పెద్ద చదువులు పేదల హక్కుగా మార్చాం

చదువు అనేది ఒక ఆస్తి.. ఏ ఒక్కరూ కొల్లగొట్టలేని ఆస్తి..

తరంతో పాటు తలరాతలు మార్చే గొప్ప ప్రయత్నం జరుగుతోంది

రాష్ట్రంలో ప్రతీ అక్క, చెల్లెమ్మకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

ఇంట్లో ఉన్న ఎంతమంది బిడ్డలుంటే.. అంతమందినీ పెద్ద చదువులు చదివిస్తా

ప్రతీ కుటుంబం నుంచి ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్‌ తయారు కావాలి

పెద్ద చదువులను పేదలకు దగ్గర చేసేందుకు ‘జగనన్న విద్యా దీవెన’ తీసుకొచ్చాం

100 శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తున్నాం

ఏప్రిల్, మే, జూన్‌ త్రైమాసికానికి సంబంధించి రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం

ఈ మూడేళ్లలో విద్యారంగ పథకాలకు రూ.53,338 కోట్లు ఖర్చుచేశాం

చంద్రబాబు ఎగ్గొట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1778 కోట్లూ మన ప్రభుత్వమే చెల్లించింది

2035 నాటికి జీఈఆర్‌ మన రాష్ట్రంలో 70 శాతం తీసుకెళ్లేందుకు అడుగులు

బాపట్లలో జగనన్న విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బాపట్ల: ‘‘మారుతున్న తరంతో పాటు ఇంతకాలం మారని తలరాతలు కూడా మార్చాలన్న గొప్ప ప్రయత్నం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుంది. విద్యా విధానంలో గత మూడేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని పెద్ద చదువులు చదివిస్తానని సగర్వంగా తెలియజేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో జగనన్న విద్యా దీవెన పథకం గడిచిన త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చుతూ రూ.694 కోట్లను విడుదల చేశారు. అంతకుముందు విద్యార్థులు, వారి తల్లులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
‘రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతీ కుటుంబ సభ్యుడికి నిండు మనసుతో మీ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. 

నిజంగా ఈరోజు మంచిరోజు దేవుడి దయతో అక్షరాల 11.02 లక్షల మంది పిల్లలకు మంచిచేస్తూ వారికి సంబంధించిన ఫీజులు ఎంతైనా గానీ, లక్ష రూపాయలు ఇంకా ఎక్కువైనా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రతీ మూడు నెలలకు ఒకసారి, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బు జమ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈకార్యక్రమం అయిపోయిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.694 కోట్ల సొమ్మును నేరుగా పంపించడం జరుగుతుంది. 

రక్షా బంధన్‌ అనేది ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక, అక్కచెల్లెమ్మలందరికీ ఆర్థికంగానూ, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా అన్ని విషయాల్లోనూ మంచిచేస్తున్న అడుగులు.. మీ అన్న, తమ్ముడి ప్రభుత్వంలో ఈ మూడు సంవత్సరాలుగా పడుతున్నాయని గర్వంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటూ.. ఈ పవిత్రమైన పండుగ రోజు నా అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల భవిష్యత్తు కోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం గత మూడు నెలల కాలానికి అంటే ఏప్రిల్, మే, జూన్‌కు  సంబంధించిన వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.694 కోట్లు విడుదల చేయడానికి బాపట్లకు వచ్చాను. ఏ బిడ్డకైనా అతి గొప్పదీవెన ఏదైనా ఉందంటే అది చదువే.. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది చదువే. చదువు అనేది ఒక ఆస్తి. ఏ ఒక్కరూ కొల్లగొట్టలేని ఆస్తి. 

చదువులు బాగా చదివించగలిగితే.. పేదరికంగా నుంచి మనం బయటకు వచ్చే గొప్ప విప్లవాత్మక మార్పు చదువుల ద్వారానే సాధ్యం  అవుతుంది. కాలేజీల్లో 17సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసున్న పిల్లలు కనీసంగా మరో 80 సంవత్సరాలు ఈ ప్రపంచంలో రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకు ఒక ప్రభుత్వంగా దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. పది సంవత్సరాల కిందట.. మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశాం.. పదేళ్ల కిందట మన కుటుంబం ఎలా ఉండేది. మీరూ, మీ కుటుంబం, మన దేశం, ఈ ప్రపంచం 20 సంవత్సరాల తరువాత మన బ్రతుకులు ఎలా ఉంటాయని చెప్పడం ఊహకందని విషయం. అంత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులతో ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు. పోటీ పడాలంటే.. ఆ ప్రతీ అడుగులోనూ మార్పు కనిపించాలి. 

ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదరికంలో ఉన్న నా బిడ్డలు.. ఇతర కులాల్లో పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ బిడ్డలూ పెద్ద చదువులు చదువుకోవాలని, మనందరి ప్రభుత్వంగా, మీ అందరి అన్నగా కోరుకుంటూ విద్యా విధానంలో గత మూడేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. అందులో భాగంగానే కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ఫీజులు ఎంత ఉన్నా.. మీరు వెళ్లి చదువుకోండి.. మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే వారందరినీ చదివిస్తానని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

రేషన్‌ పెట్టి ఒక్కరికే ఇస్తామనే మాటలు నేను మాట్లాడను.. కారణం ఏంటంటే.. చదువులు అందరికీ అందాలి. మన తలరాతలు, బతుకులు మారాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేనివిధంగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలు అవుతుంది. మారుతున్న తరంతో పాటు ఇంతకాలం మారని తలరాతలు కూడా మార్చాలన్న గొప్ప ప్రయత్నం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుంది. పేదరికం అనేది పెద్ద చదువులకు అడ్డంకిగా ఉండకూడదు.. పేదల మీద మమకారంతో గొప్ప ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతీ తల్లి, తండ్రీ కూడా ఖర్చుకు వెనకాడకుండా.. మీ బిడ్డలను బాగా చదివించండి.. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా పర్వాలేదు అందరినీ చదివించండి.. వారికి తోడుగా మీ అన్న ఉంటాడు. మీ తమ్ముడు ఉంటాడని ఈ సందర్భంగా బాధ్యత తీసుకున్న అన్నగా, తమ్ముడిగా, మీ ఇంటి మనిషిగా తెలియజేస్తున్నాను. 

ప్రతి ఇంట్లో నుంచి గొప్ప ఇంజినీర్, ప్రతి ఇంట్లో నుంచి గొప్ప డాక్టర్, కలెక్టర్, పెద్ద పెద్ద చదువులు చదివిన పిల్లలు బయటకు రావాలి. వారి తలరాతలు మారాలి. అందుకోసమే పెద్ద చదువులు ప్రోత్సహిస్తూ పూర్తిగా వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బును నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇలా క్రమం తప్పకుండా ప్రతీ మూడు నెలలకు ఒకసారి.. ఆ మూడు నెలలు అయిన వెంటనే డబ్బును అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం 2022 ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలల కాలానికి సంబంధించి 11.02 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించే క్రమంలో భాగంగా రూ.694 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1778 కోట్లు మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం చిరునవ్వుతో కట్టాను. పిల్లలు, వారి చదువుల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మనది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి మాత్రమే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. జగనన్న  వసతి దీవెన కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి రెండు దఫాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఏకంగా రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నాం. కారణం.. ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదు.. ఇళ్లు, పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు.. పిల్లలకు చదువు హక్కుగా రావాలి.. బతుకులు మారాలి.. తలరాతలు మారాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

మన పిల్లల చదువులతోనే మీ ఇంటింటా వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో ఒక్క విద్యారంగంలోనే జగనన్న అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్‌తో ఒప్పందం, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కరికుళంలో కూడా మార్పులు చేశాం. డిగ్రీ చదువుతున్న పిల్లలు పది నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసేలా, ఆన్‌లైన్‌లో రకరకాల వర్టికల్స్‌ తీసుకువచ్చాం. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకొని 1.60 లక్షల మందికి ట్రైనింగ్‌లు, సర్టిఫికెట్లు ఇప్పించి.. పిల్లలందరికీ రాబోయేతరంలో కాలేజీలు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు సులభంగా వచ్చేలా కరికుళంలో మార్పులు తీసుకువచ్చాం. విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతీ మార్పు వెనక.. అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక.. మీ పిల్లల భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న గొప్ప బాధ్యత కనిపిస్తుంది. 

మూడు సంవత్సరాల కాలంలోనే కేవలం ఒక్క విద్యారంగం మీద మాత్రమే.. అది కూడా ఈ పథకాల మీదనే ఈ మూడు సంవత్సరాల కాలంలో 53 వేల కోట్లు ఖర్చు చేశాం. జగనన్న అమ్మఒడి పథకానికి రూ.19,618 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి అక్షరాల రూ.11,711 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. గోరుముద్దకు రూ.3117 కోట్లు ఖర్చుచేశాం. జగనన్న విద్యా కానుకకు రూ.2324 కోట్లు, వైయస్‌ఆర్‌ సంపూర్ణపోషణకు రూ.4895 కోట్లు, మన బడి నాడు–నేడు కింద ఇంతవరకు పెట్టిన, ఈ సంవత్సరం అయిపోయే వరకు పెట్టబోయే ఖర్చు రూ.11,669 కోట్లు. ఇవన్నీ కలుపుతే వెరసి రూ.53,338 కోట్లు ఖర్చుచేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మనం అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు వారు కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య (జీఈఆర్‌ రేషియో) గణనీయంగా పెరుగుదల నమోదు చేయాలనే  తపన,తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. మనమంతా బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో పోటీపడుతున్నాం. బ్రెజిల్‌లో 53 శాతం, రష్యా 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియా 29 శాతం..దీన్ని 2035 వచ్చే సరికి మన రాష్ట్రంలో 70 శాతం తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నాం. అందుకోసమే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం. 

2018–19తో పోలిస్తే రాష్ట్రంలో జీఈఆర్‌ రేషియో 2019–20లో 8.64 శాతం పెరగ్గా.. జాతీయ స్థాయిలో ఇది కేవలం 3.04 శాతం మాత్రమే పెరుగుదల అయ్యింది. కారణం మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకాల వల్ల. ఆడపిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ 11.03 శాతం వృద్ధి నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కేవలం 2.28 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తుంది. ఎస్సీ పిల్లలకు సంబంధించి 2018–19తో పోలిస్తే.. 2019–20లో 7.5 శాతం జీఈఆర్‌ పెరగ్గా.. జాతీయస్థాయిలో కేవలం 1.7 శాతం మాత్రమే. ఎస్టీ పిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ పెరుగుదల 9.5 శాతం కాగా, జాతీయ స్థాయిలో అది కేవలం 4.7 శాతం మాత్రమే. ఇలా ప్రతి అడుగులోనూ ఒక ఉద్దేశం కనిపిస్తుంది. 

కొంతమంది గిట్టనివారు అమ్మఒడి పథకాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కచెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇస్తున్నాడని, జగన్‌ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని వెటకారంగా మాట్లాడుతున్నారు. 2018లో ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కొన్ని కాగితాలను రిలీజ్‌ చేసింది.. వాటి ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్‌ జీఈఆర్‌ రాష్ట్రంలో 84.48శాతం ఉంటే.. దేశం ఆవరేజ్‌ 99 శాతం. అంటే దేశం కంటే ఆంధ్రరాష్ట్రం తక్కువగా కనిపిస్తుంది. మన  రాష్ట్రం అట్టడుగు రాష్ట్రాలతో పోటీపడుతుంది కానీ, పైనున్నరాష్ట్రాలతో పోటీపడటం లేదు.  ఇది సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిలీజ్‌ చేసిన డాక్యుమెంట్‌. 

ఇటువంటి పరిస్థితుల్లో నా పిల్లలను చదివించాలి.. దేశంతో పోటీపడేలా పెరగాలనే ఉద్దేశంతో బడులకు పంపించేందుకు తల్లులకు తోడుగా ఉండేందుకు అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి తలరాతలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. 

గతానికి, ప్రస్తుత పాలనకు తేడా గమనించండి. ఈరోజు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పులు కూడా గ్రేత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) గతంలో 19 శాతం ఉంటే మన హయాంలో గ్రోత్‌రేట్‌ అప్పటికంటే తక్కువే 15 శాతం మాత్రమే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్,  గతం కంటే తక్కువ అప్పులు.. అలాంటప్పుడు తేడా ఏమిటీ..? కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. గతంలో వారు ఎందుకు చేయలేకపోయారు. మీ అన్న, తమ్ముడు ఎందుకు చేయగలుగుతున్నాడో ఆలోచన చేయండి. కారణం.. మీ జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు.. ఆ డబ్బు నేరుగా  నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు.. డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. 

గతంలో కేవలం నలుగురు మాత్రమే.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు.. వీరు  మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో.. డీపీటీ పథకం. గతానికి, ప్రస్తుత పాలనకు తేడా గమనించండి. ఆ ఈనాడు పేపర్‌ చదివినా, ఆంధ్రజ్యోతి, టీవీ5 టీవీలు చూసినా వారి కడుపుమంట కనిపిస్తుంది. దానికి కారణం.. గతంలో దోచుకొని పంచుకునేవారు. మనం వచ్చిన తరువాత దోచుకోవడం, పంచుకోవడం లేదు. అది జీర్ణించుకోలేక వీరి కడుపుమంట కనిపిస్తుంది. 

నాకు చంద్రబాబు మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడు, అండ లేకపోవచ్చు.. దత్తపుత్రుడి సపోర్టు నాకు ఉండకపోవచ్చు. కానీ, నాకున్నది వారికి లేనిది దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు అని కచ్చితంగా చెబుతున్నా. మీ చల్లని దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు రెండూ ఉన్నంత వరకు మీ జగన్, మీకోసం ఎన్ని అడుగులు అయినా వేస్తాడు. 

బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అంశాలు ఎమ్మెల్యే రఘుపతి ప్రస్తావించారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కాంప్లెక్స్‌ కోసం 50 ఎకరాలు కేటాయిస్తూ నాంది పలుకుతున్నాం. బాపట్ల నగరానికి అడిషనల్‌ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ కోసం రూ.18 కోట్లు మంజూరు చేస్తున్నాం. అదేవిధంగా పెరిల్‌ కాల్వ మీద వెంటెడ్‌బెడ్‌ రెగ్యులేటర్‌ మంజూరు చేస్తున్నాం. బాపట్ల మున్సిపాలిటీలో మౌలిక వసతుల కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నాం. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top