`ఉపాధి`లో దేశంలోనే ఏపీ మూడో స్థానం  

జూలై8న ఆర్‌బీకేలు ప్రారంభం

ఆగస్టు 15న విలేజ్‌ క్లీనిక్స్‌ ప్రారంభించాలి

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మూడో స్థానంలో మన రాష్ట్రం ఉందని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రూ.5818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని చెప్పారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి:

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా జరగాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మే నాటికల్లా గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో  నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలు మెరుగుపడాలన్నారు. జూలై 8న వైయస్‌ఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపాదికన విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం జరగాలని ఆదేశించారు. ఆగ‌స్టు  15న విలేజ్‌ క్లీనిక్స్‌ ప్రారంభించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆరోగ్యశ్రీ రెఫరెల్‌ పాయింట్‌గా విలేజ్‌ క్లీనిక్స్‌ ఉంటాయని చెప్పారు.

కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి:

ఉపాధి హామీ పథకాన్ని ప్రతి కలెక్టర్‌ ఓన్‌ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రతి 4–5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లు కూడా ఉపాధి హామీ పథకంపై దృష్టి పెట్టాలని, ఉపాధి పనులను రికార్డు స్థాయిలో చేపట్టామని తెలిపారు. ఉపాధి హామీలో దేశంలోనే మూడో స్థానంలో మన రాష్ట్రం ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.5818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని వివరించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సమీక్ష:
ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యిందని, మిగిలిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించాలని తెలిపారు. పేదలందరికీ తొలి విడతలో 15.6 లక్షల ఇళ్లను కడుతున్నామని చెప్పారు. తొలి విడతలో 8,682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రతి చోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు. హౌసింగ్‌ను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి డివిజన్‌ స్థాయి అధికారులను  ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీకి నోడల్‌ అధికారులను నియమించాలని కలెక్టర్లకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్‌ హౌస్‌ను నిర్మించాలని ఆదేశించారు. లబ్ధిదారులుఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం  సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.

25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టబోతున్నాం:
రాష్ట్రంలో 25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టబోతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ ఉంటుందని చెప్పారు.గతేడాది కాలంలో రూ.4300 కోట్లు ధరల స్థిరీకరణకు ఖర్చు చేశామన్నారు.9,899 చోట్ల బల్స్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.ఇప్పటికే 3,841 చోట్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలని సూచించారు. ఆగస్టు 31 నాటికి బీఎంసీల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 

Back to Top