థితి ఉందంటే.. ఈ జిల్లాలో ప్రతి ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రతి అడుగూ వేసే పరిస్థితి ఉందంటే... కార్యాచరణ జరుగుతుందంటే కారణం మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి  స్ధానంలో ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను.

కమలాపురంలో అభివృద్ది పరుగులు...
ఈ రోజు కమలాపురంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు మీ వాడిగా మీ అందరి ముందుకు వచ్చాను. కమలాపురంలో ఈ రోజు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు అక్షరాలా రూ.905 కోట్ల విలువైనవి. 

ఏయే పనులు చేయబోతున్నామో క్లుప్తంగా వివరిస్తాను.
ముందుగా 6914 ఎకరాలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న తపన, తాపత్రయంతో కొప్పర్తిలో ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధి చేస్తున్నాం.

కొప్పర్తి ఇండస్ట్రియల్‌ పార్కు....
ఒక్క ఈ కొప్పర్తిలో 6914 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు కనుక పూర్తయితే... ఇందులో 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ పెడుతున్నాం. జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కింద మరో 3,155 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును అభివృద్ధిను చేస్తున్నాం. ఈ పార్కులో ప్రతి పరిశ్రమ పూర్తయితే... కేవలం కొప్పర్తిలోనే ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో మాత్రమే లక్ష ఉద్యోగాలు వస్తాయి.

ఇండస్ట్రియల్‌ పార్కు కూడా పూర్తయితే కనీసం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి. వీటికి సంబంధించి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డిక్సన్‌ వంటి కంపెనీలకు సంబంధించి కట్టడాలు కూడా మొదలయ్యాయి. ఈ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు...  మరో రూ.275 కోట్లతో ఈ రోజు మరో శంకుస్ధాపన కూడా చేస్తున్నాం. ఈ కొప్పర్తి పార్కుకు బ్రహ్మంసాగరం నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించేలా...  33.4 కిలోమీటర్ల పైపులైన్‌ ప్రాజెక్టుకు ఈ రోజు రూ.150 కోట్లతో ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరో రూ.38 కోట్లతో ఇక్కడే సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణానికి కూడా ప్రారంభోత్సవం చేశాం.

మల్టీ మోడల్‌ లాజిస్టిక్ పార్కు...
రూ.54 కోట్లతో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతుంది.  ఇది కాక కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ.. పోర్టు నుంచి ఇక్కడికి రైల్వే లైను వేయడానికి రూ.68 కోట్లతో కార్గో టెర్మినల్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కూడా చేసేందుకు ప్రారంభోత్సవం చేశాం. ఇవన్నీ ధ్యాస పెట్టి చేస్తున్నాం. రాబోయే సంవత్సరాలలో చదువుకున్న మన పిల్లలకు ఇక్కడే మన జిల్లాలోనే మన ఇంటి పక్కనే ఉద్యోగాలు రావాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.

మరో రూ.34.50 కోట్ల వ్యయంతో కొప్పర్తితో ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ నిర్మాణం చేస్తున్నాం. మరో 268 కోట్లకు పైగా  ఖర్చయ్యే వివిధ రోడ్డు పనులకు కూడా శంకుస్ధాపన చేశాం. ఈరోజు రేణిగుంట  రాయలచెరువు, పాత కడప రోడ్డు గుండా కమలాపురం, ఓబులంపల్లి, రావణపల్లికి అనుసంధానం చేస్తూ రూ.25.7 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. కమలాపురంలో రూ.39 కోట్లతో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి ( ఆర్‌ఓబీ) నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. కమలాపురానికి మేలు జరిగే ప్రాజెక్టు ఇది.

బైపాస్ రోడ్డు నిర్మాణం....
జిల్లా కేంద్రానికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలాపురం పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందాలని కమలాపురాన్ని నగర పంచాయితీ అప్‌గ్రేడ్‌ చేశాం. అంతే కాకుండా రూ.88 కోట్లతో బైపాస్‌ రోడ్డు ప్రాజెక్టుకు కూడా... పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చి ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్ధాపన చేశాం. ఇందులో కేవలం భూసేకరణ కోసమే రూ.16 కోట్లు వ్యయం కానుండగా.. మిగిలిన రూ.72 కోట్ల వ్యయంతో కమలాపురానికి బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది.

రూ.82 కోట్లతో వంతెన..
కాజీపేట, కమలాపురం రోడ్డు నుంచి సంబటూరుకు రూ.3.82 కోట్లతో 4.35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం తలపెట్టాం. దీన్ని వచ్చే ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేశాం. వల్లూరు, ఆదినిమ్మాయపల్లె రోడ్డు, చిన్నమాచిపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పనులను రూ.22 కోట్లతో చేపట్టాం.  కోగటం పాయసంపల్లె రోడ్డుకు రూ.8 కోట్లు కేటాయించాం. అది కూడా జరుగుతుంది. పాపాఘ్ని నది మీద వంతెన నిర్మాణం మరో ముఖ్యమైన ప్రాజెక్టు. కారణం రేణిగుంట, కడప, ముద్దునూరు మధ్య కనెక్టివిటీకి ఈ వంతెన చాలా కీలకమైనది. రూ.82 కోట్ల వ్యయంతో 1.81 కిలోమీటర్ల ఈ వంతెన నిర్మాణం కూడా చేపడుతున్నాం. 

సాగునీటి ప్రాజెక్టు పనులకూ శ్రీకారం..
రోడ్లకు సంబంధించిన ఈ కార్యక్రమాలతో పాటు, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌ –1 ఫ్యాకేజీ – 2లో మిగిలిన ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి నడుం బిగించాం. సర్వారాయ సాగర్‌ రిజర్వాయర్‌ మరియు వామికొండ రిజర్వాయర్‌కు సంబంధించి డ్రైన్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా రూ.213 కోట్లతో 35 వేల ఎకరాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ పనులకు సంబంధించి, ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను కూడా పూర్తి చేసేందుకు ఈ డబ్బులు కేటాయించాం. ఆ పనులకు సంబంధించిన శంకుస్ధాపన కూడా ఈరోజే చేశాం. ఈ పనులన్నీ కూడా ఇకపై యుద్ధప్రాతిపదికన ముందుకు వెళ్తాయి.

రూ.93 కోట్లతో పురపాలక, పట్టణాభివృద్ధి, ప్రజా ఆరోగ్యశాఖ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చూస్తే... కమలాపురం పట్టణంలోనే సమగ్ర నీటి సరఫరా కోసం 67.66 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణం చేపడుతున్నాం. దీని ద్వారా 5,500 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వనున్నాం.  రూ.58 కోట్లతో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అంతేకాక వరదనీరు ప్రవహించేందుకు మరో రూ.8 కోట్లతో డ్రైన్‌ నిర్మాణం కూడా చేపడుతున్నాం. కమలాపురంలోనే మరో రూ.5.70 కోట్లతో సెంట్రన్‌ మీడియన్స్, జంక్షన్ల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నాం. ఇక్కడే రోజుకు 5 మిలియన్‌ లీటర్ల సామర్ధ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ని రూ.18.60 కోట్లతో చేపట్టనున్నాం. అంతే కాకుండా మరో రూ.3 కోట్లతో అన్ని వసతులుతో మున్సిపల్‌ భవనం కూడా నిర్మిస్తున్నాం. కమలాపురంలో పేరున్న దర్గా ఇ– గప్ఫారియాకు రూ.2.50 కోట్లతో ప్రహారీ, ఫంక్షన్‌ హాల్, గదుల నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రారంభోత్సవం చేశాం. 

రూ.36 కోట్లతో బీసీలకు మంచి చేసేందుకు బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రూ.15 కోట్లతో 2.18 ఎకరాల్లో రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్‌కు) సంబంధించిన ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఇక్కడే నిర్మిస్తున్నాం. దీనికి కూడా శంకుస్ధాపన చేశాం.
మొత్తంగా ఈ రోజు కమలాపురం నియోజకవర్గానికి మేలు చేసేలా చేస్తున్న శంకుస్ధాపనల విలువ రూ.905 కోట్లు. ఇవన్నీ చేయడానికి మీ బిడ్డ మీ అందరి సమక్షానికి వచ్చాడు.

జనవరిలో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు ....
జిల్లాలో కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి  చివరి వారంలో మరో మంచి కార్యక్రమం కూడా జరగబోతోంది. మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించిన అడుగులు కూడా జనవరి నెలాఖరులో పడుతున్నాయి. ఇది మనందరి కోరిక. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కూడా స్టీల్‌ ప్లాంట్‌ కడతామని విభజన చట్టంలో రాసినా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. అప్పుడున్న పాలకులు, కేంద్రంలో ఉన్న నాయకులు పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితి నుంచి కచ్చితంగా ఆ ప్రాజెక్టు రావాలన్న తపనతో అడుగులు ముందుకు వేసి, ఈరోజు ఆ ప్రాజెక్టును జిందాల్‌ స్టీల్స్‌తో మాట్లాడి... రూ.8,800 కోట్లతో ఫేజ్‌ –1, ఫేజ్‌ –2 కింద చేపట్టేందుకు ముందుకు వచ్చేలా చేశాం.  ఆ ప్రాజెక్టుకు సంబందించి అన్ని రకాలు ఒప్పందాలు పూర్తయి జనవరి చివరిలో వాళ్లతో పాటు మీ బిడ్డగా నేను కూడా వచ్చి పనులు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.

ఇది రైతు, పేద, మహిళ పక్షపాత ప్రభుత్వం
మీ జగనన్న ప్రభుత్వం నిరుపేద, రైతు,మహిళ పక్షపాత ప్రభుత్వం. నేను వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ మూడున్నర సంవత్సరాల మన పరిపాలన చూసిన తర్వాత మీ అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది. అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది. అందుకే ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో వివిధ పథకాల కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా వ్యవస్ధలో ఒక మార్పు తీసుకొచ్చాం. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు... నేరుగా లక్షల కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల అకౌంట్లో పడుతున్నాయి.

మూడున్నరేళ్లలో.... 
రాష్ట్ర వ్యాప్తంగా మీ బిడ్డ బటన్‌ నొక్కి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో అక్కచెల్లెమ్మల అకౌంట్లలోనికి నేరుగా పంపించిన సొమ్ము (డీబీటీ ద్వారా) 1,79,170 కోట్లు. ఇక ఇళ్లు, ఇళ్ల స్ధలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం వంటి నాన్‌ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే మరో రూ.1.41 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 
అక్కచెల్లెమ్మలకు, రైతన్నలకు, అవ్వాతాతలకు ఇక్కడ పుట్టిన మీ బిడ్డ ఈ మేలు చేయగలుగుతున్నాడు.

కమలాపురంలోనే రూ.1017 కోట్లు డీబీటీ...
కేవలం ఒక్క కమలాపురం నియోజకవర్గాన్నే తీసుకుంటే.. ఇక్కడ బటన్‌ నొక్కి  నేరుగా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతల చేతుల్లో పెట్టిన సొమ్ము రూ.1017 కోట్లు. ఈ డబ్బు ఎవరెవరి అకౌంట్లలోకి పోయింది అన్నది నా అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగే లంచాలకు తావులేని ఒక గొప్ప వ్యవస్ధ, వివక్షకు చోటు లేని వ్యవస్ధతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 

కమలాపురం నియోజకవర్గంలో చూసుకుంటే... 72,357 కుటుంబాలు ఈ నియోజవర్గంలో నివసిస్తుంటే ఇందులో 66,955 కుటుంబాలు అంటే 92.53 శాతం కుటుంబాలకు నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మలు, రైతన్నల ఖాతాల్లోకి పంపించగలిగాం.

కమలాపురమైనా... ఇచ్చాపురమైనా....
ఇది కమలాపురం కానివ్వండి ఇచ్చాపురం కానివ్వండి రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా ప్రజలకు సాచ్యురేషన్‌ విధానంలో వివక్ఖకు తావులేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా మీ బిడ్డ మంచి చేయగలుగుతున్నాడు.

గతంలో అడుగడుగునా లంచాలే....
 గతంలో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి  ఆలోచన చేయండి. ఆ రోజు పెన్షన్‌లు తీసుకుంటే ఇచ్చేది రూ.1000. అది కూడా కొందరికీ ఇచ్చేవారు. అది కూడా రావాలంటే మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందినవారు అని. ఇక రెండో ప్రశ్న మూడు నెలల పెన్షన్‌ సొమ్ము జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప పెన్షన్‌ రాని పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఇళ్లు మంజూరు కార్యక్రమమే అరకొర జరిగేది. అది కూడా రావాలంటే రూ.20వేలు జన్మభూమి కమిటీలకు ఇస్తే తప్ప ఇళ్లు మంజూరు కాదు. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు అని చెప్పేవారు. వాటి పరిస్థితి చూస్తే... ఒక గ్రామంలో వేయి మంది అర్హులు ఉండే అందులో ఇద్దరికో, ముగ్గురికో ఇచ్చేవారు. అది కూడా రూ.50 వేలు సబ్సిడీ ఇస్తే అందులో రూ.20 వేలు లంచం తీసుకోనిదే ఇచ్చేవారు కాదు. పెన్షన్‌తో పాటు ఏ పథకం కావాలన్నా లంచాలే. ఇళ్లు, చివరకి మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. చిన్న బీమా కావాలన్నా, పెద్ద బీమా కావాలన్నా చివరకు రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నే లంచాలే. ఆలోచన చేయండి. మీ బిడ్డ పరిపాలనకు అప్పటికీ తేడా చూడండి.
 
అప్పుడు ఒకే రాష్ట్రం, ఒకే బడ్జెట్‌. ఇప్పుడూ ఒకే రాష్ట్రం ఒకే బడ్జెట్‌. అప్పులు చూస్తే అప్పుడు తెచ్చుకున్న అప్పులు గ్రోత్‌ రేట్‌ చూస్తే.. ఇప్పుడు  తెచ్చుకున్న అప్పులు గ్రోత్‌ రేట్‌ అప్పటి కన్నా తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పుడు వాళ్లు ఎందుకు మీ బిడ్డ మాదిరి ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయారు. మీ బిడ్డ మాదిరి ఎందుకు బటన్‌ నొక్కలేకపోయారు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, రైతన్నల ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు పంపించలేకపోయారు అని ఒకసారి ఆలోచన చేయండి. 

ఆ రోజుకీ ఈ రోజుకీ తేడా సీఎం మార్పు 
ఆ రోజుకీ ఈ రోజుకీ తేడా ఒక్కటే. కేవలం ముఖ్యమంత్రి మారాడు, అదొక్కటే తేడా. ఆరోజుల్లో ఆ ముఖ్యమంత్రి దోచుకో, పంచుకో, తినుకో. ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి కేవలం ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు చాలు. వీళ్లను నమ్ముకుంటే చాలని రాజకీయాలు చేశాడు. గజదొంగల ముఠా మాదిరి దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో కలిసి పంచుకోవడం, తినుకోవడం.

కానీ  ఈరోజు మీ బిడ్డ డీపీటీ(దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం) కాదు డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌)ని నమ్ముతున్నాడు. నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మలు, రైతన్నల ఖాతాల్లోకి జమ అవుతున్న పరిస్థితి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నది గుర్తు పెట్టుకొండి.

మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి.
చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనో.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనో నేను అనడం లేదు. చంద్రబాబునాయుడు పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడు మాదిరిగా  ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం. ఇక్కడే నా నివాసం. ఇక్కడే నా మమకారం. ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఇక్కడే నా రాజకీయం. ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి నేను ఈ రోజు గట్టిగా నినదిస్తున్నాను. తేడా గమనించండి.

నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే...
నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనేది నేను గతంలోప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాడిని. నాయకుడు అనేవాడికి విశ్వసనీయత ఉండాలి. నాయకుడు అనేవాడు ఒక మాట చెపితే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికీ ఉండాలి. ప్రతి కార్యకర్తకు ఉండాలి. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఫలానావాడు మా నాయకుడు అని కాలర్‌ ఎగరేసుకుని చెప్పే పరిస్థితుల్లో ఆ నాయకుడు ఉండాలని చెబుతూ ఉండేవాడిని. ఈ రోజు మూడున్నర సంవత్సరాల పరిపాలన తర్వాత నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను... 98 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించి నెరవేర్చిన తర్వాత ఇవాల ప్రతి కార్యకర్త గడప,గడపకూ వెళ్తున్నాడు. ప్రతి ఇంటిలో చెప్తున్నాడు. అక్క, చెల్లి మన అన్న ముఖ్యమంత్రి అయ్యాడు.. బ్రతుకులు మారాయి. ఇదిగో మేనిఫెస్టోలో ఇచ్చిన 98 శాతం హామీలు అమలయ్యాయి అని ప్రతి కార్యకర్త చెప్పగలుగుతున్నాడు. నాయకత్వమంటే ఇది. 

కానీ గతంలో చూస్తే... ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్తారు. 650 పేజీల బుక్‌ ఒక మేనిఫెస్టో రూపంలో ఇచ్చి...  ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితి గతంలో చూసాం. నేను అడుగుతున్నాను అటువంటి నాయకులకు.. మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతుంది.

మీ బిడ్డ ఆ దేవుడ్ని, మిమ్నల్నే నమ్ముకున్నాడు...
నేను మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. మరో 16–18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్నే తప్ప, వేరేవాళ్లనెవ్వరినీ కూడా మీ బిడ్డ నమ్ముకోలేదు. 
వాళ్ల మాదిరిగా నేను ఎల్లో మీడియాను నమ్ముకోలేదు. వాళ్ల మాదిరిగా దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. కేవలం మంచి చేశాం. ఆమంచిని నమ్ముకున్నాం. దేవుడిని నమ్ముకున్నాను. ఆ తర్వాత మిమ్నల్నే నమ్ముకున్నాను. 

చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం వరం....
ఇలాంటి సందర్భాల్లో పోటీ జరుగుతుంది. ఇలాంటి పోటీలో మీ అందరికీ నేను ఒక్కటే తెలియజేస్తున్నాను. ఇటువంటి ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది ప్రతి మనిషికీ మంచి చేస్తే.. ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం తెలియజేస్తున్నాను. దానికోసం మాత్రమే మీ బిడ్డ ప్రాకులాడుతాడు.

మంచి చేసే మనందరి ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలని, మీ బిడ్డ పట్ల మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 

ఈ నియోజకవర్గానికి సంబంధించి మరో శుభవార్త కూడా తీసుకొచ్చాను. 
చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యోగుల బకాయిలు దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడూ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రూ.13.60 కోట్ల బకాయిలు ఈ రోజే ఇక్కడికి వచ్చే ముందే రిలీజ్‌ చేసి వచ్చాను. మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవాళ శంకుస్ధాపన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవం వరకూ కూడా పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top