రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు

కావ‌లి బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రూ.20 వేల కోట్ల విలువైన భూములపై రైతులకు సర్వహక్కులు

ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు

చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు

బాబు, దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా తందానా

చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే 

పేదలందరికీ ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట

నెల్లూరు జిల్లా: రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్‌ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22– ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని శుక్ర‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు.    

ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

మనసు నిండా ప్రేమతో చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు, ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

97,471 కుటుంబాలకు మేలు చేస్తూ...
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి చేస్తూ.. 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులు చేసి, రైతులకు సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22–ఏ నుంచి ఈ భూములన్నీ తొలిగిస్తూ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకున్న అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఇవాల  ఆ రైతన్నలకు మేలు జరిగేటట్టుగా ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాం.

22–ఏ లో ఇంతకాలం ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ మాత్రమే చూసుకుంటే దాదాపు రూ.8వేల కోట్ల రూపాయలు. వీటి మార్కెట్‌ విలువ కనీసం రూ.20వేల కోట్ల రూపాయలు. దాదాపు 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 2,06,171 ఎకరాల చుక్కల భూములపై సర్వహక్కులను ఇస్తున్నాం. ఈ చుక్కల భూములు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 

పుండు మీద కారం జల్లిన చంద్రబాబు...
చుక్కల భూములు అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితం జరిగిన లాండ్‌ సర్వేలలో... ఒక భూమి ప్రభుత్వ భూమా ? లేక ప్రైయివేటు భూమా ? అన్నది అప్పట్లే సరిగ్గా నిర్ధారణ చేయక, రెవెన్యూ రికార్డులలో అంటే రిజిస్ట్రార్‌ రీ సెటిల్మెంట్‌ రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లో ఆ పట్టాదారు గడిలో చుక్కలుపెట్టి వదిలేశారు. బ్రిటిష్‌ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి  లెక్కలు తేల్చక వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న అటువంటి రైతన్నలు... రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా జరగని అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్న విషయం తెలిసి ఉండి, దానికి పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం... 2016లో  పుండుమీద కారం జల్లినట్టుగా రిజిస్ట్రేషన్లు ఎక్కడా లేకుండా,  ఒక మెమో ద్వారా 22–ఎ నిషేధిత జాబితాలో పెట్టి.. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడు. వారికి అన్యాయం చేశాడు.
ఈ రకంగా అన్యాయమైన రైతులు వాళ్ల పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా.. వైద్యానికో, మరో అవసరానికో అమ్ముకోవాలన్నా.. వీలుపడని పరిస్థితి. ఈ రోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీ నోటిఫై చేయించుకోవడానికి గత ప్రభుత్వ హయంలో పడ్డ కష్టాలను నా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చూశాను. ఒక్క నెల్లూరు జిల్లాల్లోనే 43వేల ఎకరాలు, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మరో 37వేల ఎకరాలు, కడప జిల్లాలో 22 ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి.  అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి.

నేను విన్నాను.. నేను ఉన్నాను.... 
2.06 లక్షల ఎకరాలకు అప్పట్లో డీనోటిఫై చేసుకునేందుకు, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి, పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం, టైటిల్‌ డీడ్‌ పొందడానికి, రెవెన్యూ రికార్డులను అప్‌డేట్‌ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కూడా పని జరగని పరిస్థితుల్లో ఉన్న రైతన్నల కష్టాలు నేను చూశాను, నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఏదైతే చెప్పాను.. అవి జరిగిస్తూ ముందుకుసాగుతున్నాను.

ఒక్క రూపాయి కూడా కట్టకుండానే...
ఆఫీసులచుట్టూ తిరగకుండా.. కోర్టులచుట్టూ తిరగకుండా.. ఒక్క రూపాయికూడా ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం లేకుండా.. చివరికి ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ గుర్తించాం. 22 –ఏ నిషేధిత జాబితా నుంచి వారి భూములను విముక్తిచేస్తూ.. తొలగిస్తూ.. రెవెన్యూ రికార్డులు మార్పులు చేసి.. అక్షరాల 2లక్షల ఎకరాలకు చెందిన లక్ష మంది రైతులకు మంచి చేస్తూ... వారందరికీ ఈ  భూములపై పూర్తిహక్కులు ఇస్తున్నాను.

రైతు మనసు తెలిపిన ప్రభుత్వం..
రైతుల గురించి, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ... వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో ఇప్పటికే ఈ నాలుగు సంవత్సరాల పాలనలో 2.80 లక్షల ఎకరాలు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చాం. 1.28 లక్షల మంది గిరిజన రైతులకు మంచి చేశాం. 

షరతులు గల పట్టా భూములకూ పరిష్కారం
చుక్కల భూములు మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న షరతులగల పట్టా భూములు మరో 35వేల ఎకరాలు, 22 వేలమంది రైతన్నలకు మంచి చేస్తూ ఆరునెలల క్రిందటే అవనిగడ్డ నియోజకవర్గంలో వారికి ఇచ్చాం. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను కూడా తొలిగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది. 

వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వే...
భూముల సమస్యలు ఎదుర్కొంటూ, శాశ్వత పరిష్కారం కాక, రకరకాల వివాదాల మయం అయిన వ్యవస్థను మార్చాలని శ్రీకారం చుట్టాం. ఎప్పుడో వందేళ్ల క్రితం అయిన భూసర్వే తర్వాత  రికార్డులు అప్‌డేట్‌ కాక గ్రామాల్లో విభేదాలు, వివాదాలున్న పరిస్థితిని మార్చాలని తలంపుతో దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వే చేపడుతున్నాం. తొలిసారిగా మన రాష్ట్రంలో 17,476 రెవెన్యూ గ్రామాలకి సంబంధించి ప్రతి గ్రామంలోను కూడా పూర్తిగా భూసర్వే చేస్తూ, రైతులందరికీ భూహక్కు పత్రాలిచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. ఈ 17,476 రెవెన్యూ గ్రామాలకు కానూ ఇప్పటికే 2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూసర్వే సర్వే చేసి, భూహక్కు పత్రాలు వారికిచ్చే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 7 లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్‌డేట్‌ చేసి రైతులకు అందించాం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి భూములోనూ రైతులకు మంచి చేస్తూ... సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగా నాటే కార్యక్రమాలు కూడా ... ఆ 2 వేల గ్రామాలకు సంబంధించి మే 20 నాటికి పూర్తి చేస్తాం. 

వీటి తర్వాత మే నెలాఖరునుంచి మరో 2వేల గ్రామాల చొప్పున మూడునెలలకొకసారి 2వేల గ్రామాల్లో పూర్తి చేసుకుంటూ పోతాం. మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తున్నాం. నాలుగేళ్లుగా ప్రతి అడుగులో రైతులకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. మన గ్రామాల్లోనే రైతులను చేయిపట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతన్నలను అన్నిరకాలుగా ఆదుకునేందుకు వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ ఉచిత పంటలబీమా, పగటిపూటే 9గంటల ఉచిత విద్యుత్, సీజన్‌ ముగియకమునుపే ఇన్‌పుట్‌ సబ్సిడీ నష్టపరిహారం కూడా వెంటనే ఇచ్చే కార్యక్రమం, సున్నావడ్డీ, భూరక్ష, ఇ– క్రాప్‌ చేయించి ఆర్బీకే స్ధాయిలోనే మధ్యవర్తులు, దళారులు ఎవరూ లేకుండా ఆర్బీకే పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎంఎస్‌పీ లేని పంటలకు  సైతం కనీస మద్ధతు ధర ఆర్బీకే కేంద్రాలలో .. ఈ పంటకు ఇంత మద్ధతు ధర అని బోర్డ్‌ పెట్టాం. ఆ కనీస మద్ధతు ధర మీకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇస్తూ మార్కెట్‌లో పోటీ క్రియేట్‌ చేసి రైతన్నలకు నష్టం జరగకుండా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఏ విషయంలోనైనా రైతన్నల మనసు వారి కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లలో వారికి అండగా ఉండేటట్టుగా ప్రతి అడుగు వేశాం.

మంచి చేస్తున్నా ఓర్వలేక...
ఇన్నిమంచి కార్యక్రమాలు రైతన్నల కోసం జరుగుతున్నా.. మన అందరి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక ఓర్వలేకపోతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతులకు మంచి జరుగుతుంది. దళారులు లేకుండా ఆర్బీకేలే నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. కొనుగోలు చేసిన 21 రోజుల తిరక్క మునుపే డబ్బులు చేతిలో పెడుతున్నాం. రైతన్నకు కనీస గిట్టుబాటు ధర రావాలని తపన, తాపత్రయంతో మధ్యవర్తులు, మిల్లర్లు లేకుండా ఆర్బీకేల పరిధిలో కొనుగోలు చేసి, రశీదు ఇస్తున్నాం. అంతే కాకుండా ఎవరైనా మిమ్మల్ని డీలరు దగ్గరకు వెళ్లమన్నా, మిల్లర్లు దగ్గరకు వెళ్లమన్నా, డబ్బులు అడిగినా ఈ నెంబరుకు ఫోన్‌ చేయండి వెంటనే వచ్చి అరెస్టు చేస్తాం, రూ.2 లక్షలు జరిమానా కూడా విధిస్తాం అని రశీదు వెనుక రాసి... మొట్టమొదటిసారిగా ఈరోజు రైతన్నలకు భరోసా ఇస్తున్నాం. రైతులకు ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదని పంట నష్టపోయినా, ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేస్తామని చెప్పాం. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాం. 

బాబు, పవన్‌ – రైతు బాంధువుల వేషం...
ఇంతమంచి జరుగుతున్నా.. ఐదేళ్ల పరిపాలన చేసి.. సగటున ప్రతి ఏటా కనీసం 300 మండలాలు కరువు ఉన్నా.. రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేసి రోడ్డెక్కారు.
వారికి మద్దతుగా రావాణసైన్యంలో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5వీళ్లందరూ రామాయణంలో శూర్పణఖల మాదిరిగా మన రైతులు మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు. 

బాబు మాఫీ పేరుతో మోసం..
చంద్రబాబు సీఎం కావడానికి ముందు  అక్షరాల రూ. 87,612కోట్ల వ్యవసాయ రుణాలు మొట్టమొదటి సంతకంతో మాఫీచేస్తానని మోసం చేశాడు. రైతులను నమ్మించి దగాచేశాడు. రుణమాఫీ దేవుడెరుగు, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తీసుకురావడం దేవుడెరుగు, చివరకు సున్నావడ్డీ కూడా ఎగ్గొట్టిన నాయకుడు చంద్రబాబు. అప్పట్లో అలాంటి చంద్రబాబును నెత్తిన పెట్టుకున్న వ్యక్తులు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5. ప్రశ్నిస్తానన్న వారు ఆరోజు  ప్రశ్నించడమే మానేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి రోడ్డెక్కుతున్నాడు. 

సాగు దండగన్న చంద్రబాబు...
వ్యవసాయం దండగ అన్న బాబు ఒకవంక,  ఇదే బాబుకి డేట్లు ఇచ్చి... బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం.. డైలాగులుగా మార్చి,  పొలిటికల్‌ యాక్షన్‌ చేస్తూ, ప్యాకేజీలు తీసుకుని నటించే మరో ప్యాకేజీ స్టార్‌ మరోవంక. వీరిద్దరి డ్రామాలను రక్తికట్టించేందుకు తానా తందానా అంటూ ఎల్లోమీడియా ఇంకోవంక  పాట్లుపడుతోంది. ఎవరి డ్రామా.. వారు ఆడుతున్నారు.

వీళ్ల డ్రామాలు నమ్మొద్దు.
ప్రతి రైతన్నకు చెబుతున్నాను. వీళ్ల డ్రామాలు నమ్మొద్దు. మేం వస్తే కానీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అని మాట్లాడతున్నారు. వీళ్ల మాటల్లో నిజమెంతో తెలిసిపోతుంది. వీళ్లుఅనుకున్న దానికన్నా వేగంగా రైతుల దగ్గరనుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేసింది కాబట్టే.. ఇవ్వాళ మాటలు మాట్లాడుతున్నారు. చివరికి కొనుగోలు చేసి... రైతులకు తోడుగా జగన్‌ ప్రభుత్వం కనిపిస్తున్నా దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. వీళ్లు వచ్చారని ధాన్యం కొన్నామంటున్నారు. మరి నాలుగేళ్లుగా కొన్నది ఎవరు?.  

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా, దేశ చరిత్రలో చూడని విధంగా ఏకంగా రూ. 2.10 లక్షల కోట్లు డీబీటీ చేశాం. నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వేశాం. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేవు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. జగనన్న తోడుగా నిలిచాడు. ప్రతి పేదవాడికి  తోడుగా ఉంటూ అడుగులు పడుతున్నాయి. 

ఎల్లో మీడియా డ్రామాలు...
పేదలకు ఈ మంచి చేస్తూ... ఈ డబ్బులు ఉచితంగా పంచిపెడుతున్నానని, ఇదంతా బాధ్యతారాహిత్యం అని టీడీపీ, వారి గజదొంగల ముఠా ప్రచారాలు గమనించండి. వాళ్ల టీవీలలో డిబేట్లలోనూ ఇవే వార్తలు చూస్తున్నాం. గతంలో ఇదే ఈనాడు పేపర్లోనూ, ఎల్లోమీడియాలోనూ ఇవే మాటలు. 
సంక్షేమ పథకాలను రద్దుచేయాలని, దండగ అని ఇద్దరు మాజీ ఐఏఎస్‌లతో ఇంటర్వ్యూ  చేసి చెప్పించారు. చంద్రబాబు మాటగా చెప్పేదేమిటంటే.. సంక్షేమపథకాలు దండగ అని, రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చువేసి చెప్పారు. అంటే 
చంద్రబాబుగారికి ఓటు వేయడం అంటే.. స్కీములు ఇక పేదలెవ్వరికీ ఇక రానేరావు అని దానర్ధం. ఆలోచన చేయండి. 

స్కీంలన్నీ ఎత్తేస్తారు....
పొరపాటున  వాళ్లు(టీడీపీ) అధికారంలోకి వస్తే స్కీంలో అన్నీ ఎత్తేసి... డీపీటీ అంటే దోచుకో. పంచుకో.. తినుకో పద్దతి తీసుకురావడమే. చంద్రబాబుకు ఇంత, ఈనాడుకు ఇంత.. ఆంధ్రజ్యోతికి ఇంత, టీవీ–5కి ఇంత.. దత్తపుత్రుడికి ఇంత అని పంచుకుంటారు. 

డీబార్‌ దానయ్యలను, మేధావులను, విశ్లేషకులను పుట్టిస్తారు...
అదే ఈనాడులో రెండు రోజుల కిందట చూశాను. జీవీరావు అనే ఇంటర్వ్యూ వేశారు. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి  అడిగితే.. చార్టెడ్‌ అకౌంటెంట్‌( సీఏ)గా ఈయనకు ప్రాక్టీసు రద్దు అయింది. చార్టెడ్‌ అకౌంటెన్సీ వాళ్లు ఈయన సర్టిఫికేట్‌ రద్దు చేసి డీబార్‌ చేశారు. ఇలాంటి డీబార్‌ అయిన దానయ్యను పట్టకుని.. ఈయనకు ఒక కోటుతొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపిస్తూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని  ఆయనతో చెప్పిస్తారు.., ఈనాడు రాస్తుంది. ఇదే ఎల్లోమీడియా, టీవీలలో వీటిమీదే డిబేట్లు పెడుతుంది. జగన్‌ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందంట, అప్పులు పాలు అవుతుందంట అని ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి.. సూటు, బూటు వేసి ఇలాంటివి చెప్పిస్తారు.
చంద్రబాబు మనసులో ఉన్న మాటలు, వీళ్లు పొరపాటున అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను ఇలాంటి ఆర్థిక వేత్తలనుంచి చెప్పిస్తారు. రాత్రికి రాత్రే ఇలాంటి ఆర్థిక వేత్తలు పుట్టుకు వస్తారు. రామోజీరావు పురుగులు పట్టిన బుర్ర నుంచి వీళ్లు పుడతారు. చివరకి ఈ ఆర్ధిక వేత్తలు ఎలా ఉన్నారో గూగుల్‌ తెరిచి జీవీ రావు గురించి చూస్తే.. సినిమా రికార్డులకు డ్యాన్సులు వేస్తున్నారు. ఇటువంటి యాక్టర్‌లను ఆర్థిక వేత్తలుగా చూపిస్తున్నారు. 
ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ మీడియా అందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను, రాజ్యాంగ న్యాయ నిపుణులను, ఆర్థిక వేత్తలను పుట్టిస్తారు. వాళ్లందరికీ ఆ సర్టిఫికేట్‌ కూడా ఇచ్చి ప్రొజెక్ట్‌ చేస్తారు. 

వీళ్లందరినీ కూడా మేధావుల సంఘాలని, సర్పంచుల సంఘాలని ట్యాగులు ఇస్తారు.వీళ్లందరినీ ఇలా అబద్ధాలు చెప్పించడానికి వీరిని వాడుకుంటారు. ప్రజలను మోసం చేసేందుకు వీళ్లందరిని వాడుకుంటారు. వీళ్లందరితోనూ రకరకాలుగా చెప్పిస్తారు. ఈనాడు మనసులో ఏముందో, చంద్రబాబు మనసులో ఏముందో, ఎల్లోమీడియా మనసులో ఏముందో.. ఇలాంటి వారిచేత చెప్పిస్తారు. అవే ప్రజల మాటలుగా చూపించి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఏ ఒక్కరూ మోసపోవద్దు. 

ప్రతి మాట రాతలోనూ మోసం..
ప్రతి మాటలోనూ మోసం, ప్రతి రాతలోనూ, పనిలోనూ మోసం కనిపిస్తుంది. పెత్తందారీ మనస్తత్వం  కనిపిస్తుంది. వీళ్లందరూ పేదలు ఇళ్లపట్టాలిస్తామంటే, ఇళ్లు నిర్మించి ఇస్తామంటే, పేదలు ఇంగ్లిషు మీడియం చదువులు చెప్పిస్తామంటే.. పేదలకు ట్యాబులు ఉచితంగా ఇస్తామంటే, అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామంటే.. వీళ్లందరికీ కడుపులో మంట. పేదలంటే వీరికి అక్కసు. కోర్టులకు వెళ్లి అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. 

రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పేపర్లు నిండా రాతలు రాస్తారు. జోకర్లను తీసుకొచ్చి వారి అభిప్రాయాలను పేద్ద ఆర్దిక వేత్త అభిప్రాయాలగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే పేదలెవ్వరూ బ్రతకరు.

క్లాస్‌ వార్‌ జరుగుతోంది...
ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేదవాడు ఒకవైపున.. పెత్తందారీ మనస్తత్వం ఉన్నది మరోవైపున ఉండి యుద్ధం జరుగుతుంది.
పొరపాటు జరిగితే.. ఏ పేదవాడు ఆంధ్రరాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు. పొరపాటు జరిగితే పేదవాడ్ని పెత్తందారు తరిమేసే పరిస్థితి వస్తుంది. పేదల ప్రతినిధిగా ఇక్కడ మీ జగన్‌ ఉన్నాడు. 

పేదరికం నుంచి ఎలా బయటకురావాలని మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ కనిపిస్తాడు. ఎక్కడా లంచాలు లేని, వివక్ష లేని పాలన కనిపిస్తుంది. ఇంగ్లిషు మీడియం చదువులు మీ పిల్లలకు చదివించాలని తపన పడే మేనమామ కనిపిస్తాడు. మీ బిడ్డ ఖర్చుపెట్టే ప్రతి పైసా కూడా లంచాలు లేకుండా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్ఫర్‌ చేస్తున్నాం. పెడుతున్న ప్రతి పెట్టుబడి, విద్యా పరంగానూ, అక్కచెల్లెమ్మల కోసం పెడుతున్న ప్రతి పైసా... మానవ వనరులమీద పెట్టుబడులు పెడుతున్నాం. మరో 15–20 సంవత్సరాల్లో ప్రతి పేద పిల్లవాడు ఇంగ్లిషులో మాట్లాడతాడు. వేసే ప్రతి పెట్టుబడి కూడా పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలి, నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మారాలని పెట్టుబడులు పెడుతున్నాం. అలా తయారయితే హ్యూమన్‌ కేపిటల్‌ ఇండెక్స్‌లో ఆంధ్ర రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది. 

నైపుణ్యం ఉన్నవారులేక జర్మనీ ఇబ్బంది పడుతుందని  ఓ ఆర్టికల్‌ విన్నా. స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ ఉండాలంటే దానికి ఒక విత్తనం పడి  అది వృక్షం కావాలి. ఈ రోజు అటువంటి వాటిపైన మీ బిడ్డ పెట్టుబడులు పెడుతున్నాడు. 

మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి.
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్దాలు వింటాం. ఇంకా ఎక్కువ మోసాలు చూస్తాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకొండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానం తీసుకోండి. మంచి జరిగితే.. మీ బిడ్డకు మీరే సైన్యంగా నిలబడండి. 
కారణం మీ బిడ్డకు ఈనాడు తోడుగా లేదు. ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. టీవీ5 అండగా లేదు. దత్తపుత్రుడు తోడుగా లేడు. మీ బిడ్డ వీళ్లెవరినీ నమ్ముకోలేదు. 

మీ బిడ్డ కేవలం దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు. మీ బిడ్డ బటన్‌ నొక్కడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బటన్‌ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలని తాపత్రయ పడుతున్నాడు. వీళ్ల మాదిరిగా దోచుకోవడం, దాన్ని పంచుకోవడం మీ బిడ్డ చేయడం లేదు. ఇది కచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొండి. మీ అందరికీ ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 

చివరిగా...
కావలి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కావలి టౌన్‌లో ట్యాంకు కెపాసిటీని పెంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు చేస్తే మంచి జరుగుతుందని, కింద మరో 9 ట్యాంకులకు నీళ్లివ్వడానికి అవకాశం ఉంటుందని అడిగాడు. దీనికోసం రూ.35 కోట్లు ఖర్చువుతుందన్నాడు. అది మంజూరు చేస్తున్నాను.  కావలికి నీళ్లురావాలంటే హైలెవల్‌ కెనాల్‌ ఉంది, అది ఇబ్బందిగా ఉందని, దీనికి సంగం బ్యారేజీ నుంచి లింక్‌ కెనాల్‌ కావాలని అందుకు మరో రూ.20 కోట్లు కావాలన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. అంతేకాకుండా కావలి ట్రంక్‌ రోడ్డుకు రూ.56 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మరో రూ.15 కోట్లు అదనంగా అఢిగారు. అవీ మంజూరు చేస్తున్నాను. నాన్న కట్టించిన ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలు పక్కనే ఉన్నాయి. కావలి మున్సిపాల్టీలో 16వార్డులో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కూడా జగనన్నకాలనీల మాదిరిగా మౌలిక సదుపాయాలు కావాలన్నారు. దీనికి కోసం మరో రూ.80 కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. వీటన్నింటి వల్ల మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top