మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

పంట నష్ట నమోదులో కాస్త ఉదారత చూపించాలి

మళ్లీ పంట వేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా

ఎలాంటి సాయం కావాలన్నా యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం

కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌

సచివాలయం: వర్షాలతో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలని, పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

వర్ష బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల వివరాలు అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు అందించారు. రోడ్డు పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి తాగునీటి నాణ్యత తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్యంపై కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ పంట నష్టపోయిందనే వివరాలు తయారు చేయాలని.. పంట నష్టాన్ని నమోదు చేసేటప్పుడు రైతుల పట్ల కాస్త ఉదారతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మళ్లీ పంట వేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల్లో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top