ఏలూరు ఘటనకు పురుగుమందుల అవశేషాలే కారణం

అభిప్రాయం వ్యక్తం చేసిన ఎయిమ్స్, ఎన్‌ఐసీటీ సహా ప్రఖ్యాత సంస్థలు

క్రమం తప్పకుండా పరీక్షలు.. ప్రతిజిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి

ఏలూరు తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

వైద్య నిపుణులు, ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని వైద్య నిపుణులు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అస్వస్థతకు కారణాలపై శాస్త్రవేత్తలతో సీఎం చర్చించారు.

ఈ సందర్భంగా పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఎన్‌ఐసీటీ) సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమన్నారు. లోతుగా అధ్యయనం చేసేందుకు న్యూఢిల్లీ ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి బాధ్యతలు అప్పగించారు. 

క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని, ప్రతిజిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్‌ నీలం సాహ్నిని ఆదేశించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సూచించారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ వెంట మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్య నాద్‌ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

 

Back to Top