ముస్లిం, మైనార్టీల‌కు చేయాల్సిన మంచి అంతా చేస్తున్నాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అనేక సంస్కరణలు చేపట్టారు

మౌలానా జయంతిని మైనార్టీ వెల్ఫేర్‌ డేగా మార్చింది మహానేత వైయస్‌ఆర్‌

మన పిల్లల కోసం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టాం

17 నెలల పాలనలో ముస్లిం మైనార్టీల కోసం రూ.3,428 కోట్లు ఖర్చు చేశాం

హజ్, హోలీల్యాండ్‌ యాత్రికులకు ఆర్థికసాయం అందిస్తున్నాం

నంద్యాల సంఘటన చాలా బాధ కలిగించింది

మేం మంచి ఎలా చేయాలని చూస్తుంటే.. ఎలా బురదజల్లాలని చంద్రబాబు కుట్ర

నిందితుల తరఫున బెయిల్‌ పిటీషన్‌ వేసింది టీడీపీ వ్యక్తే

గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఖర్చు చేసింది రూ.2,661 కోట్లు మాత్రమే

మైనార్టీలపై చంద్రబాబు ప్రేమ ట్విట్టర్, జూమ్‌ల్లో మాత్రమే

తాడేపల్లి: భారత రత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆజాద్‌ 132వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు సీఎం వైయస్‌ జగన్‌ కొనియాడారు. స్వతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, గొప్ప రచయిత, పాత్రికేయుడు, రకరకాల భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని గుర్తుచేశారు. 

భారతదేశానికి తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్‌ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని, అందుకే ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి (నాన్నగారు) 2008లో మౌలానా జయంతిని మైనార్టీ వెల్ఫేర్‌ డేగా రాష్ట్రంలో జరుపుకునేందుకు జీఓలు కూడా జారీ చేశారని గుర్తుచేశారు. 1947 వరకు ఉన్న విద్యా వ్యవస్థలో మన దేశ అవసరాలకు తగ్గట్టుగా లేవని, విద్యా వ్యవస్థలోకి ఆజాద్‌ పలు మార్పులు తీసుకువచ్చారని, మన దేశపు అవసరాలకు తగ్గట్టుగా ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య, టెక్నికల్‌ విద్య వరకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. కేంద్ర విద్యా శాఖలో భాగమైన అనేక బోర్డులు, సంస్థలు, కమిషన్లు, ఏఐసీటీఈ, యూజీసీ అన్నీ కూడా ఆజాద్‌ హయాంలో ప్రారంభించారని గుర్తుచేశారు.  

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

  • మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను నాడు–నేడుతో మార్చేస్తున్నాం. 
  • చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు యూనిఫామ్స్, పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌ల వరకు దృష్టిసారించాం. తరగతి గదులు, మరుగుదొడ్లు, సురక్షిత తాగునీరు, కాంపౌండ్‌ వాల్‌ ఉన్నాయా.. లేదా అని పట్టించుకోవడం, పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మెనూ మార్పు చేసి పౌష్టికాహారం అందించడం. వారి భవిష్యత్తు కోసం అమలు చేయాల్సిన కరికుళం, ఇంగ్లిష్‌ మీడియం వరకు ప్రతి అడుగులో పిల్లలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మార్పులు చేస్తూనే ఉన్నాం. 
  • పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ నుంచి లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఖర్చులు భరించేందుకు ప్రతి ఒక్క విషయంలో తల్లిదండ్రుల మాదిరిగానే బాధ్యతగా ఆలోచన చేస్తూ పిల్లల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం మనది. 
  • మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం అమలవుతుంది. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముళ్ల భావన మరింతగా పెంపొందించేందుకు మన ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది. 
  • అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, సున్నావడ్డీ, పెన్షన్‌ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, లా నేస్తం, నేతన్న నేస్తం, చేదోడు, వైయస్‌ఆర్‌ ఆసరా వంటి పథకాలు అందిస్తున్నాం. ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శక పద్ధతిలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. 

17 నెలల పాలనలో మీ బిడ్డగా రూ.3428 కోట్లు ఖర్చు చేయగలిగా

– 2020 అక్టోబర్‌ వరకు మైనార్టీలకు అందించిన మొత్తం సొమ్ము రూ.3,428 కోట్లు అని గర్వంగా చెబుతున్నా. ఇందులో రూ.2,585 కోట్లు నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తే.. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవన్నీ కలుపుకుంటే మరో రూ.843 కోట్లు. మొత్తం కలిపి 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు రూ.3,428 కోట్లు ఇవ్వగలిగాం అంటే నిజంగా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెన వల్లే చేయగలిగాను. 

గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కలిపి రూ.2,661 కోట్లు మాత్రమే

– మైనార్టీలపై ట్విట్టర్‌లో, జూమ్‌ యాప్‌లలో ఎక్కడలేని ప్రేమచూపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్లు మైనార్టీలకు ఆయన పాలనలో అందినది ఎంతా అని గుర్తుచేసుకుంటే.. 
2014–15లో గత ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చింది రూ.345 కోట్లు మాత్రమే
2015–16లో కేవలం రూ.340 కోట్లు మాత్రమే
2016–17లో కేవలం రూ.641 కోట్లు మాత్రమే
2017–18లో కేవలం రూ.667 కోట్లు మాత్రమే
2018–19లో కేవలం రూ.668 కోట్లు మాత్రమే

మొత్తంగా ఐదేళ్ల పాలనలో కలిపి రూ.2,661 కోట్లు మాత్రమే మైనార్టీలకు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. 
– గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. ఒక్క మైనార్టీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వాన్ని గతంలో చూశాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు మైనార్టీని మంత్రిగా పెట్టాలనే ఆలోచన వారికి రాలేదు. ఇటువంటి వ్యక్తులు మైనార్టీలపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. 

నంద్యాల ఘటన బాధ అనిపించింది

– నంద్యాల సంఘటన జరిగినప్పుడు బాధ అనిపించింది. ఆ కుటుంబం చనిపోతూ పెట్టిన సెల్ఫీ వీడియోలు నా దృష్టికి రాగానే.. ఎలాంటి ఆలోచన చేయకుండా న్యాయబద్ధంగా ఏం చేయాలో అది చేశాం. పోలీసులపై ఏ ప్రభుత్వం కేసులు పెట్టలేదు.. అరెస్టులు చేయలేదు. కానీ, మన ప్రభుత్వం ఎక్కడా తన, మన భేదం చూడకుండా.. నేను అయినా ఒక్కటే.. ఇంకొకరైనా ఒకటే.. ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలని అడుగులు ముందుకు వేశాం. 
– వెంటనే ఆ పోలీసులను సస్పెండ్‌ చేయడమే కాకుండా.. కేసులు పెట్టి అరెస్టులు చేశాం. తరువాత జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఆయన పార్టీకి చెందిన స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో నామిని డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి రామచంద్రరావు అనే వ్యక్తి బెయిల్‌ పిటీషన్‌ వేశాడు. కోర్టులో టీడీపీ పలుకుబడి ముందు ప్రభుత్వ పలుకుబడి సరిపోవడం లేదు. కోర్టు బెయిల్‌ కూడా ఇవ్వడం మన కళ్లముందే కనిపించాయి. ఆ బెయిన్‌లను రద్దు చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు వెళ్లాం. 
– నిజాయితీగా, మంచి చేయాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మనది అయితే... ఏ తప్పు జరగకపోయినా.. తప్పుగా ఎలా చూపించాలి. ఎలా బురదజల్లాలని ఆలోచన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆ బాధలోంచే ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. 

చేయాల్సిన మంచి అంతా చేస్తున్నాం.

– మైనార్టీ సోదరుల కోసం చేయాల్సిన మంచి అంతా చేస్తున్నాం. హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్‌ యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి 60 వేలకు పెంచాం. రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయ ఉన్న వారికి రూ.60 వేలు, రూ.3 లక్షలపైబడి వార్షిక ఆదాయం ఉన్నవారికి రూ.30 వేల సాయం చేస్తున్నాం. 
– ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.3 వేలు గౌరవవేతనంగా అందిస్తున్నాం. మసీద్‌లను పెంచాం. గౌరవ వేతనం అందుకునే వారి సంఖ్యను కూడా పెంచాం. 
– వక్ఫ్‌ బోర్డులో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన స్థిరాస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులను కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. క్రిస్టియన్స్‌కు సంబంధించి కూడా ఇదే పద్ధతిలో కార్యక్రమాలు చేస్తున్నాం. 
– మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాం. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని గర్వంగా చెప్పగలుగుతున్నా. 
– మన పార్టీ తరఫున నలుగురు ముస్లిం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించుకోగలిగాం. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేస్తే.. అందులో ముస్లిం మహిళను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపించాం. 
– మైనార్టీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 900 మథర్సాలలో చదివే 33 వేల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, అమ్మఒడి, విద్యాకానుక అందిస్తున్నాం. 

కేవలం రెండే రెండు వాగ్దానాలు

– మేనిఫెస్టోలో పెండింగ్‌లో ఉన్నవి కేవలం రెండే రెండు వాగ్దానాలు. 
1)వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక, (గత అక్టోబర్‌–2018 నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేశారు.) మనం అధికారంలోకి వచ్చాం. ఈ పథకానికి నగదు పెంచి వచ్చే సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 
2) ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం పెంచడం, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం.
ఈ రెండు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ రెండు పథకాలు అమలు చేస్తామని గర్వంగా చెబుతున్నాం. 
మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందులో చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా మీ బిడ్డ అమలు చేయగలుగుతా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top