పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో యుద్ధం చేస్తున్నా..

పింఛన్‌ వారోత్సవాల్లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పేదలకు అందిస్తున్న పెన్షన్‌ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదు 

గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌

ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం

పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. 

ఫోటోషూట్, డ్రోన్‌షాట్ల కోసం చంద్రబాబు వెంపర్లాడతారు

తానే మనుషులను చంపేసి మానవతావాదిలా నటిస్తాడు

గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నారు

కందుకూరులో చిన్న సందులో జనాల్ని నెట్టి 8 మందిని చంపింది చంద్రబాబే

గుంటూరులో ముగ్గురిని బలికొన్నది చంద్రబాబే

చంపేది చంద్రబాబే..మొసలి కన్నీరు కార్చేది ఆయనే

మనుషులను చంపేసినా ఈనాడు, ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు అడగరు

  రాజమండ్రి:  రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది కులాల యుద్ధం కాదు. క్లాస్‌ యుద్ధం. ఒకవైపు పేదవాడు, మరోవైపు పెత్తందారీ వ్యవస్ధ. వీరి మధ్య యుద్దం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పొరపాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడన్నది మర్చిపోవద్దు. పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో యుద్ధం చేస్తున్నా..నేను ప్రజలనే నమ్ముకున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్‌ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని, అది మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోందని సీఎం వైయ‌స్ జగన్‌ సగర్వంగా ప్రకటించుకున్నారు.  కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాజమండ్రిలో పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.

దేవుడి దయతో పేదలకిచ్చిన మరో మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాజమండ్రిలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను.

ఒకటో తారీఖున పెన్షన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టి వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మీ బిడ్డ మీతో మమేకమయ్యేందుకు ఇవాళ రాజమండ్రి వచ్చాడు. అభాగ్యులకు, ఎవరూ లేనివాళ్లకు, ఎలాంటి అండ లేని పరిస్థితుల్లో, ఎలాంటి సంపాదన లేని పరిస్థితుల్లో మిగిలిపోయిన అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు, అభాగ్యులకు అండగా నిలబడుతూ మన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి...
పెన్షన్‌ సొమ్మును పెంచుకుంటూ పోతామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ... వారి పెన్షన్‌ సొమ్మును నెలకు రూ.2750 పెంచుతూ గొప్ప ముందడుగు పడింది. దీనివల్ల అవ్వాతాతలకే కాకుండా వితంతువులకు, చేనేతలకు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి ఉన్న చర్మకారులతో పాటు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఈ పెంపుదల వర్తిస్తుంది. ఏకంగా 64 లక్షల మంది కుటుంబాలలో మరిన్ని చిరునవ్వులు నింపుతూ మరికొంత ఆర్ధిక సౌలభ్యం జరుగుతుంది.

రూ.10వేల వరకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం.
అవ్వాతాతలకే కాకుండా పుట్టుకతోకానీ, పుట్టిన తర్వాత కానీ అంగవైకల్యానికి గురైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి, డయాలసిస్‌ చేసుకుంటున్నవారికి, తలసీమియా, సికిల్‌సెల్‌ఎనీమియా,  హీమోఫీలియా, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు, బోదకాలు, చివరకు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వాళ్లకు, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కిడ్నీ, కాలేయం,గుండె ట్రాన్స్‌ఫ్లాంట్‌ జరిగిన నిరుపేదలందరికీ ప్రభుత్వం తరపునుంచి పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్‌ సొమ్మూ రూ.2,750 నుంచి రూ.10వేల వరకు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రమే. 

కొత్త కార్డులు కూడా...
ఈ రోజు నుంచి అవ్వాతాలకు పెన్షన్‌ పెంచడంతో పాటు గత జూలై నుంచి నవంబరు వరకు కొత్తగా అర్హులైనవారందరికీ కూడా కొత్త కార్డులిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ డిసెంబరు నెలలో.. ఎవరైతే అర్హులై ఉండి మిగిలిపోయిన వారందరినీ ప్రోత్సహిస్తూ..  వారందరికీ మంచి చేసే కార్యక్రమం చేపడుతున్నాం. జూలై, డిసెంబరులో ఏడాదికి రెండు సార్లు చేపడుతున్నాం. ఈ కార్డులు కూడా వాలంటీర్‌ ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నారు.
కొత్తగా మరో 44,543 బియ్యం కార్డులు ఇస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం బియ్యం కార్డులు సంఖ్య 1,45,88,539కు చేరింది. మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు మొత్తం 1,41,48,249కు చేరాయి. మరో 14,531 ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల మంజూరు పత్రాలు అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా  30,29,171 ఇళ్లపట్టాలు... అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టగలిగాం. ఈ స్ధాయిలో ప్రజలందరికి మేలు చేస్తూ, సేవ చేసే అవకాశం రావడం దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులు వల్లే సాధ్యమైంది. ఇంత మంచి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ సదా రుణపడి ఉంటాను.

గత ప్రభుత్వ పాలనలో... 
మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిపాలనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 2019 ఎన్నికలకు రెండు నెలల మందు వరకు కూడా అప్పట్లో... పెన్షన్‌ ఎంత ఇచ్చేవారంటే కేవలం రూ.1000 మాత్రమే. అలాగే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా వాళ్లు ఇస్తున్న పెన్షన్ల సంఖ్య ఎంతంటే కేవలం 39 లక్షలు మాత్రమే.

మన ప్రభుత్వ పాలనలో....
మరి ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 64.06 లక్షలు.  గత ప్రభుత్వ హయాంలోని 39 లక్షలు ఎక్కడ, మన ప్రభుత్వంలోని 64 లక్షలు పెన్షన్ల ఎక్కడ. ఆలోచన చేయండి. 
గతంలో రూ.1,000 మాత్రమే ఇవ్వగా... నేడు రూ.2,750 ఇస్తున్న పరిస్థితి. తేడా గమనించండి. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల ఖర్చు... నెలకు కేవలం రూ.400 కోట్లు అయితే, ఈ రోజు మన ప్రభుత్వంలో పెన్షన్ల మీద ఖర్చు నెలకు రూ.1,765 కోట్లు.

పెన్షన్ల ఖర్చు మూడున్నరేళ్లలో రూ.62వేల కోట్లు...
పెన్షన్లపై మనం సంవత్సరానికి రూ.21,180 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఈ మూడున్నర సంవత్సర కాలంలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పెన్షన్ల మీదనే.. రూ.62,500 కోట్లు అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, అభాగ్యుల కొరకు ఖర్చు చేశాం.

కోటాలు, కత్తిరింపులు లేని పెన్షన్లు...
గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇప్పుడు పెన్షన్లకు ఎక్కడా కోటాలు లేవు. కత్తిరింపులు లేవు. ఎక్కడా వివక్ష లేదు. ఏగ్రామంలో అయినా పెన్షన్లు ఇవ్వాలి అంటే ఎవరో ఒకరు ఆ గ్రామంలో చనిపోతే తప్ప సాధ్యం కాదు అన్న పరిస్థితులు గతంలో ఉండేవి. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడా కులం, మతం, వర్గం చూడటం లేదు. ఏ పార్టీకి మీరు ఓటు వేశారు అని కూడా ఎక్కడా అడగడం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి కూడా పెన్షన్‌ సొమ్ము దగ్గర నుంచి ప్రతి పథకం వాళ్ల ఇళ్లదగ్గరకు వెళ్లి ఇచ్చే గొప్ప వ్యవస్ధ జరుగుతుంది.

అర్హత ఒక్కటే ప్రమాణంగా...
కారణం మీ బిడ్డ పరిపాలన మనసున్న పాలన. చెడు చేసేవారికి సైతం మంచి చేసే గుణం మీ బిడ్డకు ఉంది కాబట్టే.. ఇంత మంచి పరిపాలన చేయగలుగుతున్నాం. ఏ పథకం కావాలన్నా అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుంటున్నాం. అర్హత ఉంటే చాలు ప్రతి నెలా ఒకటో తారీఖున అది  ఆదివారమైనా, సెలవు దినమైనా, పండగరోజు ఏదైనా సరే.. పొద్దున్నే తెల్లవారుజామునే తలుపుతట్టి, చిక్కటి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి మరీ పెన్షన్‌ సొమ్మను అందిస్తున్నారు. ప్రతి ఇంట్లో అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు చూడాలన్న తపనతో పనిచేసే గొప్ప వాలంటీర్, సచివాలయ వ్యవస్ధ మీ గ్రామాల్లో కనిపిస్తోంది.

చివరకు ఎవరూ మిగిలిపోకూడదని తపనతో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఏదైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడకు కూడా వెళ్లి పెన్షన్‌ ఇచ్చే గొప్ప వ్యవస్ధ ఈ  రాష్ట్రంలో పనిచేస్తోంది. 2.66 లక్షల వాలంటీర్‌లు ఈ సేవలో నిమగ్నులై ఉన్నారు. 1.30 లక్షల మంది సచివాలయ ఉధ్యోగులు మీ అందరికీ సేవచేసేందుకు గ్రామ, వార్డు స్ధాయిలో  నిమగ్నులై ఉన్నారు. 

లంచాలు, వివక్ష లేకుండా...
గతంలో మాదిరిగా ఎక్కడా లంచాలు లేవు. గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు. గతంలో పెన్షన్‌ మంజూరుకావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు పోవాల్సింది. వాళ్లు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందినవారు అని. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. గతంలో అరకొరగా ఇచ్చేవారు. అది కూడా మూడు నెలల పెన్షన్‌ లంచంగా ఇస్తే తప్ప మంజూరు కాదు. ఈ రోజు అలాంటి జన్మభూమి కమిటీలు లేవు. తమ ఆత్మాభిమానాన్ని చంపుకుని అవ్వాతాతలు,అక్కచెల్లెమ్మలు మోకరిల్లాల్సిన అవసరం లేదు. వ్యవస్ధలో ఈరోజు వివక్ష లేదు, లంచాలు లేవు. అర్హత ఒక్కటే ప్రమాణంగా అడుగులు పడుతున్నాయి. 

ఓర్వలేక విమర్శలు...
ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని..  ఏనాడు కూడా మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, ఏనాడు ఎలాంటి మంచి పనులు చేయని నాయకులు ఇవాళ ఓర్వలేక విమర్శిస్తున్న రాజకీయాలను ఇవాళ మనం చూస్తున్నాం.

రాజకీయ వ్యవస్ధ ఎంతలా దిగజారిపోయిందో చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది నిజంగా ఎలా ఉందంటే.. కోర్టులో ఒక జడ్జి గారు ముందుకు వచ్చి ఒకాయన...  అయ్యా, తల్లితండ్రిలేనివాడిని నన్ను శిక్షించకండి అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి జడ్జి గారు జాలిపడి, చలించిపోయి...  ఈ మనిషి చేసిన తప్పేంటని ప్రాసిక్యూటర్‌ను అడిగారు. వెంటనే ప్రాసిక్యూటర్‌.. నిజమే సర్‌ ఈ మనిషికి తల్లీతండ్రి ఇద్దరూ లేరు, కారణం ఆ తల్లితండ్రీ ఇద్దరినీ చంపేసిన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే.. చంద్రబాబుది కూడా ఇదే పద్దతి. 

చంద్రబాబు మొసలి కన్నీరు..
ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడుని గమనించండి. రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలు చూడండి.  ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను తానే వెన్నుపోటు పొడుస్తాడు. తానే ఎన్టీఆర్‌ను చంపేస్తాడు. ఆయన సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు. తానే ఎన్టీఆర్‌ పార్టీని, ఎన్టీఆర్‌ ట్రస్టుని, ఎన్టీఆర్‌ శవాన్ని కూడా లాక్కుంటాడు. కానీ మరలా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం... ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఫోటోకు దండ వేస్తాడు. తమ్ముళ్లూ... ఎన్టీఆర్‌ అంత గొప్పవాడు ఎవరైనా ఉంంటారా ? అని ఊరూరా ఈ పెద్ద మనిషే అడుగుతాడు. పొడిచేది, చంపేది ఈయనే, మళ్లా మొసలి కన్నీరు కార్చేది ఈ పెద్ద మనిషే.

ఎన్టీఆర్‌ అయినా, ప్రజలైనా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం  వెన్నుపోటు పొడవడం. ఫోటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం ఇదే ఈ పెద్దమనిషి నైజం.

రాజమండ్రి పాపం– బాబు...
ఇదే ఫోటో షూట్‌ కోసం, ఇదే డ్రోన్‌ షాట్ల కోసం తానే ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో మీ అందరికీ గుర్తు ఉందా ? ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగానే చంపేశాడు. అన్ని గేట్లు మూసేయించాడు. అక్కడే సినిమా డైరెక్టర్‌ను పక్కన పెట్టుకుని షూటింగ్‌ కోసం మిగిలిన అన్ని గేట్లు మూసివేసి ఈ ఒక్కగేట్‌ తెరిచాడు. వేల సంఖ్యలో మనుషులందరూ ఆ ఒక్క గేటు గుండా పోవాల్సిన పరిస్థితి. ఆ డ్రోన్‌ షాట్ల కోసం 29 మంది, ఫోటో షూట్‌ కోసం గతంలో చనిపోయిన పరిస్థితులు. ఆ రోజు ఇదే పెద్ద మనిషి కుంభ మేళాలో చనిపోలేదా ? తొక్కిసలాటలు జరగలేదా అని ఇదే పెద్ద మనిషి వాదించాడు. 

తానే చంపి మౌనం పాటించడం బాబు నైజం...
మొన్న కందుకూరులో తన మీటింగ్‌కు జనం తక్కువ వచ్చేసరికి, ఎక్కువ మంది జనం వచ్చినట్లు చూపించేందుకు.. విశాలమైన ప్రదేశంలో మీటింగ్‌ జరగనీయకుండా, అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లి సందులో జనాల్ని పెట్టారు. ఆ తర్వాత తన వాహనాన్ని అక్కడికి తీసుకొనిపోయి, తానే 8 మందిని చంపేసిన పరిస్థితిని చూశాం. తన డ్రోన్‌ షాట్స్‌ కోసం, ఫోటో షూట్‌ కోసం 8మందిని చంపేశాడు. ఆ వెంటనే ఆ పెద్దమనిషి అక్కడే మౌనం పాటించాలి అంటాడు. పక్కనే ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటాడు. 5 నిమిషాల్లో ఆసుపత్రి నుంచి షూటింగ్‌ కోసం మరలా తిరిగి వచ్చాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ అంటాడు. తానే మనుషులను చంపేస్తాడు.. చనిపోయిన వారిపట్ల తానే ఒక మహోన్నత, మానవతావాదిలా మరలా డ్రామాలు ఆడుతున్నాడు.
ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నా కూడా ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చూపదు. టీవీ5 అడగదు. దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. గమనించండి. 
తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారు అంటాడు. చనిపోయిన వారిలో ఎస్సీలు ఉంటే వారు తన కోసం త్యాగం చేశారని దాన్ని కూడా ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. కందుకూరులో 8మందిని చంపేసిన కూడా ఈ పెద్ద మనిషి రక్త దాహం తీరక మరలా గుంటూరులో సభ పెట్టాడు. ఆశ్చర్యం కొత్త సంవత్సరం రోజున మరో ముగ్గురిని కూడా ఫోటో షూట్‌ల కోసం, డ్రోన్‌ షాట్‌ కోసం బలితీసుకున్న పరిస్థితి మనమంతా చూశాం.

తన సభకు మనుషులు రారనే చీరలు పంపిణీ..
అక్కడకి మనుషులు పిలిపించుకునేదానికి, తనకోసమైతే మనుషులు రారేమోనన్న భయంతో..  వారం రోజులుగా ఇంటింటికీ వెల్లి టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్లు ఇస్తూ... చీరల పంపిణీ జరుగుతుంది మీరు రావాలని చెప్పారు. ఇచ్చిన టోకెన్లు వేలల్లో ఉన్నాయి. పంపిణీ కోసం తెచ్చిన చీరలేమో అరాకొరా తెచ్చారు. చంద్రబాబు వచ్చేంత వరకు, మీటింగ్‌  మాట్లాడినంతవరకూ చీరల పంపిణీ చేయలేదు. ఎందుకంటే ముందే చీరలు పంపిణీ చేస్తే.. . చంద్రబాబును చూడకుండా వాళ్లు ముందే వెళ్లిపోతారని పంపిణీ చేయలేదు. 
తీరా ఆయన వచ్చి మీటింగ్‌ చెప్పిన తర్వాత.. చీరలు చూస్తే అరాకొరగా ఉన్నాయి. ఇచ్చిన టోకెన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. చీరల కోసం మరో ముగ్గుర్ని బలిచేసుకున్న పరిస్థితులు. ఆశ్చర్యమేమిటంటే చంద్రబాబు..  తాను బలితీసుకుంటాడు. మొసలి కన్నీరు కారుస్తాడు. పోలీసులది తప్పు అంటాడు. ఇంత కన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా ?

బాబు - ప్రతి అడుగులోనూ మోసమే...
ఇదే పెద్ద మనిషి, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ మనిషి వంకర బుద్ది ఎలా ఉంటుందో ? ఎలా ఉందో? 2014 నుంచి 2019 వరకు మనమంతా చూశాం. 
ప్రతి అడుగులోనూ మోసమే. రూ. 87,612 కోట్ల రైతురుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని నట్టేట ముంచాడు. రూ.14,204 కోట్ల పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని, ఆ తర్వాత అక్కచెల్లెమ్మలందిరినీ రోడ్ల పాలు జేశాడు. మీ అందరికీ గుర్తుందా ? 
అప్పట్లో జాబు రావాలంటే బాబు రావాలనేవాడు. జాబు ఇవ్వకపోతే రూ.2వేలు నిరుద్యోభృతి అనేవాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. పిల్లలను సైతం వదిలిపెట్టకుండా మోసం చేశాడు. జాబు రాలేదు, ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిన పరిస్థితులు. 2014–19 వరకు గమనిస్తే.. మేనిఫెస్టో చూపించాడు. ప్రతి కులానికి కూడా ఇది చేస్తానని ఎన్నికలప్పుడు మాటలు చెప్పి, రంగురంగుల మేనిఫెస్టో ఇచ్చి ఎన్నికలు అయిపోయి, గెల్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. మేనిఫెస్టోను సైతం వెబ్‌సైట్‌లో నుంచి కూడా తీసేసి.. దారుణంగా మోసం చేశారు. 

గజ దొంగల ముఠా...
సొంత మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. అధికారం కోసం ప్రజలు ఒక లెక్కా ? ఇలాంటి రాజకీయాలు చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తి ఎన్నివెన్నుపోట్లు పొడిచినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు. టీవీ5 చూపించదు.దత్తపుడ్రుడు ప్రశ్నించడు. కారణం వీళ్లంతా ఒక గజదొంగల ముఠా. అప్పట్లో జరిగిన ఏకైక స్కీం... దోచుకో, పంచుకో, తినుకో(డీపీటీ ). అందుకే ఆ పెద్దమనిషి చంద్రబాబు నాయుడును మరలా అధికారంలోకి తేవడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఇంతగా కష్టపడుతున్నారు. 

నాకు దేవుడు దయ, మీ ఆశీస్సులు చాలు...
కానీ మీ బిడ్డకు వీళ్లమాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేకపోవచ్చు. దత్తపుత్రుడు అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటంటే... ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే.
ఆ పెద్ద మనిషి చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడుని నమ్ముకోవచ్చు. కానీ మీ బిడ్డ ఒక ఎస్సీని, ఒక బీసీ, ఒక మైనార్టీని, పేదవర్గాలను నమ్ముకున్నాడు. 

కులాల యుద్ధం కాదు –క్లాసుల యుద్ధం...
ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది కులాల యుద్ధం కాదు. క్లాస్‌ యుద్ధం. ఒకవైపు పేదవాడు, మరోవైపు పెత్తందారీ వ్యవస్ధ. వీరి మధ్య యుద్దం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పొరపాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడన్నది మర్చిపోవద్దు.

పేదవాడికి ఇంగ్లిషు మీడియం చదువులు వద్దంటున్నారు, పేదవాడికి ఇళ్లులు కట్టించవద్దంటున్నారు. పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటున్నారు. ఇటువంటి పేదవాడి వ్యతిరేకశక్తులతో మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు.

ఈ పోరాటంలో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు దేవుడి దయ మీ బిడ్డ పట్ల ఉండాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ... మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ... మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top