అన్నదాతలకు ఏ ఇబ్బంది రాకూడదు

అలా చేస్తేనే 60 శాతం ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోగలుగుతాం

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కలెక్టర్లు దృష్టిపెట్టాలి

ధాన్యం కొనుగోలులో ఏ సమస్య ఉన్నా సీఎంఓ దృష్టికి తీసుకురండి

కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా జరగాలి

దరఖాస్తు చేసుకున్న వారికి వారంలో రేషన్‌కార్డులు అందించాలి

ఎవరైనా అధిక ధరలకు నిత్యావసర సరుకులు అమ్మితే కేసులు పెట్టండి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గ్రామస్థాయిలో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ జరగాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కలెక్టర్లు దృష్టిసారించాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు భౌతికదూరం పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.  

కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా జరగాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కనిపించినా వెంటనే వారికి పరీక్షలు చేయించాలని సూచించారు. హైరిస్క్‌ ఉన్న కేసులను గుర్తించి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న షెల్టర్‌ జోన్లలో సౌకర్యాలపై దృష్టిసారించాలని సూచించారు.

ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు జాగ్రత్తగా వైద్యం అందించాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండాలన్నారు. క్వారంటైన్‌ పూర్తయిన తరువాత డిశ్చార్జ్‌ అయిన వ్యక్తులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సీఎం ఆదేశించారు. మాస్క్‌లు, పీపీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.

ఒక రేషన్‌ దుకాణం పరిధిలో రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు గుమ్మి కూడకుండా టోకెన్లు పంపిణీ చేయాలన్నారు. రేషన్‌ దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అర్హత ఉండి రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా రేషన్‌ కార్డులు అందించాలని ఆదేశించారు. రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 1000 ఇవ్వాలని, ఎవ్వరూ పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఏ సమస్య ఉన్నా సీఎంఓ దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే 60 శాతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగలుగుతామన్నారు.

నిత్యావసర సరుకుల ధరలపై కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. రెండ్రోజులకొకసారి నిత్యావసర ధరలు ప్రకటించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే కేసులు పెట్టాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌ అత్యంత ప్రాధాన్యత అంశాలు. రైతు భరోసా కేంద్రాలు జూన్‌ నుంచి పనిచేయాలని ఆదేశించారు. 

Back to Top