ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉండండి

తుపాన్‌ వల్ల పంటలు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి

మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌ ఉండాలి

వలంటీర్ల సేవలను వినియోగించుకోండి.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేయండి

క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఉన్న‌తాధికారుల‌కు సీఎం ఆదేశం

‘నివార్‌’ తుపానుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: నివార్‌ తుపాన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తుపాన్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకూ తుపాన్‌ ప్రభావం ఉండొచ్చని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌ రూమ్‌ ఉండాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 11 నుంచి 20 సెం.మీ మేర వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుపాను వల్ల పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలన్నారు. కోతకోసిన పంటలను ఎలా రక్షించుకోవాలో అన్నదాతలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్ప‌టికే చెరువులు నిండి ఉన్న నేప‌థ్యంలో తుపాన్ వ‌ల్ల‌ చెరువులకు గండ్లు పండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వెంటనే సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 

కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలున్నాయ‌ని, ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాల ఏర్పాట్ల‌పై దృష్టిపెట్టాలని సూచించారు. నివార్ తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా  సన్నద్ధంకావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 

Back to Top