మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా..?

తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవు

ఈ సందేశాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలి

గుండు కొట్టించడం లాంటి ఘటనలు తప్పు

అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదు

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఉందని.. తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దళితులమీద దాడులు సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇతరత్రా ఘటనలపై  సీఎం వైయస్‌ జగన్‌ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. దళితుల మీద దాడులు సహా ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదు.. గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఉంది. ఏదైనా పొరపాటు చేస్తే.. ఎస్‌ఐని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు..
తప్పు చేసింది ఎస్‌ఐ అయినా సీఐ అయినా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా..? ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఈ సందేశాన్ని కింది స్థాయికి తీసుకెళ్లాలని, కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలు, తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలని సీఎం సూచించారు. మానవత్వంతో వ్యవహరించడంతో పాటు ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకు వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. 

వారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదే
గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు.. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నమని, ఎస్పీలు, ఏఎస్పీలు ఈ సందేశాన్ని దిగువస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, డీజీపీ ఎస్టీ అని గుర్తు చేశారు. సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదేనని గుర్తుచేశారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా చట్టానికి అతీతులు కారన్నారు. ఇది మనసులో పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని ఎస్పీలను సీఎం ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top