ఆగస్ట్‌ నాటికి మొదటి ఫేజ్‌ ద్వారా ఆయకట్టుకు నీరు

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

పాత కాంట్రాక్ట్‌ సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి వేరే సంస్థకు అప్పగించండి

వెలిగొండ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పరిహారం పెంపునకు సీఎం అంగీకారం

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు మొదటి ఫేజ్‌ ద్వారా ఆగస్టు నాటికి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులను  పరిశీలించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను ఆయన గురువారం పర్యవేక్షించారు. ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్‌ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వద్దనే అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్‌ కల్లా మొదటి ఫేజ్‌ ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. టన్నెల్‌-2ను అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండు వైపుల నుంచి తవ్వకాలు చేసేదిశగా ఆలోచన చేయాలని సూచించారు. గత ఐదేళ్లుగా వెలిగొండ పనులు ఎందుకు ముందుకుసాగలేదని సీఎం అధికారులను ప్రశ్నించారు. మార్చి 31లోగా మొదటి ఫేజ్‌కు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. ఐదేళ్ల కాలంలో జరిగిన పనులపై సీఎం ఆరా తీశారు. గడిచిన రెండేళ్లలో పనులు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు. 2014-2019 మధ్య మొదటి టన్నెల్‌ పనులు కేవలం 600 మీటర్లే కొనసాగాయని అధికారులు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో మొదటి సొరంగం పనులు 15.2 మీటర్ల నుంచి 15.8 మీటర్ల వరకు మాత్రమే సాగాయని చెప్పారు. 1.4 కిలోమీటర్ల మేర సొరంగం పని ఈ 8 నెలల కాలంలోనే జరిగిందని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రెండో సొరంగంలో తవ్వింది 410 మీటర్లే అన్నారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా ముందుకు సాగలేదని అధికారులు వివరించారు. దీంతో వేరే సంస్థకు పనులు అప్పగించామని పేర్కొన్నారు. 3,4 నెలల్లో హెడ్‌ రెగ్యులేటర్‌, అటువైపు నుంచి సొరంగం పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థ సీఎం వైయస్‌ జగన్‌కు చెప్పింది. పాత కాంట్రాక్ట్‌ సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి వేరే సంస్థకు అప్పగించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వెలిగొండ ఆర్‌  అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పరిహారం పెంచేందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

 

Back to Top