జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేపట్టాలి

అన్ని విభాగాలు దీనిపై దృష్టిపెట్టాలి.. ఆలస్యానికి తావు ఉండకూడదు

గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో 10 శాతం స్థలాలను, 20 శాతం రిబేట్‌పై ఉద్యోగులకు కేటాయించాలి

మార్చి 5లోగా స్థలాలు కోరుకున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి

జూన్‌ 30 నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ కావాలి

జూలై నుంచి వారికి కొత్త జీతాలు అందించాలి

కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కారుణ్య నియామకాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పీఆర్సీ సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటన చేశామని, కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేపట్టాలని, అన్ని విభాగాలు దీనిపై దృష్టిపెట్టాలని, ఆలస్యానికి తావు ఉండకూడదని సీఎం ఆదేశించారు. కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో మాట్లాడి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కారుణ్య నియామకాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఇతర విభాగాల్లో ఉద్యోగాలుంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అలాంటి సమస్య రాకుండా ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకొని కారుణ్య నియామకాలు పూర్తిచేయాలన్నారు. ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదని కలెక్టర్లు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో 10 శాతం స్థలాలను, 20 శాతం రిబేట్‌పై ఉద్యోగులకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎంఐజీ లే అవుట్స్‌లో ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని, స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. స్థలాలు కోరుకున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని, దీని వల్ల డిమాండ్‌ తెలుస్తుందన్నారు. మార్చి 5లోగా స్థలాలు కోరుకున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్లను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.  ఉద్యోగులే కాకుండా స్థలాలు కోరుకున్న వారి పేర్లను కూడా రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. డిమాండ్‌ను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సేకరించిన స్థలంలో 5 శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ఆదేశించారు.  

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్‌ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. జూలై నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు అందాలని సూచించారు. మిగిలిపోయిన 25 శాతం ఉద్యోగుల ప్రొబేషన్‌ పరీక్షల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి మొదటివారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారని, వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని, దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. 
 

Back to Top