తాడేపల్లి: కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇంటి స్థలం లేనివారు చేతులెత్తండి అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని, అర్హత ఉన్నవారందరికీ ఇళ్ల పట్టాలు అందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు గడువులోగా అందిస్తామని చెప్పిన పథకాలు అందుతున్నాయా.. లేదా..? అని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి రూ.22,355 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ వివరించారు. మహిళల పేరుపై 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించనున్నామన్నారు. మానవత్వం ఉన్నవారు ఎవరైనా ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతారని చెప్పారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే అవుతున్నాయో..? లేదో..? చెక్ చేయాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్స్‌లో ప్లాంటేషన్ చేపడుతున్నామని, అన్ని లేఅవుట్స్‌లో కచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇసుక అందించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అవకాశం ఉన్న చోట ఇంకా ఇసుక తవ్వి నిల్వ చేయాలని సూచించారు. అదే విధంగా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభం అవుతాయని, స్కూళ్లల్లో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తికావాలని ఆదేశించారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని, కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలని సీఎం వైయస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి అగ్రికల్చర్ అడ్వయిజరీ కమిటీలు పెట్టామని, ఏ పంటలు వేయాలి..? మార్కెటింగ్ అవకాశాలు ఏంటీ..? తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించాలన్నారు. పంటలకు వచ్చే వ్యాధుల పట్ల, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 155251 ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు 20 మంది సైంటిస్టులను కాల్ సెంటర్లలో నియమించామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా 1902కు నివేదించవచ్చని సీఎం వివరించారు.