వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ చంద్రబాబు

కుప్పం స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

26,39,703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ చేయూత నిధులు

ఈ ఏడాది అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో రూ. 4,949 కోట్లు జమ

ఈ జనవరి నుంచి వైయ‌స్ఆర్‌ పెన్షన్ కానుక‌ రూ.2,750 కు పెంపు

ఒక్క చేయూత పథకం ద్వారానే 14,110 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం

అమ్మఒడి, చేయూత‌, ఆస‌రా, సున్నావ‌డ్డీ పథకాలకు 39 నెలల్లో 51 వేల కోట్లు ఖర్చు పెట్టాం

చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్ కుప్పంకు నాన్ లోకల్

కుప్పంకు చంద్రబాబు చేసింది ఏమీలేదు.. చేయలేనిది మాత్రం చాలా ఉంది

ఢిల్లీలో చక్రం తిప్పానన్న చంద్రబాబు కుప్పంకు మంచినీటిని మాత్రం ఇవ్వలేకపోయాడు

కుప్పం మున్సిపాలిటీ, రెవెన్యూడివిజ‌న్ చేసింది మ‌న ప్ర‌భుత్వ‌మే

చంద్రబాబు కంటే చేతకాని నేత ఎవరైనా ఉంటారా?

కుప్పంలో చంద్రబాబుకు ఇల్లేకాదు ఓటుకూడా లేదు

కుప్పం ప్రజలకు మూడేళ్ల‌లో సంక్షేమ ప‌థకాలతో రూ.1149 కోట్లు ఇచ్చాం

కుప్పం అభివృద్ధికి మరో వందకోట్లు కేటాయిస్తాం

భ‌ర‌త్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. మీకు మంత్రిగా పంపిస్తాను..

చిత్తూరు: ‘‘వెన్నుపోటుకు, దొంగఓట్లకు గత 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి తలవంచేది లేదని కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే అభివృద్ధి వైపు చూస్తే.. ఎలా ఉంటుందో.. 2019 ఎన్నికల తరువాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో చూపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు. పంచాయతీ ఎన్నికల్లో చూపించారు. అన్నింటా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి క్లీన్‌స్వీప్‌ ఇచ్చి.. జెండా ఎగురవేశారు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అన్ని విధాలుగా కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటా.. కుప్పం నియోజకవర్గం నా నియోజకవర్గంగా భావిస్తాను అని సీఎం అన్నారు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీకు మంత్రిగా పంపిస్తానని కుప్పం ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. జనవరి నుంచి వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక రూ.2750 చేస్తున్నట్టుగా కుప్పం సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. 

కుప్పం వేదికగా వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అక్షరాల 4,949 కోట్లును 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారు. వారం రోజుల పాటు చేయూత ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజాప్రతినిధులంతా అక్కచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములు అవుతారని చెప్పారు. కుప్పంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ చేయూత బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు.. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం పూర్తిగా..

‘దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచిపెడుతున్న ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెమ్మకు, ప్రతీ సోదరుడికి, ప్రతీస్నేహితుడికి,ప్రతి అవ్వకు, ప్రతి తాతకు రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

మారుతున్న రోజులు.. మారుతున్న రాజకీయాలు. కుప్పం అంటే ఈరోజు అక్కచెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు వీరి ప్రతీ ఇంటా.. చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి దయతో 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ చేయూత డబ్బును విడుదల చేసే మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ చేయూతగా ఈఏడాది అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న ఈ ఆర్థికసాయం అక్షరాల 4,949 కోట్లు.. 26,39,703 మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకుంటూ ప్రతీ ఈ కార్యక్రమం జరుపుతూ చేయూత ఉత్సవాలను కుప్పం నుంచి ప్రారంభిస్తున్నాను. వారంరోజుల పాటు ప్రతీ మండలానికి ప్రజాప్రతినిధులు అందరూ అక్కచెల్లెమ్మల సంతోషంగా భాగస్వాములు అవుతారు. ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మ వారి జీవితాల్లో జరిగిన మంచి, మార్పు గురించి చెబుతుంటే.. మొత్తం సమాజానికి, రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతుంది. 

ప్రతీ ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ఆర్థికసాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను మనసా, వాచా, కర్మన అమలు జరుగుతుంది. నేటితో ప్రతీ అక్కచెల్లెమ్మకు మూడో విడత రూ.18750 ఇవ్వడంతో ఇప్పటి వరకు చేయూత పథకం కింద రూ.56,250 ప్రతీ అక్క, చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టు అయ్యింది. 

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న నా పేద అక్కచెల్లెమ్మల కోసం వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తీసుకువచ్చాం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, 45–60 సంవత్సరాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు మోస్ట్‌ రెస్పాన్సబుల్‌ వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలు. మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో వారి భుజాన మోస్తారు. వారి చేతుల్లో డబ్బులు పెడితే.. ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో చేశాం. ఎలాగూ 60 సంవత్సరాలు నిండితే నెలకు రూ.2500 చొప్పున వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక.. ప్రతీ నెలా 1వ తేదీన సూర్యోదయానికి ముందే ఠంచన్‌గా వలంటీర్‌ చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి లబ్ధిదారులకు పింఛన్‌ అందిస్తున్నారు. ఈ జనవరి నుంచి వైయస్‌ఆర్‌ పెన్షన్‌ రూ.2750కి పెంచుతున్నాం. ప్రతీ అవ్వకు, ప్రతీ తాతకు మంచి శుభవార్త చెబుతున్నాను. 

ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా పెన్షన్‌ రూ.3 వేల వరకు తీసుకెళ్తానని చెప్పిన మాట మనసా, వాచా, కర్మన మీ బిడ్డ నెరవేరుస్తాడు అని తెలియజేస్తున్నాను. ఇలా అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అమ్మ వరకు అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వ అక్కచెల్లెమ్మల ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4949 కోట్లు ఇస్తున్నాం. మూడో ఏడాది ఇవ్వాళ ఇస్తున్న సొమ్ముతో కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించిన మొత్తం సాయం చేయూత పథకం ద్వారా మాత్రమే రూ.14,110 కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మ చేతిలో రూ.56250 ఇప్పటి వరకు అందించాం. నాలుగు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండినవారు పెన్షన్‌ కానుక జాబితాలోకి వెళ్తారు.. 45 సంవత్సరాలు వచ్చిన వారు ఈ పథకంలోకి వస్తారు. ప్రతీ సంవత్సరం 18750 చొప్పున 75వేల రూపాయలు ఇస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తాం. 

అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం 39 నెలల కాలంలో ప్రతీ అడుగూ వేసింది. మనందరి ప్రభుత్వం కేవలం నాలుగు పథకాల ద్వారా అందించిన సాయం..

  • జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అన్నగా, ఆ పిల్లలకు మేనమామగా రూ.19,617 కోట్లు ఇవ్వడం జరిగింది. 
  • వైయస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 39 నెలల కాలంలోనే అక్షరాల రూ.12,758 కోట్లు ఇవ్వడం జరిగింది. రెండు దఫాలు ఇప్పటికేపూర్తయ్యాయి. మూడో దఫా జనవరిలో ఇస్తాం. చెప్పిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం. 
  • వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 39 నెలల కాలంలో 26.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించే సాయం ఇవ్వాల్టితో కలిపితే మరో రూ.14,111. 
  • వైయస్‌ఆర్‌ ఆసరాలోని కోటిమంది అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ.. సున్నావడ్డీ పథకానికి మరో 3,615 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 
  • కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఇచ్చింది అక్షరాల 51 వేల కోట్లు ఇచ్చామని మీ అన్నగా, తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 
  • మొత్తంగా నా అక్కచెల్లెమ్మలకు డీబీటీ ద్వారా అందించిన సొమ్ము అక్షరాల 1,17,667 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. 
  • మొత్తంగా డీబీటీ చూస్తే..రూ. 1,71,244 కోట్లు.. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా, అర్హత ఒక్కటే ప్రామాణికంగా ప్రతీ ఒక్కరికీ సాయం అందించాం. ఈ మార్పును గమనించండి అని అడుగుతున్నాను. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించాలని కోరుతున్నాను. 

నాన్‌ డీబీటీ పథకాలు.. 
ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ఈ 6 పథకాలు కూడా కలుపుకుంటే.. అక్షరాల ఈ 39 నెలల కాలంలో అవి మరో 1.41 లక్షల కోట్ల రూపాయలు. డీబీటీ, నాన్‌ డీబీటీ రెండూ కలిపితే ఈరోజు ప్రతీ కుటుంబానికి ఇచ్చింది మొత్తం కలిపి లెక్కేస్తే.. రూ.3,12,764 కోట్లు ఇప్పటి వరకు ప్రతీ కుటుంబానికి అందించాం. ఇందులో నా అక్కచెల్లెమ్మలకు మాత్రమే ఇచ్చింది రూ.2,39,013 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు అందించాం. ఒక్కసారి తేడాను గమనించాలని కోరుతున్నాను. 

వైయస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టాం. మొదటి దశ, రెండో దశ కింద ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ మొత్తం 31 లక్షల  ఇళ్ల పట్టాలు, ఇళ్లు పూర్తయితే.. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 నుంచి 10 లక్షలు వేసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల అక్కచెల్లెమ్మల చేతుల్లో ఆ ఆస్తిని పెట్టాం. అంటే అక్షరాల రూ.2 లక్షలకోట్ల నుంచి 3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. తేడాను ఒక్కసారి గమనించండి అని అక్కచెల్లెమ్మలను కోరుతున్నాను. 

ఇంతకుముందు పాలన చూశారు. ఆ పాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు.. ఒక బడ్జెట్‌ ఇచ్చేవాడు.. అదే బడ్జెట్‌.. అదే ముఖ్యమంత్రి పదవి.. అప్పుడు చంద్రబాబు చేసిన అప్పుల కంటే.. మన ప్రభుత్వం తక్కువ చేస్తుంది. అయినప్పటికీ..ఆ ప్రభుత్వంలో సంక్షేమం ఎందుకు జరగలేదు.. మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతుందో ఆలోచన చేయాలని ప్రతీ ఒక్కరినీ అడుగుతున్నాను. కారణం.. ఆరోజుల్లో దోచుకో, పంచుకో, తినుకో.. కేవలం నలుగురు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు.

మీ బిడ్డ పరిపాలనలో నేరుగా బటన్‌ నొక్కతున్నాం.. నా అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా డబ్బులు పంపిస్తున్నాం. అందుకే ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు. ఆరోజున ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నాను. 

అక్కచెల్లెమ్మల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న మమకారం. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును  ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా అక్కచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టాం. ఈ డబ్బుతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రారంభించి నడుపుకోవాలా.. జీవనోపాధికి ఆ డబ్బు ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా అక్కచెల్లెమ్మల నిర్ణయమే. ఒకవేళ చిన్న  వ్యాపారాలను ప్రారంభించి.. ఆర్థికంగా సాధికారత పొందాలనుకుంటున్న  అక్కచెల్లెమ్మలకు సాంకేతికంగా, బ్యాంకుల పరంగా, మార్కెటింగ్‌ పరంగా అన్ని సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తోడుగా ఉంది. అక్కచెల్లెమ్మలు కిరాణాదుకాణాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వారికి ఐటీసీ, హిందుస్థాన్‌లివర్, పీఅండ్‌జీ, రిలయన్స్‌ కార్పొరేట్‌కంపెనీలతో టైఅప్‌ చేయించి.. మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకును వారికి ఇవ్వడమే కాకుండా.. మార్కెటింగ్‌లో శిక్షణ  ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా, వాటిని అనుసంధానం చేసి.. వారికి మంచి జరిగేలా.. కనీసం అంటే మరో 7 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం చేపించడానికి ఈప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

ఒకవేళ అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు, మేకలు,  గొ్రరెలు కొనాలంటే.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అమూల్‌ సంస్థ ద్వారా ఇప్పటికే ప్రతీ లీటర్‌ పాటు గతంలో కంటే కనీసం రూ.5 నుంచి రూ.15 ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమూల్‌ రంగ ప్రవేశం తరువాత చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ రేట్లు పెంచక తప్పని పరిస్థితిలోకి వెళ్లింది. ఇలా మనందరి ప్రభుత్వం ప్రతీ అక్కకు, చెల్లెమ్మకు తోడుగా నిలబడేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న.. వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత పథకాల ద్వారా అందిన సొమ్ముతో ఇప్పటి వరకు 1.10 లక్షల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. మరో 2,96,221  మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు, గొ్రరెలు, మేకలు కొనుగోలు చేసి వాటిని పెంచుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. మరో 1,15,446 మంది అక్కచెల్లెమ్మలు ఇతర జీవనోపాధి మార్గాల్లో ప్రభుత్వం చేయిపట్టుకొని నడిపిస్తోంది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 5,82,662మంది అక్కచెల్లెమ్మలు ఆర్థిక సాధికార సాధించేందుకు, జీవనోపాధి పొందేందుకు ఈ పథకాలన్నీ ఉపయోగపడ్డాయనే విషయం ఈ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ గమనించాలి. 

అక్కచెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించడం కోసం ఇప్పటికే స్తీ్రనిధి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ చొరవతో రూ.4,369 కోట్లు వారికి రుణాలుగా ఇప్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేశాం. ఇవన్నీ మంచి మనసుతో, అక్కచెల్లెమ్మలకు శాశ్వతంగా ఆదాయం రావాలనే తపనతో మీ అన్నగా, మీ తమ్ముడిగా ఆలోచన చేస్తూ అడుగులు ముందుకువేశాం. 

కుప్పం ఎమ్మెల్యే.. హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పంకు నాన్‌లోకల్‌. కుప్పానికి ఎమ్మెల్యే చంద్రబాబు ఏం చేశాడని చెప్పడానికి ఏమీలేదు కానీ, ఏం చేయలేదంటే చెప్పడానికి చలా ఉంది. చంద్రబాబు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే.. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు.. తీసుకున్నాడు కానీ, కుప్పం ప్రజలకు ఏం కావాలో మాత్రం ఆలోచన చేసిన పాపానపోలేదు. ఏనాడూ కుప్పం ప్రజలకు మంచి చేయాలనే తపన, తాపత్రయం చూపించలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబూ పరిష్కారం ఇవ్వలేకపోయాడు. తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిష్కారం కూడా ఇవ్వలేకపోయాడు. 

రాష్ట్రపతులను మారుస్తానని, కేంద్రంలో ప్రధానమంత్రులను కూడా తానే నియమించానని చంద్రబాబు చెప్పుకుంటాడు. కేంద్రంలో తానే చక్రం తిప్పానని చెప్పుకునే ఈ బాబు చివరకు నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకురాలేకపోయాడు. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలు తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా కూడా.. అది చేస్తే కుప్పం ప్రజలు తన మాట వినరు  అని చంద్రబాబు భయపడిపోయాడు. అందుకే హంద్రీనీవా పనులకు కూడా అవరోధంగా మారాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా హంద్రీనీవా గురించి పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి కాంట్రాక్ట్‌ వర్కులు ఇచ్చాడు. ఆ కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డాడు తప్ప.. కుప్పానికి నిజంగా నీరు తీసుకురావాలనే తపన చంద్రబాబు చూపించలేదు. 

చంద్రబాబు హయాంలో రూరల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద వందల కొద్ది ట్రాక్టర్లతో తాగునీరు పంపిణీ చేశానని చెప్పి పేర్లు పెట్టుకొని, విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడు కానీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏరోజూ ట్రాక్టర్లు లేకుండా కుప్పానికి నీరు ఇవ్వొచ్చనే ఆలోచన చేయలేదు. 

కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకి లింక్‌ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు.. అది కూడా చేయకుండా  వదిలేశాడు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేకపోయాడు. మలనూరు క్రాస్‌ నుంచి వేపలపల్లి వరకు డబుల్‌ రోడ్డు కూడా వేయించలేకపోయాడు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్లు వేసే మనసు కూడా లేదు కానీ, ఎన్నికలప్పుడు మోసం చేయడానికి ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్టుగా కుప్పం ప్రజల చెవుల్లో పువ్వులు పెడతాడు. 

జాబు కావాలంటే.. బాబు రావాలంటాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత జాబులు ఉండవు. బాబు పట్టించుకోడు. ఇదే బాబు సొంతనియోజకవర్గం కుప్పం నుంచి నిత్యం సుమారు 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. సొంత నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు చూపించాలనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గంలో ఉండడు. ప్రజలు ఎలా ఉన్నారో పట్టించుకునే పరిస్థితి ఉండదు. 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేందుకు కుప్పం తనకు సహకరించినా.. చివరకు కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. రెవెన్యూ డివిజన్‌ కావాలని ప్రజలు ఒత్తిడి చేస్తే.. నాకు లేఖ రాశాడు. కానీ, జగన్‌ మీవాడు, మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్‌ ఇచ్చాడు. 

ఇంతకంటే చేతగాని నాయకుడు ఎవరైనా ఉంటారా..? లేక చేయకూడదని అనుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా..? చంద్రబాబుది చేతగానితనం అనాలా..? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా అని ఒక్కసారి ఆలోచన చేయండి. కుప్పంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ లేదు, కుప్పంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదు. కానీ, చంద్రబాబు హయాంలో ప్రతీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయించుకోవడంలో మాత్రం బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో అందరూ కథలుకథలుగా చెప్పుకుంటారు. 
వెన్నుపోటుకు, దొంగఓట్లకు గత 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. కుప్పం ప్రజలు చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి తలవంచేది లేదని కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే అభివృద్ధి వైపు చూస్తే.. ఎలా ఉంటుందో.. కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తరువాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో చూపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు. పంచాయతీ ఎన్నికల్లో చూపించారు. అన్నింటా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి క్లీన్‌స్వీప్‌ ఇచ్చి.. జెండా ఎగురవేశారు. 

కుప్పంలో ప్రజలు తమ బిడ్డ జగన్‌ డీబీటీకి ఓటు వేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకోకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 33 ఏళ్లుగా గెలిపించినా కూడా కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు కథ దేవుడెరుగు.. కనీసం ఓటు కూడా చంద్రబాబుకు లేదు. ఎందుకంటే కుప్పం తన సొంతమని చంద్రబాబు ఏనాడూ భావించలేదు. హైదరాబాదే ముద్దు అని భావించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నాడు కానీ, కుప్పంలో ఇల్లు కట్టుకున్న పాపానపోలేదు.

బీసీలకు న్యాయం చేశామని రెండ్రోజుల క్రితం తన పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం చూశాం. బీసీలకు కుప్పం నుంచి మొదలుపెడితే ప్రతీ చోటా అన్యాయమే చేశాడు. కుప్పంలో ఓసీలు పోటీచేయాల్సిన సీటు కాదు..  కుప్పం బీసీల సీటు, కుప్పంలో అత్యధికులు బీసీలే. అటువంటి నియోజకవర్గంలో బీసీలకు సీటు ఇవ్వకుండా.. లాక్కునే చంద్రబాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత 1983 నుంచి 2019 వరకు 36 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈసీటును బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్క్‌ సామాజిక న్యాయం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని తపిస్తుంది ఎవరూ..? బీసీలకు వాడుకొని వదిలేస్తుంది ఎవరూ అని ఒక్కసారి ఆలోచన చేయండి. 

మన పరిపాలనలో కుప్పంలో..

  • అధికారంలోకి మనం వచ్చి కేవలం మూడు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే. అయినా కూడా మరో 6 నెలల్లో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తి చేస్తున్నది మనందరి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. 
  • కుప్పంను మున్సిపాలిటీగా చేసింది మన ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. 
  • కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 
  • 55 సంవత్సరాలుగా ఒక కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కుప్పంలో చేసింది కూడా మీ బిడ్డే.
  • రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి, రామకుప్పంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఇచ్చింది మీ బిడ్డే.
  • కొత్తపేటనుంచి డీకేపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ కూడా పూర్తిచేసింది కూడా మీ బిడ్డే.
  • రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ పూర్తిచేసింది కూడా మీ బిడ్డే.
  • ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ పనులు పూర్తిచేసింది మీ బిడ్డే.
  • రుసా–2కింద కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా మీ బిడ్డే. 
  • రాళ్లబడుగూరు జూనియర్‌ కాలేజీ పనులకు నిధులు ఇచ్చి పూర్తిచేసింది మీ బిడ్డే. 
  • కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేవీ చూడకుండా.. నవరత్నాల పథకాలన్నీ కూడా కుప్పంలో కూడా అంతా నావాళ్లే అనే భావనతో అమలు చేశాం కాబట్టే.. కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు ఇవ్వడం జరిగింది. నాన్‌ డీబీటీ ద్వారా రూ.283 కోట్లు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చాం. మొత్తం 39 నెలల కాలంలో ఇంటింటికీ మంచి చేస్తూ.. కుప్పం నియోజకవర్గానికి రకరకాల పథకాల ద్వారా.. మీ బిడ్డ ఇచ్చింది రూ.1149  కోట్లు. 
  • నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ముళ్లకు మంచి జరగాలని మనసుతో ఇచ్చింది మీ బిడ్డ అని గుర్తుతెచ్చుకోవాలని సవినయంగా కోరుతున్నాను. ఇవన్నీ చూసిన తరువాత ఎవరికైనా అర్థమయ్యేది.. చంద్రబాబుకు సొంతమామ మీద ఎలాంటి ప్రేమ ఉందో.. కుప్పం మీద కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉంది. 

సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికి, సమాజాన్ని మనం చూస్తున్న విధానానికి మధ్య ఉన్నతేడాను ప్రజలంతా ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మనవాళ్లే.. అన్ని ప్రాంతాల్లోని ప్రతీ ఒక్కరూ అభివృద్ధి చెందాలి. ప్రతీ ఇంటా పిల్లల చదువుల్లో కనిపించాలి. రైతు ఆదాయాల్లో కనిపించాలి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వాలంబనలో కనిపించాలి. వైద్య, ఆరోగ్య రంగంలో కనిపించాలి. అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. ఇలా అడుగడుగునా.. ప్రతీ కుటుంబానికి అండగా, తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డది. సామాజిక వర్గాల ఆర్తి, వారికి జరిగిన అన్యాయానికి అర్థం చేసుకున్న ప్రభుత్వం.. వారికి మంచి చేయాలని అడుగులు వేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాసులు అని గుర్తించిన ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

నవరత్నాల పథకాల అమలు మొదలు.. డీబీటీ, నామినేటెడ్‌ పదవులు, నామినేటేడ్‌ కాంట్రాక్టుల వరకు ఏది తీసుకున్నా.. ఏకంగా చట్టాలు చేసి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి జరగాలని తపనపడుతూ అడుగులు వేస్తున్నాం. నా అక్కచెల్లెమ్మలకు స్వాలంబన రావాలని అన్న, తమ్ముడి మంచి మనసు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. 

చంద్రబాబును చూస్తే.. తనకు కావాల్సిన నలుగురిని మాత్రం చూసుకుంటే చాలని అప్పట్లో అడుగులు పడ్డాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. వీరిని చూఉకుంటే చాలు.. ఎవ్వరూ రాయరు.. ఎవ్వరూచూపరు అన్యాయం ప్రజలకు జరుగుతున్నా.. గాలికివదిలేయొచ్చు అనే పద్ధతిలో ఆ పాలన జరిగింది. 

భరత్‌ను గెలిపించండి.. ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఇవన్నీ నాతో చేయించండి.. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. మీకు మంత్రిగా పంపిస్తానని తెలియజేస్తున్నాను. కుప్పానికి ఇంకా కొన్ని చేయాలని అన్నారు.. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఫేస్‌–2లో భాగంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను మరో 6 నెలల్లో పూర్తిచేసి మీరే ప్రారంభించాలని అడిగారు.. వస్తాను.. యామిగానిపల్లెలో 0.77 టీఎంసీలతో మదినేపల్లి వద్ద 0.3 టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీ కెపాసిటీతో రెండు రిజర్వాయర్లను రూ.250 కోట్లతో మంజూరు చేస్తున్నాను. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సమస్యలకు పరిష్కారం చూపలేకపోయాడు. ఈ ప్రాజెక్టు కోసం కూడా మీ బిడ్డ శాయశక్తులా కృషిచేస్తాడు.. ఈ ప్రాజెక్టుకు రూ.120 కోట్లు ఖర్చు చేస్తానని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. కుప్పం మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.66 కోట్లు మంజూరు చేశాం.. కుప్పం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మిగిలిన నాలుగు మండలాల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కావాలని అడిగారు.. ఆ డబ్బు కూడా మంజూరు చేస్తాను. అన్ని విధాలుగా కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటాం.. కుప్పం నియోజకవర్గం నా నియోజకవర్గంగా భావిస్తాను అని మరోసారి తెలియజేస్తున్నాను. ఇంకా మంచిచేసే పరిస్థితులు రావాలని, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచిచేసే పరిస్థితులు, రోజులు రావాలని కోరుకుంటూ..  మనసారా కోరుకుంటున్నాను. 
 

Back to Top