నా పుట్టిన రోజు గురించి కాదు..పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నా

బాపట్లలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారు

సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి

పేదల బతుకులు మారాలంటే వారి తలరాతలు మారాలి

పిల్లలకు జరుగుతున్న మంచి చూసినప్పుడు సంతోషంగా ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టాం

పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు

రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ

ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి అందిస్తున్నాం
 
అన్ని జిల్లాల్లోని 9,703 స్కూళ్లలో ట్యాబ్‌ల పంపిణీ

బాపట్ల: ఇవాళ నా పుట్టిన రోజు గురించి మాట్లాడటం లేదు..పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని, పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళుతున్నారని చెప్పారు. పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని చెప్పారు.  బాపట్ల జిల్లా యడ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

 ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

ఈ రోజు దేవుడి దయతో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిట్టి పిల్లల భవిష్యత్‌ కోసం చేస్తున్న ఈ మంచి, గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. 

మన తర్వాత ఉండే మనమే – నేటి మన పిల్లలు....
ఈ రోజు మన పిల్లలు మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమ కన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా ఇంకా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లి, తండ్రి మనసారా కోరుకుంటారు. 
అలా కోరుకునే అనేక హృదయాలు రక,రకాల కారణాల వల్ల తమ కులం కారణంగానే, ఆర్ధిక స్తోమత కారణంగానో తమ పిల్లలను సరిగ్గా చదివించుకోలేమని వాళ్ల భవిష్యత్తుకు సరిగ్గా బాటలు వేయలేకపోతున్నామని ఎప్పుడైనా వాళ్లు భావించినప్పుడు వాళ్ల మనస్సులు ఎలా తల్లడిల్లుపోతాయన్నది నా కళ్లారా చూశాను.

నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు నా రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలోనూ ఆ తల్లులు, తండ్రుల పడుతున్న బాధలు చూశాను.
బ్రతుకులు మారాలంటే తలరాతలు మారాలి. ఆ తలరాతలు మారాలంటే...  చదువు అనే ఒకే ఒక్క ఆస్తిద్వారానే మారుతుంది. అందుకనే పిల్లలు తమకన్నా బాగుండాలన్న ఈ తపన, ఆరాటం ప్రతి తల్లితండ్రిలో కనిపిస్తుంది. 

ఈ మూడున్నరేళ్ల కాలంలో...
దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో ప్రతి పాప, ప్రతి బాబు బాగా చదివేందుకు వీలుగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది.
అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ బడిలోనూ, ఎయిడెడ్‌ స్కూల్‌లోనూ చదువుకుంటూ... మామూలుగా పలకలమీద అక్షరాలు దిద్దిన నిరుపేద కుటుంబాలకు చెందిన 8 వ తరగతి పిల్లల చేతుల్లో డిజిటిల్‌ ట్యాబులు ఉంచబోతున్నాం. పిల్లలందరూ ఆ ట్యాబులు క్లాస్‌రూములో చూపిస్తున్నప్పుడు, పిల్లలకు జరుగుతున్న మంచి చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. 

తలరాతలు మారాలని....
తరాలు మారుతున్నా కొన్ని వర్గాల తలరాతల మారకూడదనన్న పెత్తందారుల భావాలను బద్దలకొడుతూ.. రాష్ట్రంలోని గవర్నమెంటు బడులల్లో ఒక డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టాం. పిల్లలు ఇంగ్లిషుమీడియంలో చదవకూడదు, రాకూడదు. డిజిటల్‌ పద్ధతుల్లో పిల్లలకు చదువులు చెప్పకూడదు అని చెప్పి పెత్తందారీ భావాలున్నవారు ఆరాటపడుతున్నారు.
ఇలాంటి పెత్తందారీ మనస్తత్వాలు ఉన్నవారిని అధికారంలోకి రాగానే చూసినప్పుడు బాధేసింది. కాని ఈ మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. అలాంటి పెత్తందారీ భావాలను బద్దలుకొడుతూ రాష్ట్రంలో స్కూళ్లలో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుడుతున్నాం. 
చిట్టిపిల్లలకు మంచి మేనమామగా, తల్లులకు మంచి అన్నయ్యగా సగర్వంగా తెలియజేస్తున్నాం.

సమాజంలో అంతరాలను చెరిపేందుకు.. 
 డిజిటల్‌ విప్లవం గురించి చెప్పే ముందు మన సమాజంలో ఉన్న అంతరాల పట్ల నా అంతరంగంలో భావాలను మీ ముందు ఉంచుతున్నాను. ఆర్థిక అభివృద్ధిలో, తలసరి ఆదాయాల్లో ప్రపంచ దేశాల మధ్య ఉన్నట్టే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య, అలాగే వివిధ వర్గాల మధ్య అంతరాలు ఉన్నాయి.
ధనిక దేశాల్లో సగటు తలసరి ఆదాయం అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో గమనిస్తే.. కనీసం రూ.30లక్షల నుంచి రూ.80 లక్షలు ఉంటుంది. మరి అలాంటిది మన దేశంలో తలసరి ఆదాయం కేవల రూ.2వేల డాలర్లకు అటూ ఇటూ ఉంటుంది. మన రా ష్ట్రంలో రూ.3వేల డాలర్లు అటూ ఇటూ ఉంటుంది.
లక్ష డాలర్లు సంపాదిస్తున్న ఆదేశాలు ఎక్కడ? మనం ఎక్కడ ?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఇదీ పరిస్థితి. ఇలాంటి అంతరాలు ఈరోజు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒకేసారి మనం చెరిపేయలేకపోవచ్చు, లేక తీసేయలేకపోవచ్చు.  అయితే ఆర్థిక సమానత్వం లేకపోవడానికి ఎన్ని కారణాలున్నా కూడా అందించే చదువుల్లో సమానత్వం తీసుకురాగలిగితే మాత్రం 
 అసమానతలుఎన్ని ఉన్నా.. అందించే చదువుల్లో సమానత్వం తీసుకురాగలిగితే ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకుంటుంది. ఆ మంచి చదువు వారి తలరాతలను రాబోయే రోజుల్లో మార్చుతుంది.  
మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసినప్పుడు ఇదే అర్థం అవుతుంది. ఒకే కుటుంబంలో ఒక్కసారి గమనిస్తే.. చదువుకోని అన్న, చదువుకున్న తమ్ముడు, చదువుకోలేని అక్క– చదువుకున్న తమ్ముడు వీరి మధ్య తేడా.. మొత్తం వారి జీవితాల మధ్య తేడాను చూపిస్తుంది.
దీనికి తోడు ఇంగ్లిషు మీడియం చదువులు కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే తేడా కనిపిస్తుంది. చదువులు ఉండటం.. అందులోనూ ఇంగ్లిషు మీడియం చదువులు ఉండడం, అవి మన పిల్లలకు దొరకడంతో వారి తలరాతను పోటీ ప్రపంచంతో మార్చే విధంగా తీర్చదిద్దే కార్యక్రమం జరుగుతుంది.
మన సమాజంలోనే కొందరు ఎప్పటికీ ఎందుకు పోటీపడలేకపోతున్నారని గమనిస్తే... వాళ్ల బ్రతుకులు ఇలా ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తే.. నా ప్రశ్న ఒక్కటే ? మా మనసులో ధ్యాస ఒక్కటే ? కనీసం ఈ అణగారిన వర్గాల్లోని చిన్నారుల చరిత్రను మార్చలేమా? వీరి బతుకులు ఇలానే బతకాలా? వారి బతుకుల్ని మార్చలేమా? అని ప్రతి అడుగులోనూ నా మనస్సులో కనిపిస్తుంది.

మన సమాజంలోనే కొందరు 21 శతాబ్ధంలో ఉన్నారు. మరికొందరు 19 వశతాబ్ధంలో బ్రతికే పరిస్థితిలో ఉన్నారు. వీరు ఇలానే బ్రతకాలా ? వీరి బ్రతుకు మార్చలేమా అన్న ప్రశ్నలే నా ప్రతి అడుగులోనూ, మనసులోనూ కనిపిస్తుంది.
 
కొందరు ఎప్పటికీ కూడా నాణ్యమైన విద్యను, ఇంగ్లిషు మీడియం చదువుల్ని చదువుకోవడానికి వీల్లేదా?
కాని పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లిషుమీడియంలోనే చదవాలా? మన పిల్లలదగ్గరకు వచ్చేసరికి ఇంగ్లిషు మీడయం చదవకూడదని... ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. వీళ్ల పరిస్థితి మారదా అని వేసే ప్రతి అడుగులోనూ నన్ను నేను ప్రశ్నించుకుంటాను.

సామాజిక అంతరాలను, అలాగే కొనసాగించే విద్యా విధానాన్ని, అధికారంలో వాటా ఇవ్వని రాజకీయ విధానాన్ని ఇకమీదట కొనసాగించాల్సిందేనా? అన్న ప్రశ్నకు ఆలోచనలు పెరగాలి.
ఈ క్లాస్‌ డిస్క్రిమినేషన్‌ ఇంకా కొనసాగాల్సిందేనా? అన్నది ఒక్కసారి అందరం గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

పలకల నుంచి ట్యాబుల దిశగా పయనం...
 నేను ముందే చెప్పినట్లు... పలకల చదువులతోనే కొన్ని కులాల  విద్యాభ్యాసం ముగిసిపోయి, కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబులు, డిజిటల్‌ విద్య, ఇంగ్లిషు మీడియం అందుబాటులో ఉన్న సమాజాన్ని మనం ఆమోదించవచ్చా ? అన్నది మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ రోజు రాజకీయ వ్యవస్ధలో ఉంది.

వ్యవస్ధను మార్చేందు మీలో ఒకడిగా....
 ఈ వ్యవస్ధను పూర్తిగా మార్చే విషయంలో, ఈ తిరుగుబాటులో నేను మీ వాడిగా, మీలో ఒకడిగా, మీ బిడ్డగా, మీ మేనమామాగా, ఆ ప్రతి తల్లికీ అన్నగా మీకోసం నేనున్నానని హామీ ఇస్తున్నాను. తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను.
నాణ్యమైన చదువులు అందుకోని తరం... సాధ్యం కాని తరం ఈ రెండు తరాలు ఆదాయాల పరంగానూ, అవకాశాల పరంగానూ, ఉపాధి ఉద్యోగాల పరంగానూ, పౌష్టికాహారం పరంగానూ, ఆహార భద్రతపరంగాకానీ, జీవించే కాలం పరంగానూ, లింగ వివక్ష పరంగానూ ఇలా ఏ అంశం పరంగా చూసినా మరింతగా అన్యాయానికి గురవుతున్న పరిస్థితులు. ఏ రకంగా వీళ్లు వివక్షకు గురయ్యారు. జరగాల్సిన మంచి ఏ రకంగా జరగలేదు అన్నది ప్రతి సమాజంలోనూ కనిపిస్తుంది. 
ఇంటర్నెట్‌ ఉండడం, లేకపోవడం కూడా అసమానతలకు దారితీస్తోంది. దీన్ని డిజిటల్‌ డివైడ్‌ అని అంటున్నాం. అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కనిపిస్తున్న ఇటువంటి అసమానతల నుంచి మార్పు రావాలి. 

ఈ తరం బిడ్డల గురించి....
నేను ఈ రోజు నా పుట్టినరోజు గురించి కాదు, ఈ తరం బిడ్డల గురించి మాట్లాడుతున్నా. ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేసిన మాట్లాడుతున్నాను.  వచ్చే తరం పిల్లలమీద కూడా మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బాధ్యత తీసుకున్నాను. అందుకే ఈ రోజు రూ.686 కోట్లతో 5,18,740  ట్యాబులను పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నా దళిత సోదరుడి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాను. 
ప్రభుత్వం, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ 2024–25 విద్యా సంవత్సరంలో ఇంగ్లిషు మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే 4,59,564 మంది విద్యార్ధులతో పాటు వీరికి 59,176 మంది టీచర్లకు కూడా ట్యాబులు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9703 ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ట్యాబులు అందించనున్నాం. వారం రోజుల పాటు ప్రతి స్కూళ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

ట్యాబుల పంపిణీ ప్రతి ఏటా ...
ఈ సంవత్సరం నుంచి ఇక మీదట ప్రతి ఏటా 8వతరగతిలోకి వచ్చే ప్రతి బాబు, పాపకు ఈ ట్యాబులు ఇస్తూ పోతాం. ఇది ఒక్కసారి నా పుట్టిన రోజు సందర్భంగా జరుగుతున్నది కాదు. ఈ రోజు వేసే బీజం ప్రతి సంవత్సరం నా చిన్నారులు 8వతరగతిలో అడుగుపెడుతూనే  ట్యాబులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవన్నీ మల్టీ లింగువల్‌ ట్యాబులు. అంటే తెలుగు, ఇంగ్లిషు మీడియంలో కూడా నేర్పిస్తారు. ట్యాబుల్లో ఇంగ్లిషులోనూ, తెలుగులోనూ సబ్జెక్టులు ఉంటాయి. బాగా అర్థం కావడానికి అన్ని భాషల్లో పాఠాలు ఉంటాయి. ట్యాబులు కారణంగా చదువుల్లో పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ట్యాబుల వల్ల జరిగే మంచి ఏమిటంటే... 
అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థం అయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జే ఎఫ్‌ కెన్నడీ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఆల్‌ ఆఫ్‌ అజ్‌ డునాట్‌ హేవ్‌ ఈక్వెల్‌ టాలెంట్‌ బట్‌ ఆల్‌ ఆఫ్‌ అజ్‌ షుడ్‌ హేవ్‌ యాన్‌ ఈక్వెల్‌ ఆపర్చ్యునిటీ టు డెవలప్‌ అవర్‌ టాలెంట్‌. పిల్లలంతా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా సంపూర్ణంగా, సులభంగా అర్ధం చేసుకునే అవకాశం ఈ ట్యాబులోనే, బైజూస్‌ కంటెంట్‌ ద్వారా లభిస్తుంది. క్లాస్‌ టీచర్‌ చెప్పే పాఠాలు మరింత సులభంగా అర్థంచేసుకునేందుకు ఈ శ్యాంసంగ్‌ ట్యాబ్‌ ఉపయోగపడుతుంది.ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ లెర్నింగ్‌లో భాగంగా... ఈ రోజు శాంసంగ్‌ ట్యాబులు ఇస్తున్నాం.  సెక్యూర్డ్‌ డిజిటల్‌ కార్డు కూడా ట్యాబుల్లో ఉంటుంది.

ఆఫ్‌ లైన్‌– ఆన్‌లైన్లోనూ పాఠాలు...
దీనివల్ల 8,9 వ తరగతులకు సంబంధించి పాఠాలు లోడ్‌చేసి ఇస్తున్నారు. ఇంటర్నెట్‌ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ట్యాబులు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్‌లోనూ, ఆఫ్‌లైన్లోనూ సబ్జెక్టులు నేర్చుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ట్యాబులకు మూడు సంవత్సరాల వారెంటీ ఉంటుంది. ఎప్పుడైనా రిపేరు వస్తే.. సచివాలయాల్లో ఫిర్యాదు చేసి ట్యాబు ఇస్తే... వారం రోజుల్లోగా రిపేరు చేసి ట్యాబు ఇస్తారు. లేదంటే మార్చి కొత్త ట్యాబు ఇస్తారు. ఇది చెడిపోతుందని ప్రసక్తే ఉండదు. పిల్లలకు ఎల్లవేలలా ఉపయోగపడుతుంది.

టెక్నాలజీతో మేలు జరిగేలా... 
మనం ఇచ్చే టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి తప్ప చెడు జరక్కూడదు. ఇదే ఆలోచనతో ట్యాబులో సెక్యూర్డు మొబైల్‌ డివైజ్‌ మేనేజిమెంట్‌ (ఎండీఎం) సాఫ్ట్‌వేర్‌ పెట్టారు.
దీనివల్ల ట్యాబుల్లో పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్‌ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడు. ఎందుకంటే ట్యాబులు వల్ల మంచి జరగాలి. చదువుకు సంబంధించిన అంశాలు మాత్రమే నేర్చుకోవాలి. లేదంటే నష్టం జరుగుతుంది. అలాంటి వాటిని సెన్షార్‌ చేస్తున్నాం. ఈ ట్యాబు ద్వారా ఆఫ్‌లైన్లో పాటు ఆన్‌లైన్‌లో కూడా మంచి జరుగుతుంది కాబట్టి.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు ఉండకూడదు. 
అందుకే పిల్లలు, ఏంచూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ద్వారా తెలుస్తుంది కాబట్టి ట్యాబులు మిస్‌యూజ్‌ అయ్యే అవకాశాల్లేవు. 4వతరగతి నుంచి 10 వతరగతి పిల్లలందరికీ బైజాస్‌ కంటెంట్‌ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంటెంట్‌ అందుబాటులో ఉన్నా తల్లిదండ్రుల ఫోన్‌లలో ఈ కంటెంట్‌ లోడ్‌ చేయాల్సి వస్తుంది కాబట్టి... ఆ తల్లిదండ్రులు వాళ్ల పోన్‌లు పిల్లలకు కేటాయింపులు చేయాలి కాబట్టి.. 8 వతరగతిలో అడుగుపెడుతున్న పిల్లలు పదోతరగతి పరీక్ష రాసేటప్పుడు వీరికి ఎటువంటి ఆటంకం ఉండకూడదని వీరికి ట్యాబు ఇస్తున్నాం. 

8వ తరగతి విద్యార్ధులనే ఒక్కసారి తీసుకుంటే వారికి ఇలా ఇస్తున్న సొంత ట్యాబు ద్వారా ఆన్‌లైన్‌లో ఈ బైజూస్‌ కంటెంటెను వారు కొనుగోలు చేసుకోవాలంటే వీటి మార్కెట్‌ విలువ రూ.32వేలు ఖర్చవుతుంది. ఈ రోజు పిల్లల చేతుల్లో పెట్టే ట్యాబు మార్కెట్‌ విలువ రూ.16,500. బైజూస్‌ కంటెంట్‌ ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్లి ఈ కంటెంటెను డౌన్లోడ్‌ చేసుకోవాలనుకుంటే ఏకంగా రూ.15,500 ఖర్చు. అంటే మీ మేనమామగా మన పిల్లల చదువుల కోసం మరో రూ.32 వేలు ఖర్చు చేస్తున్నాం. మన పిల్లలకు మంచి చదువులు అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం. ఇక్కడ బైజూస్‌ సంస్ధను కూడా ప్రశంసించాలి. బైజూస్‌ సంస్ధ రూ.15,500 కంటెంట్‌ ఇస్తున్నారో.. దానిని సీఎస్‌ఆర్‌లో నమోదు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చే విధంగా అడుగులు ముందుకు వేసినందుకు వాళ్లకు కూడా కృతజ్ఞతలు.

4.6 లక్షల మంది 8వతరగతి పిల్లలు, సుమారు మరో 60 వేల మంది టీచర్లకు కూడా ట్యాబులు ఇస్తున్నాం. వీటి ఖర్చు రూ.686 కోట్లు అయితే, ఇందులో లోడ్‌ చేస్తున్న కంటెంట్‌ ఖర్చు మరో రూ.778 కోట్లు అంతే  రూ. 1400 కోట్లు విలువ చేసే ట్యాబులు, బైజూస్‌ కంటెంట్‌ 8 వతరగతి పిల్లల చేతుల్లో పెడుతున్నాం. 

డిజిటల్‌ క్లాస్‌ రూములు– ఐఎఫ్‌పి
ఒకవైపు 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీతో పాటు మరోవైపు స్కూళ్లలో కూడా డిజిటల్‌ క్లాసురూముల వైపు ప్రభుత్వం పయనిస్తుంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. నాడు–నేడు అమలయ్యే కొద్దీ 6వతరగతి నుంచి 12వ తరగతి వరకూ కూడా ప్రతి క్లాసులోనూ, ప్రతి సెక్షన్‌లోనూ ఇంటరాక్షివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పి) అంటే డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం.

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి పై తరగతి వరకూ ప్రతి సెక్షన్‌లోనూ డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ కాబోతున్నాయి.
నాడు – నేడు కింద మొదటిదశలో పనులు పూర్తిచేసుకున్న 15,715 స్కూళ్లల్లో 6 తరగతి నుంచి ఆ పై తరగతి ఉన్న 32,213  క్లాస్‌రూంలకు ఐఎప్‌పిలు పెట్టి డిజిటల్‌ క్లాస్‌రూములగా మార్చబోతున్నాం.  వచ్చే జూన్‌కల్లా.. వీటి ఏర్పాటు పూర్తవుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర మొత్తమ్మీద దాదాపు 45వేల స్కూళ్లు ఉంటే ఈ జూన్‌ నాటికల్లా తొలిదశలో 15,715 స్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ కాబోతున్నాయి. 

మూడేళ్లలో సమూల మార్పులు...
గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో ముందడుగులు వేశాం. వాటి గురించి క్లుప్తంగా ఆలోచన చేయండి.
గతానికి భిన్నంగా ఈ రోజు బడులు ప్రారంభమయ్యే తొలిరోజునే విద్యా కానుక కిట్‌ ఇస్తున్నాం. గతంలో ఎప్పుడూ జరగలేదు. అప్పట్లో విద్యాకానుక కిట్‌ మాటెలా ఉన్నా కనీసం టెక్ట్స్‌బుక్స్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ విద్యాకానుక కిట్‌లో మంచి స్కూల్‌ బ్యాగుతో పాటు బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ కూడా పిల్లలకు ఇస్తున్నాం. నోట్‌బుక్స్, షూష్, 3 జతల యూనిఫాం, సాక్స్, ఆక్ట్‌ఫర్డ్‌ డిక్షనరీతో కలిపి విద్యాకానుక కిట్‌గా ఇస్తున్నాం. గతాన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే... అన్ని సబ్జెక్టులకు ఒకే టీచర్‌ ఉన్న పరిస్థితి. నుంచి ఇవాళ 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్స్‌ను తీసుకొచ్చాం. పెరిగే వయస్సులో పిల్లలు చదువులు ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో.. బడి మొత్తానికి ఒకే టీచర్‌ ఉండే పరిస్థితి నుంచి ఇవాళ సబ్జెక్ట్స్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. నాడు నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, డిజిటల్‌ క్లాస్‌ రూములు, ట్యాబులు, బైజూస్‌ కంటెంట్,అమ్మఒడి, గోరుముద్దతో సహా అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చాం.

పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి.. తల్లులు కాలేజీలకు పంపిస్తే చాలు... చదివించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నాను. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యాదీవెన కింద ఇస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్‌ ఖర్చుల కోసం కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా... రూ.20 వేలు పిల్లలకు ఏడాదికి రెండు దఫాలుగా ఇస్తూ తోడుగా ఉండే కార్యక్రమం చేపడుతున్నాం.

ఈ పథకాలు, కార్యక్రమాల వల్ల ఎంత మంది పిల్లలకు మేలు జరిగింది, ఎంత ఖర్చు చేశామన్నది నాలుగు మాటల్లో చెప్తాను.
అమ్మఒడి...
ఈ మూడేళ్లలో అమ్మఒడి కింద రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. 44,48,865 మంది తల్లులకు 80 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమలవుతుంది.  విద్యాదీవెన కింద రూ.9051 కోట్లు వ్యయంతో 24,74,544 మంది పిల్లలకు మేలు జరిగింది. 
వసతి దీవెన కింద మరో రూ.3349 కోట్లతో 18,77,863 మంది పిల్లలకు మేలు జరిగింది.

గోరుముద్ద...
పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద రోజుకో మెనూతో మంచి పౌషికాహారం ఇస్తూ.. అమలు చేస్తున్న గోరుముద్ద పథకానికి  ఇప్పటివరకూ రూ.3239 కోట్లు వ్యయం చేశాం. తద్వారా రూ.43,26,782 మంది పిల్లలకు గోరుముద్ద ద్వారా మంచి జరుగుతుంది. 
విద్యాకానుక కిట్ల కోసం రూ.2368 కోట్లతో 47,40,420 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చాం. అంగన్‌వాడీల్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ అమలు చేస్తున్న వైయస్సార్‌ సంపూర్ణ పోషణం కింద రూ.4895 కోట్ల వ్యయంతో మేలు చేశాం. 

మనబడి నాడు–నేడు...
మనబడి నాడు నేడు తొలిదశలో రూ.3669 కోట్లతో 15,715 స్కూళ్ల రూపురేఖలు మార్చాం.  రెండో దశ కింద మరో రూ.8వేల కోట్లతో 22,344 స్కూళ్లలో నాడు నేడు కింద సమూలంగా మార్పు చేయడానికి అడుగులు పడుతున్నాయి.
ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయమని పిల్లలకే కాకుండా తల్లిదండ్రులనూ సవినయంగా వేడుకుంటున్నాను.

దేవుడు ఆశీర్వదించాలని..  ప్రజలందరి చల్లని దీవెనలు ఇంత కన్నా మెండుగా ఉండాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ.. ప్రతి తల్లికి మంచి అన్నగా, ప్రతి బిడ్డకు మంచి మేనమామగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. 

అభివృద్ధి పనులకు ఆమోదం...: 
కృష్ణానది మీద ఓలేరు– తూర్పు పాలెం గ్రామాలు, బట్టిప్రోలు మండలంలో 4.96టీఎంసీల సామర్ధ్యంతో రూ.2500 కోట్లతో బ్యారేజీ నిర్మాణ పనుల కోసం అడిగారు. దీనికి సంబంధించిన అంచనాలు పూర్తయ్యాయి. మంజూరు చేసే కార్యక్రమం పూర్తై .. ఏప్రిల్‌ నుంచి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు కూడా మొదలవుతాయి. జంపని షుగర్‌ ప్యాక్టరీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం అడిగారు. వీళ్లకు న్యాయం చేస్తాం. 
రూ.17.6 కోట్లతో రోడ్ల నిర్మాణం కోసం పీఎంజీఎస్‌వై కింద మంజూరు చేస్తున్నాం. 1811ఎకరాల సాగు చేస్తున్న కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో 10 గ్రామాల్లో 3749 రైతులకు సంబంధించిన లంక భూములకు వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రస్తుతం సమావేశం జరుగుతున్న ఏవీఆర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కూడా యాడ్‌ చేసేందుకు హామీ ఇస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ప్రసంగం ముగించారు.

Back to Top