అమరావతి: పేద వర్గాలు అందరూ ఒక్కటిగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. దశాబ్ధాలుగా బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాలనలో సామాజిక న్యాయం దిశగా ప్రతి అడుగు కనిపిస్తుందన్నారు. బీసీలు ఎంత మంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామని స్పష్టం చేశారు. బీసీల లెక్కలు తేలితే ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని తెలిపారు. కులాల వారీగా జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైయష జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం శాసన సభలో బీసీ జనగణనపై చేసిన తీర్మానంపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే సీఎం వైయస్ జగన్ మాటల్లోనే.. బీసీల జనగణన చేసే కార్యక్రమానికి తీర్మాణం చేస్తున్నాం. బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 50 శాం ఉంటుందని అంచనా. అయితే ఏ నాడు కూడా వీరి సంఖ్య ఎంత? అన్నది జనాభా లెక్కల్లో మదింపు అన్నది జరగలేదు. 1931లో బ్రిటిష్ పాలనలో మాత్రమే కులపరమైన జనాభా గణన జరిగింది. ఇప్పటికీ 90 ఏళ్లు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా బీసీల జనాభా ఎంత అన్నది కేవలం, సుమారుగా అంటూ లెక్కలు వేస్తున్నారు. కచ్చితమైన డేటా ఎక్కడా లేదు. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు ఎంత అన్నది ఇదమింతంగా ముందుగా లెక్క తెలిస్తే..ఏ మేరకు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వాలకు స్పష్టత ఉంటుంది. దేశంలో కులాలు ఉన్నాయన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నాం కానీ, జనాభా గణనలో మాత్రం రాజ్యాంగం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల లెక్కలు సేకరించలేదు. సెన్సెన్‌లో బీసీల కులాలను ఎందుకు చేర్చాలనే అంశంపై విస్తారంగా చర్చించాల్సిన అవసరం ఉంది. నిజానికి మన జనాభా లెక్కలు 2020లో జరగాలి. కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కాస్తంతా ఆలస్యంగానైనా మొదలు కాబోతున్నాయి. ఎందుకు ఇది అవసరం అన్న దానికి మరో కారణం ఉంది. సమాజంలో కొద్ది మంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారనే భావన ఉంది. కొద్దిమందిని దశాబ్ధాలుగా, శతాబ్ధాలుగా రాజకీయం, ఆర్థికంగా ఎదగనివ్వడం లేదన్న భావన వల్ల కానీ, కులాల పరంగా తమకు మరింత న్యాయం చేయాలని అడుగుతూనే ఉన్నారు. ఈ డిమాండ్లు మన కళ్లేదుటే కనిపిస్తున్నాయి. మరింత న్యాయం జరగాలని కోరుతున్నారు. మేం ఎంత మంది ఉన్నామని లెక్కిస్తేనే కదా మాకు న్యాయం జరిగేది అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ కులాన్ని ప్రకటించేలా, లేదా మీ కులం ఏంటని కేంద్రం ఒక కాలాన్ని పెట్టాలని, జనాభా గణనలో ఈ అంశాన్ని చేర్చాలని కోరుతున్నాం. ఈ ఆగస్టు నెలలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వంపై తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటంటే..రాష్ట్ర పరిధిలో జనాభాగణన ఉండదు కాబట్టి. ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలని డిమాండుకు మనం ఈ సభలో మద్దతు పలుకుతున్నాం. బ్యాక్‌వర్డ్ క్లాజ్ అన్నది..బ్యాక్ బోన్ క్లాజ్‌గా మార్చేందుకు ఈ రెండేన్నరేళ్లలో వేయని అడుగు లేదని గర్వంగా చెబుతున్నాను. ఈ రెండున్నరేళ్లుగా మనసా, వాచా, కర్మనా అందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు విప్లవాత్మక అడుగులు వేశాం. ఇంకా వారికి మంచి చేసే కార్యక్రమాల కోసం బీసీల జనగణనడిమాండు సంపూర్ణంగా నెరవేరితే మంచి చేసే వెసులబాటు ఉంది. అందుకే ఈ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాం. వెనుకబడిన వర్గాల హేతుబద్దమైన డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కులపరంగా బీసీలు, కేంద్ర భాషలోని ఓబీసీల జనాభా గణన చేయాలని గౌరవ శాసన సభ తరఫున తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొట్ట మొదట అధికారంలోకి రాకముందు కూడా ఏలూరులో జరిగిన బీసీ సభలో కూఆ తీర్మానం చేశాం. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు..వారిని బ్యాక్ బోన్ క్లాస్‌గా చేస్తామని తీర్మానం చేశాం. నిజంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆ దిశగా ఈ రెండున్నరేళ్ల పాలనలో అడుగులు పడ్డాయని తెలియజేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ఏదో చేశామంటే చేశామన్నట్లుగా, ఇచ్చామంటే ఇచ్చినట్లు కొందరికి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. గత ప్రభుత్వంలో శాచురేషన్ పద్ధతి అన్నది ఎప్పుడు లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న తపన గత ప్రభుత్వానికి లేదు. అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలు వర్తింపజేయడం అన్నది వారి చరిత్రలో ఎప్పుడు చేయలేదు. టీడీపీ పాలనలో బీసీలను కూడా విభజించారు. మాకు ఓటు వేసిన వారు ఎవరు. ఓటు వేయని వారు ఎవరని విభజించారు. ఓట్లు వేసిన వారికి కొద్దో గొప్పో ఇచ్చారు. జన్మభూమి కమిటీలు పెట్టి ఏరకంగా చేశారో అందరం చూశాం. మన పరిపాలనలో బీసీలంతా మనవారే. మనకు ఓటు వేసినా..వేయకపోయినా కూడా అర్హులందరికీ కూడా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, అందరికీ కూడా ఇన్‌పుట్ సబ్సిడీ, వైయస్‌ఆర్ చేయూత, వైయస్‌ఆర్ ఆసరా, అర్హత ఉంటే చాలు అందరికీ జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్‌ఆర్ మత్స్యకార బరోసా, వైయస్‌ఆర్ నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైయస్‌ఆర్ వాహన మిత్ర, వైయస్‌ఆర్ బీమా, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా అర్హత ఉంటే చాలు జగనన్న ఇళ్ల పట్టాలు కూడా 31 లక్షల మందికి అందజేశాం. ఎక్కడా కూడాలంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు..నాకు ఓటు వేశారా? వేయలేదా అన్న ప్రస్తావన లేకుండా, వివక్షతకు తావులేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి చేశాం. అడుగడుగునా సామాజిక న్యాయం కనిపించేలా అడుగులు వేశాం. కాసేపటి క్రితమే బీసీ మంత్రి ఎంత ఖర్చు చేశారోసవివరంగా చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తంగా గెలిచిన, గెలచబోతున్న ఎమ్మెల్సీల సంఖ్య 32, వీటిలో 18 పదవులు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాం. రాజ్యసభకు నలుగురిని పంపించాం. వీరిలో ఇద్దరు బీసీలు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే..గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపించలేదు. మేం ఇద్దరు బీసీలను పెద్దల సభకు పంపించాం. దేవుడి దయవ ల్ల శాసన సభ స్పీకర్ పదవి కూడా మాకు దక్కింది. మండలి చైర్మన్ పదవి కూడా తొలిసారి దళితులకు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాను. శాశ్వత బీసీ కమిషన్‌ను దేవుడి దయతో నియమించగలిగాం. ఈ రోజు శాశ్వత బీసీ కమిషన్ రాష్ట్రంలో పని చేస్తోంది. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీలకు 50 శాతం అంటూ చట్టం చేసిన ప్రభుత్వం మన ది. వీరిలో 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చాం. మొత్తం 648 మండలాలకు వైయస్‌ఆర్ సీపీ గెలిచింది 635 స్థానాలు గెలుచుకుంది. ఇందులో బీసీలకు అక్షరాల 239 అధ్యక్ష పదవులు ఇచ్చాం. అంటే 38 శాతం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 67 శాతం పదవులు ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల పదవుల్లో బీసీలకు 6 పదవులు, 46 శాతం బీసీలకు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 69 శాతం పదవులు ఇచ్చాం. 13 నగర కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు 7 పదవులు(54శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం పదవులు ఇచ్చాం.87 మున్సిపాలిటీల్లో 84 వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. ఒక్కటి టై అయ్యింది. ఫలితం రావాల్సి ఉంది. ఇందులో బీసీలకు 37 చైర్మన్ పదవులు(44శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం పదవులు ఇచ్చాం. 196 వ్యవసాయ మార్కెట్‌కమిటీల్లో చైర్మన్లను నియమిస్తే 76 (39శాతం) బీసీలకు ఇచ్చాం.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చాం. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులకు నియామకం చేశాం. ఇందులో బీసీలకు 53 పదవులు బీసీలకు(39శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 58 శాతం పదవులు ఇచ్చాం. ప్రత్యేకంగా బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు భర్తీ చేశాం. వీటిని పరగణలోకి తీసుకోలేదు. 484 కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల్లో 201 బీసీలకు (41శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51 శాతం పదవులు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు లక్ష 30 వేలు. దాదాపు 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. లక్ష 30 వేల ఉద్యోగాలు కాక వాలంటీర్ ఉద్యోగాలు కలుపుకొని ఈ 29 నెలలలో అక్షరాల 6 లక్షల 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాం. వీరికే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేశాం. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత మంచి చేసే అవకాశం కలగాలని దేవుడిని కోరుకుంటూ..అట్టగడుగు వర్గాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద వర్గాలు అన్నవి ఒక్కటిగా ఉండాలి. విభజించు, పాలించు అన్న గత ప్రభుత్వ తప్పుడు ఆలోచనకు చరమగీతం పాడాలి. దేవుడి ఆశీర్వదించాలని, ప్రజలందరి దీవెనలు మనందరి ప్రభుత్వంపై ఉండాలని, వీరందరికీ ఇంకా మంచి చేసేందుకు అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.