నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా జరగాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌లు

కలెక్టర్లు, జేసీలు ప్రతిరోజూ 104కు మాక్‌కాల్స్‌ చేసి పరీక్షించాలి

వారానికి రెండుసార్లు సచివాలయాలను సందర్శించాలి

నిర్దిష్ట సమయంలోగా ప్రజలకు సేవలు అందించాలి

25, 26 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ఖాళీ పోస్టులకు పరీక్షలు

రాష్ట్రానికి అదనంగా 4.25 కోట్ల నరేగా పనిదినాలు 

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ –19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. ‘కోవిడ్‌ పరీక్షలు, ప్రజల విజ్ఞప్తులు, ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు 104 కాల్‌ సెంటర్‌ ఉపయోగించుకోవాలి. 104 కాల్‌ సెంటర్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. కలెక్టర్లు, జేసీలు ప్రతిరోజూ 104కు మాక్‌కాల్స్‌ చేసి పరీక్షించాలి. ఈ కాల్‌సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలి.  

ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఫలితాలు అందించాలి. రాపిడ్‌ పరీక్షల్లో 30 నిమిషాల్లో ఫలితం అందించేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అన్ని ల్యాబ్‌లకు అవసరమైన కిట్లు అందించాం. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్నవారిని హోంక్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్ట్‌ విధానంలో వైద్యులు, సిబ్బంది నియామకాలను వెంటనే పూర్తిచేయాలి. మరోవారంలో రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తిచేయాలి. హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి మెడికల్‌ ఆఫీసర్‌ అందుబాటులో ఉండాలి. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌లు. ప్రతి సచివాలయ ఉద్యోగి సచివాలయంలోనే కూర్చొని విధులు నిర్వహించాలి. వలంటీర్లు వారంలో కనీసం మూడు రోజులు సచివాలయంలో అటెండెన్స్‌ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టులను భర్తీ చేయాలి. ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన సమయంలోనే పనిచేయాలి. 

వారానికి రెండుసార్లు కలెక్టర్లు గ్రామ సచివాలయాలకు వెళ్లాలి. వారానికి నాలుగుసార్లు జేసీలు గ్రామ సచివాలయాలను సందర్శించాలి. నెలకు రెండుసార్లు హెచ్‌ఓడీలు, సెక్రటరీలు గ్రామ సచివాలయాలకు వెళ్లాలి. 200 మందితో ఇప్పటికే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయాల్లో సేవలను ఈ కాల్‌సెంటర్‌ పర్యవేక్షించాలి. ఈనెల 25, 26 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ఖాళీ ఉన్న పోస్టులకు పరీక్షలు. కరోనా దృష్ట్యా పరీక్షలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి. 

నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయి. దీంతోపాటు అదనంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా పెరుగుతుంది. రూ.4 వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్‌ కాంపోనెంట్‌కు అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో వారంలో రూ.10 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలి. పేమెంట్లు పెండింగ్‌లో లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూల్‌ కాంపౌండ్‌లను పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలి. ఈనెలాఖరుకల్లా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలి’. అని అధికారులను ఆదేశించారు.  

Back to Top