తాడేపల్లి: జగనన్న విద్యా దీవెన - పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో నుంచి విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను నేడు సీఎం జమ చేస్తారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది.