వారానికి రెండు స‌చివాల‌యాల‌ను సంద‌ర్శిస్తా

స్పంద‌న కార్య‌క్ర‌మంపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ 

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అద‌నంగా మరో 200 సేవలు 

కోవిడ్ నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వ యంత్రాంగ ప‌నితీరు అద్భుతం

కోవిడ్‌ నివారణకు వాక్సినేషన్‌ ఏకైక పరిష్కారం

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిరంతరాయంగా చేయించాలి

104 కాల్‌సెంటర్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి

థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి

జూలై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు చేపట్టాలి

నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలి

డిసెంబర్‌కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌

మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాల కార్యక్రమంపై దృష్టిపెట్టాలి

కలెక్టర్లు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేప‌ల్లి: కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాల‌ని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే మాట రావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నామ‌ని, మొత్తంగా వీటిద్వారా 740 సేవలు అందుతాయ‌న్నారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్, ఖరీప్‌ సన్నద్ధత, ఉపాధి హామీ పనుల పురోగతి, గ్రామ, వార్డు సచివాలయాలు, వైయ‌స్ఆర్ అర్భన్‌ క్లినిక్స్, ఇళ్ల పట్టాలు పంపిణీ – ఇళ్ల నిర్మాణం, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల అభివృద్ధి – ప్లాంటేషన్, వైయ‌స్ఆర్ రైతు దినోత్సవం, వైయ‌స్ఆర్ కాపునేస్తం, జగనన్న విద్యా దీవెనలపై స్పందనలో సమీక్షించారు. 

దేవుడి దయవలన కరోనా తగ్గుముఖం పడుతోంద‌ని, కోవిడ్‌ నియంత్రణలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందులో భాగస్వామ్యులైన కలెక్టర్లు మొదలుకుని చివరిస్ధాయిలో ఉన్న వలంటీర్లు, ఆశావర్కర్లు, రెవెన్యూ సిబ్బంది.. ఇలా అందరూ కృషి చేశారని వారంద‌రికీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలనిచ్చింద‌న్నారు. 6 నుంచి 7 వారాల వ్యవధిలో ఇంటింటికీ వెళ్లి దాదాపు 10 సార్లు ఫీవర్‌ సర్వేలు నిర్వహించామ‌ని, ఎవరికి  జ్వరం  లక్షణాలు ఉంటే వారిని గుర్తించి పరీక్షలు చేసి సకాలంలో మంచి వైద్యం అందించామ‌న్నారు. నిన్నటికి పాజిటివిటీ రేటు 3.36 ఉంద‌ని, కోవిడ్ క‌ట్ట‌డిలో భాగ‌స్వాములైన వారంద‌రినీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇంకా ఏం మాట్లాడారంటే..

వాక్సినేషన్‌
కోవిడ్‌ నివారణకు వాక్సినేషన్‌ ఏకైక పరిష్కారం. మనకు కావాల్సినన్ని వాక్సిన్‌లు ఇవ్వరు, వాళ్లు కేటాయించినవే మనం వాడుకోవాలి. వాక్సినేషన్‌లో ఇంకా చాలా దూరం మనం వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో 1,28,84,201 మందికి ఇప్పటివరకు వాక్సినేషన్‌ పూర్తయింది. వీరిలో 32,58,885 మందికి  డబుల్‌ డోస్‌ వాక్సినేషన్‌ పూర్తి కాగా, 96,25,316 మందికి ఒక డోసు వాక్సినేషన్‌ పూర్తయింది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కనీసం 90 శాతం వాక్సినేషన్‌ పూర్తయితే,  తర్వాత.. మిగిలిన కేటగిరీల వారిపై దృష్టి పెట్టండి. భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను మరిచిపోకూడదు. వాక్సినేషన్‌ నూటికి నూరుశాతం అయ్యేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో అన్ని చోట్ల అన్నీ తెరుచుకుంటున్నాయి. ఆంక్షల విషయంలో అన్ని రాష్ట్రాల్లో సారూప్యత లేదు. అందుకనే కోవిడ్‌తో సహజీవనం ఉంటుంది. 

కార్యాచరణ–నిరంతర సర్వే
ప్ర‌భుత్వ‌ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి. మనం ఇప్పటికే ఫీవర్‌ సర్వే చేపడుతున్నాం. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిరంతరాయంగా చేయించాలి. జాయింట్‌ కలెక్టర్లు వీటిని పర్యవేక్షించాలి. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే.. వారికి చికిత్స అందించాలి. 104 ద్వారా నిరంతరాయంగా సేవలు అందాలి.

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే..
మరోవైపు నిరంతరం కోవిడ్‌ టెస్టులు జరుగుతుండాలి. అవి కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే నిర్వహించాలి. దీనివల్ల కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నాయి. మునపటి అంత ఒత్తడి ఉండదు. 

కోవిడ్‌ ఆస్పత్రులు– నిరంతర పర్యవేక్షణ
కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీనికోసం నియమించిన అధికారులు ఇదే పనిలో ఉండాలి. ఆరోగ్యమిత్రలు కూడా ఈ ఆస్పత్రుల్లో ఉండాలి. వీరిద్దరూ ఆయా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది పనితీరుతో పాటు నాణ్యమైన భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి. వీటిపై అధికారుల కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈ 4–5 అంశాలకు సంబంధించిన ప్రమాణాల పై కనీసం 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్యశ్రీ రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. 

104 కాల్‌ సెంటర్‌
104 కాల్‌సెంటర్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. కోవిడ్‌ పరీక్షలు, వైద్యం, ఆస్పత్రుల్లో అడ్మిషన్‌.. ఇలా ఏ సేవలైనా 104 ద్వారా అందాలి. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన  3 గంటలలోపు ఆ  వ్యక్తికి సేవలందాలి. నిర్ణీత సమయంలోగా పనిజరగకపోతే కలెక్టర్లు, జేసీలు సక్రమంగా పనిచేయడం లేదని భావించాల్సి వస్తుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావుండరాదు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలు
ప్రస్తుతం 322 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు అందుతున్నాయి. 4,592 ఐసీయూ బెడ్స్‌లో 3,196 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 19,258 ఆక్సిజన్‌ బెడ్స్‌కు గానూ,  15,309 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు లెక్క. ఎక్కడా అలసత్వానికి తావుండకూడదు. ఆ ఆస్పత్రుల్లో సీసీటీవీ నెట్‌వర్క్‌ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారిని వాచ్‌ చేస్తున్నామన్న భయం ఉంటుంది

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌– కార్యాచరణ
క‌రోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందో లేదో మనకు తెలియదు. మొదట్లో పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారు. కానీ ఆ పరిస్ధితి ఉండకపోవచ్చని ఇప్పుడు అంటున్నారు. ఏదిఏమైనా మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. 

పిల్లలకు ప్రత్యేక వార్డులు
అన్ని బోధానాసుపత్రుల్లో చిన్న పిల్లల బెడ్స్‌  ఉన్నాయా ? లేదా ? చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయాలి. ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్స్ అందుబాటులో ఉన్నాయా లేదా తనిఖీ చేయాలి. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది కచ్చితంగా చూడాలి. 10 కేఎల్‌ ఆక్సిజన్‌ కెపాసిటీ ప్లాంట్లు పెడుతున్నాం. ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా ? లేదా ? చూసుకోవాలి

2 నెలల కార్యాచరణ
రానున్న రెండు నెలల్లో దీన్ని అమలు చేయాలి. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. నిత్యావసరాలకు కొరత లేకుండా చూడాలి. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో ఉన్న మందులు మాత్రమే ఉండాలి. పీడియాట్రిక్‌ కేర్‌కు సంబంధించి పీడియాట్రీషియన్లను సిద్దం చేసుకోవాలి. జిల్లాల పరిధిలో ఉన్న పీడియాట్రీషియన్ల వివరాలు సేకరించాలి. అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలి.

నర్సులకు శిక్షణ
చిన్న పిల్లల విషయంలో చికిత్స, వైద్యం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి. వీరికి శిక్షణ ఇచ్చారా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూడాలి. 

16 కొత్త బోధనాసుపత్రులు
ప్రభుత్వ పరంగా 16 కొత్త బోధనాసుపత్రులు నిర్మిస్తున్నాం. 11 పాత మెడికల్‌ కళాశాలలను కూడా నాడు–నేడులో భాగంగా ఆధునీకరిస్తున్నాం. జాతీయ స్ధాయి ప్రమాణాలకు దీటుగా వీటిని అభివృద్ధి చేస్తున్నాం. 
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఒకవైపు వీటి నిర్మాణం చేపడుతూనే.. 16 చోట్ల మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక వేస్తున్నాం. 

జిల్లా కేంద్రాలు, మేజర్‌ కార్పొరేషన్లలో వీటి నిర్మాణానికి ప్రణాళిక రచించాం. వీటి కోసం 3 నుంచి 5 ఎకరాలను ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించాం. పట్టణాలకు దగ్గరగా వీటి నిర్మాణాలకు సన్నహాలు చేస్తున్నాం. మూడేళ్ల కాలంలో రూ.100 కోట్లు ఆస్పత్రి రూపేణా పెట్టుబడి పెట్టాలి. వీటివల్ల అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇవి ఏర్పాటైతే మనవాళ్లు చెన్నై, హైదరాబాద్, బెంగుళూరులకు వెళ్లాల్సిన అవసరం లేదు.  ఏపీకి వెలుపల మనం సుమారు 150 ఆస్పత్రులను ఆరోగ్యశ్రీతో ఎంపానెల్‌ చేశాం. కొత్తగా రాబోతున్న ఈ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీతో ఎంపానెల్‌ చేస్తాం.  వారం రోజుల్లోగా ఈ ఆస్పత్రుల నిర్మాణానికి  కలెక్టర్లు భూమి గుర్తించాలి. 

జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి 9 వరకూ సడలింపులు ఇచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో సాయంత్రం 6 వరకూ సడలింపులు ఇచ్చాం. ఇక్కడ 5 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున  ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎకనమిక్‌ యాక్టివిటీ కొనసాగాలి. ఇది జరగకపోతే పేదలు దెబ్బతింటారు. ప‌రిస్ధితిని అంచనా వేసి ముందుకు సాగాలి. దీనిపై ఆరోగ్యశాఖ పూర్తి మార్గదర్శకాలు ఇస్తుంది. 

ఖరీఫ్‌ సన్నద్ధత
రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే వీరి జీవనోపాధి పెరుగుతుంది. వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ఖరీఫ్‌లో లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఈ–క్రాప్ంగ్ వ‌న్‌ స్టాప్‌ సొల్యూషన్‌
ఈ–క్రాపింగ్‌ పై పూర్తిగా ధ్యాస పెట్టండి. ప్రతి అంశానికి ఇది వ‌న్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అవుతుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ప్రొక్యూర్‌మెంట్, సున్నావడ్డీ పంటరుణాలకు ఈ–క్రాపింగ్‌ అనేది వ‌న్‌స్టాప్‌ సొల్యూషన్‌ అవుతుంది. రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌(ఆర్బీయూడీపీ) యాప్‌ను కూడా తీసుకువస్తున్నాం. రైతు దగ్గర నుంచి ఆర్బీకేల వద్ద బయో మెట్రిక్ ఈ–కేవైసీని తీసుకోవాలి. ఈ– క్రాపింగ్‌కు సంబంధించి భౌతిక రశీదుకూడా ఇవ్వాలి. సరైన రశీదులు ఇవ్వకపోతే.. రైతులకు నష్టం జరుగుతుంది. ఇలాంటి సమస్యలను తీర్చడానికి భౌతిక రశీదులను ఇవ్వాలి. దీనిపై రైతు సంతకం, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సంతకం ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఈ రశీదుద్వారా క్లెయిమ్‌ చేసుకోవడానికి రైతు వద్ద ఒక ఆయుధంలా ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి.

జియో ఫెన్సింగ్‌
ప్రతి పంటను జియో ఫెన్సింగ్‌ చేస్తున్నాం. ఎవ‌రికీ అన్యాయం జరగకుండా, నష్టం జరకుండా ఇది తోడ్పాటు అందిస్తుంది. వీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. సీజన్‌లతో సరిపెట్టకుండా.. రైతు ఏ సమయంలో పంట వేసినా.. దాన్ని ఈ– క్రాప్‌ చేయాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిగా మార్గనిర్దేశం చేయండి. రైతు సాగు చేసిన భూమికి ఎలాంటి పత్రాలు లేకపోయినా సరే ఈ–క్రాప్‌ చేయాలి. ఎలాంటి పత్రాలు ఇవ్వకపోయినా సరే ఈ–క్రాపింగ్‌ చేయండి. రైతు పంట వేస్తే చాలు.. దాన్ని ఈ– క్రాపింగ్‌ చేయండి. కనీసం 10 శాతం ఈ–క్రాప్‌ బుకింగ్స్‌ను కలెక్టర్‌ మానిటర్‌ చేయాలి. వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు 20 శాతం ఈ–క్రాప్‌ బుకింగ్స్‌ తనిఖీ చేయాలి. మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు 30 శాతం ఈ– క్రాపింగ్‌ను పర్యవేక్షణ చేయాలి. రైతుకు శ్రీరామ రక్షగా ఈ–క్రాపింగ్‌ నిలుస్తుంది. రైతుకు అన్యాయం జరగకుండా, మోసాలు జరకుండా నివారిస్తుంది.

వ్యవసాయ సలహా మండలి
వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరగాలి. పంటల ప్రణాళికపై కచ్చితంగా సమావేశాలు నిర్వహించాలి. ఆర్బీకే స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో ఈ సమావేశాలు నిర్వహించాలి. ఖరీఫ్‌ సన్నద్ధ‌త, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, క్రాప్‌ప్లానింగ్‌ తదితర అంశాలపై కచ్చితంగా వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి. ఏ వెరైటీలు పండించాలి? ఏ వెరైటీలు పండించకూడదన్నదానిపై పంటల ప్రణాళిక ద్వారా నిర్ణయించాలి. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద వరిసాగు చేపట్టకుండా చూడాలి. దీనిపై రైతులకు అవగాహన కలిగించాలి. ప్రత్యామ్నాయ పంటలసాగువైపు ప్రోత్సహించాలి. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిల్లో, ప్రతినెలా రెండో శుక్రవారం మండల, ప్రతినెల మూడో శుక్రవారం జిల్లా స్థాయ్లిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరగాలి.

రైతు భరోసా చైతన్యయాత్రలు
జూలై 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాం. జూలై 9 నుంచి 23 వరకూ రైతు భరోసా చైతన్యయాత్రలు చేప‌ట్టాలి. వ్యవసాయ, అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులతో కలిసి రైతులకు అవగాహన కలిగించాలి. ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఈ– క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన క‌ల్పించాలి.

ఆర్బీకే  – సేవలు
ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీచేస్తున్నాం. వీటి నాణ్యతపై పూర్తిగా దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా వాటిని పరిశీలించాలి. రైతుల దగ్గరనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి. సబ్సిడీయే కాకుండా, సబ్సియేతర విత్తనాలు కొనుగోలు విషయంలోనూ రైతులు మోసపోకూడదు. సబ్సిడీయేతర విత్తనాలను కూడా ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తీసుకు రండి. 38 కంపెనీలతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి.

నకిలీలపై నిఘా
కలెక్టర్లు, ఎస్సీలు రెండు వారాలకు ఒకసారి కలిసి స‌మావేశం నిర్వ‌హించుకోవాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకోవాలి. వాటి పరిష్కారం విషయంలో ముందగుడు వేయాలి. వివిధ దుకాణాలద్వారా అమ్ముతున్న విత్తనాలు నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నదానిపై పరిశీలనలు చేయాలి. కచ్చితంగా దాడులు జరగాలి. నకిలీ విత్తనాలు ఒక్కసారి మార్కెట్లోకి వచ్చాక రైతులు పూర్తిగా దెబ్బతింటారు. రైతులను కాపాడే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చారు. నకిలీలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోండి.

కౌలు రైతులకూ రుణాలు
కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. ఆర్బీకేల్లో బ్యాంకుల ప్రతినిధులు ఉండేలా చూసుకోండి. రాష్ట్ర స్ధాయిలో ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడాం. కలెక్టర్లు జిల్లా స్ధాయిలో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. 

ఉపాధి హామీలో దేశంలోనే ప్రథమ స్థానం
ఉపాధిహామీ పనుల విషయంలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు, అభినందనలు. జూన్‌ నెలాఖరు నాటికి 16 కోట్ల పనిదినాలను లక్ష్యంగా పెట్టుకుంటే 17 కోట్ల 18 లక్షలకు పైగా పనిదినాలు చేశారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. కోవిడ్‌ ఉన్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒకవైపు కోవిడ్‌తో ఫైట్‌ చేస్తూనే, మరోవైపు పేదవాడి ఉపాధికి లోటు రాకుండా చూడగలిగారు.

జగనన్న పచ్చతోరణం..
జగనన్న పచ్చతోరణం కింద ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 75వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేయాలన్నది లక్ష్యం. దీనిలో నాడు–నేడు కింద స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలను కవర్‌ చేయాలి. మొక్కలు నాటడంను ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలి. విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగాలి 

గ్రామ సచివాలయాల నిర్మాణం
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, వైయస్ఆర్ విలేజ్, అర్బన్‌ క్లినిక్స్‌ ఇవన్నీ కూడా గ్రామం రూపురేఖలను మార్చేస్తాయి. వీటి నిర్మాణాలు పూర్తిచేయడంపై కలెక్టర్లు ధ్యాస పెట్టాలి.

ఫైబర్‌ గ్రిడ్‌
డిసెంబర్‌ 31 కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్‌ కనెక్షన్‌ అందుతుంది. ఆ సమయానికల్లా ఆయా పంచాయతీల్లో డిజిటల్‌ లైబ్రరీలు సిద్ధం కావాలి. జూలై 20 నుంచి వీటి  పనులు ప్రారంభం కావాలి. డిజిటల్‌ లైబ్రరీలకు కనీసం 3–4 సెంట్ల భూమిని గుర్తించాలి. తర్వాత ప్రతి పంచాయతీలోకూడా డిజిటల్‌ లైబ్రరీ రానుంది. దీనివల్ల వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్టు బలోపేతం అవుతుంది.

కలెక్టర్లు- సచివాలయాల సందర్శన
కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలు రెండింటిని ప్రతివారం సందర్శించాలి. జాయింట్‌ కలెక్టర్లు వారానికి 4 గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలి. కచ్చితంగా వీరు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది. తనిఖీలు చేస్తేనే సమస్యలు ఏంటో తెలుస్తాయి
దీనిపై సీఎంఓ కార్యాలయం స్వయంగా పర్యవేక్షణ చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన తాజా పోస్టర్లు, అమలవుతున్న పథకాలకు సంబంధించిన జాబితాలు, ముఖ్యమైన ఫంక్షన్‌ నంబర్లు, వెల్ఫేర్‌ క్యాలెండర్‌ ఉందా? లేదా? కోవిడ్‌పైన పోస్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేవా? సేవల జాబితా ఉందా? లేదా? అని చూడాలి.

సచివాలయాల ద్వారా మరో 200 సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నాం. మొత్తంగా 740 సేవలు వీటిద్వారా అందుతాయి. ఈ సేవల జాబితా అక్కడ పెట్టారా? లేదా? చూడండి. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ కూడా చేయాలి. ప్రజల గడప వద్దకే సేవలందించాలన్న లక్ష్యం కోసం వేస్తున్న అడుగులు బలంగా ఉండాలి. ప్రజలతో ఎలా వ్యవహరించాలి? నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాలను ఏ విధంగా అందుకోవాలన్న దానిపై వారికి శిక్షణ అందించాలి. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేలా దృష్టిపెట్టాలి. రిజిస్టర్‌లను, రికార్డులను తనిఖీ చేయాలి. బయెమెట్రిక్‌ అటెండెన్స్‌ను పరిశీలించాలి. వలంటీర్లు కూడా అందుబాటులో ఉంటున్నారా? లేదా? గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా పరిశీలన చేయాలి.

బీమా అమలుపై ప్రత్యేక పరిశీలన
వైయస్ఆర్ బీమా, పశువులకు ఇచ్చే బీమా, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లింపు, మత్స్యకారులు వేట సమయంలో మరణిస్తే వారికి పరిహారం అందించడం.. ఈ నాలుగు అంశాలపైనా ప్రత్యేక పరిశీలన చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డులు, పెన్షన్‌ కార్డులు, రైస్‌ కార్డులు, ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి నిర్దేశిత సమయంలోగా ఇచ్చారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలి. కలెక్టర్లు, జేసీలు, మున్సిపల్‌ కమిషనర్లు, పీఓలు దృష్టిపెడితే గ్రామ, వార్డు సచివాయాలు బలంగా పనిచేస్తాయి.

సచివాలయాల సందర్శన
కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే నేను కూడా వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తాను. కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు, అధికారులను కలిపి మండలస్థాయిలో ప్రతిరోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. పెండింగ్‌ సమస్యలు, ఇతర సమస్యలపై దృష్టిపెట్టడానికి గ్రామ సచివాలయాలను సందర్శించాలి. ఈ లోపల అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం సందర్శించాలి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే మాట రావాలి. ఏవీ పెండింగులో లేవన్న మాట రావాలి. రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ,  వార్డు సచివాలయాలను సందర్శించాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు కార్యదర్శులు దీన్ని పర్యవేక్షిస్తారు. అదే సమయంలో ఆగ్రామ, వార్డు సచివాలయం పరిధిలో హౌసింగ్‌ కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌పైనా దృష్టిపెట్టండి

ఇంటిస్థలాలు
పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమంపైనా కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. 3,69,584 మంది ఇంటి స్థలాలకు సంబంధించి కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఈ సమస్యపై దృషి పెట్టండి. మిగతా చోట్ల అందరూ ఇళ్లు కట్టుకుంటున్నారు. వెంటనే కేసులు పరిష్కారం అయ్యేలా చూడండి. 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వాలి. లబ్ధిదారుల్లో గుర్తించిన వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. లబ్ధిదారులుగా గుర్తించిన 1,81,405 వారికి పట్టాలు ఇవ్వాలి. వీరిలో 51 వేల మందికి పైగా ఇప్పుడున్న లే అవుట్లలో పట్టాలు ఇవ్వనున్నారు. 1,29,945 మందికి పట్టాలు ఇవ్వడానికి భూసేకరణను పూర్తిచేయాలి. పెండింగులో ఉన్న 13,636 దరఖాస్తులను కూడా వెంటనే వెరిఫికేషన్‌ చేయాలి.

పేదల గృహనిర్మాణం
జూన్‌ 30 వరకూ 3.4 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. జూలైలో 1,3,4 తేదీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా 6.65 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయి. ఊహించని విధంగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. మొత్తంగా 9.95 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. అందరినీ అభినందిస్తున్నాను. సెప్టెంబర్‌ 15 కల్లా బేస్‌ మెంట్‌ స్థాయి వరకూ ఇళ్లు కట్టేలా చర్యలు తీసుకోగలరు. వచ్చే ఏప్రిల్‌ – జూన్‌ కల్లా ఈ ఇళ్లను పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోండి. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం కోసం కరెంటు, నీటి సౌకర్యాలను మిగిలిన చోట్ల పూర్తిచేయాలి. వచ్చే స్పందన నాటికల్లా.. ఈ పనులు పూర్తిచేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ప్రతి వారంలో ఒకరోజు కచ్చితంగా ఇళ్ల నిర్మాణంపైసమీక్ష చేయాలి. లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై జూలై 15 కల్లా డీపీఆర్‌లు సిద్ధం కావాలి. సిమెంటు, స్టీలు, ఇసుక అన్నీకూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి

గిరిజనుల జీవనోపాధిపై దృష్టి
ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద పంపిణీ చేసిన భూమల అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. మొత్తం 35 ఏజెన్సీ మండలాల్లో గిరిజనులకు లబ్ధి చేకూరాలి. హార్టికల్చర్, సెరికల్చర్‌ను ఆయా భూముల్లో సాగయ్యేలా చేయండి. నరేగా ద్వారా ఈ పనులు జరిగేలా చేయాలి. భూమిని అభివృద్ది చేసి ఇవ్వగలిగితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. గిరిజనులకు మేలు జరుగుతుంది. గిరిజనుల జీవనోపాధిని పెంచే వాటిపై దృష్టిపెట్టండి. 

జూలై నెలలో కార్యక్రమాలు..
జూలై 8న వైయస్ఆర్‌ రైతుదినోత్సవం చేస్తున్నాం. 22న వైయస్ఆర్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. అలాగే జూలై 29న జగనన్న విద్యా దీవెన అమలు చేస్తున్నాం`` అని సీఎం వైయస్ జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. 

Back to Top