నేడు ‘జగనన్న తోడు’

5,10,462 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు జమ

తాడేపల్లి: చిరువ్యాపారుల ఉపాధికి ఊతమిస్తూ, వారి రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా, వారి పరిస్థితిని మార్చాలన్న లక్ష్యంతో ‘జగనన్న తోడు’ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందిస్తోంది. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వరుసగా మూడో విడత జగనన్న తోడు పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నేడు ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది 5,10,462 మంది చిరువ్యాపారులకు రూ.510.10 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌తో కలిపి రూ.526.62 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 14.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,416 కోట్ల వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందజేసింది. అదే విధంగా లబ్ధిదారుల తరఫున బ్యాంక్‌కు రూ.32.51 కోట్ల వడ్డీని చెల్లించింది. జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి లబ్ధి చేకూరుతోంది.
 

Back to Top