రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి

దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించండి

ముస్లిం మతపెద్దలను విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తప్పుడు ప్రచారం చేసేవారి వివరాలు వెంటనే అందజేయండి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం

తాడేపల్లి: కరోనా వైరస్‌ కారణంగా ముస్లింలు ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం మతపెద్దలను కోరారు. కరోనా నేపథ్యంలో ఉగాది, శ్రీరామనవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలను ప్రజలంతా ఇళ్లలోనే చేసుకున్నారని గుర్తుచేశారు. రంజాన్‌ సమయంలో కూడా ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని ముస్లిం మతపెద్దలు అందరికీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చెప్పడం మనసుకు కష్టమైన మాట అయినా చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం వ్యాఖ్యానించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు సీఎం వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అటువంటి ప్రచారం చేసేవారి వివరాలు అందజేయాలని  కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

Back to Top