గంగ‌పుత్రుల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని పాద‌యాత్ర‌లోనే అనుకున్నా 

అన్న‌లా త‌మ్ముడిలా ప్ర‌తి కుటుంబానికి అండ‌గా ఉంటా

హామీ ఇచ్చిన చోటే అమ‌లు చేయ‌డం సంతోషంగా ఉంది

ఇల్లు, చ‌దువు, ఆరోగ్యం కోసం ప్ర‌జ‌లు రోడ్డెక్కే పరిస్థితి రాకూడ‌దు

ప్ర‌పంచంతో పోటీ ప‌డాల‌నే ఇంగ్లిష్ మీడియం చ‌దువులు

మ‌న పిల్ల‌లు టైలు క‌ట్టుకుని కారులో తిర‌గ‌ద్దా

మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

దేశంలో ఎక్కడా చూడని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ప‌రిపాలన తెచ్చాం. అధికారం చేప‌ట్టి ఐదు నెల‌లు గ‌డ‌వ‌క ముందే 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. గురువారం తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మ‌డివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ మ‌త్స్య‌కార భరోసా కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ముమ్మ‌డివ‌రంలో ఇచ్చిన హామీల‌ను ఐదు నెల‌లు గ‌డ‌వ‌క ముందే ఇదే ముమ్మ‌డివ‌రం నుంచే ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గుజ‌రాత్ పెట్రోలియం కార్పొరేష‌న్ స్థానికంగా 16500 కుటుంబాల‌కు చెల్లించాల్సిన 13 నెల‌ల బ‌కాయిల్లో కేవ‌లం 6 నెల‌లు చెల్లించి చేతులు దులుపుకుంద‌ని.. పాద‌యాత్ర‌లో గంగ‌పుత్ర‌లు నాకు చెప్పుకుని బాధ ప‌డ్డారని చెప్పారు. ఐదారు సంవ్స‌రాలుగా బకాయిల కోసం పోరాడుతున్నా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని త‌న ముందు ఆవేద‌న చెందిన విష‌యం త‌న‌కి ఇప్ప‌టికీ గుర్తుంద‌ని చెప్పారు. కంపెనీ నుంచి అందాల్సిన  బ‌కాయ‌లు వ‌చ్చేలా చూస్తాన‌ని లేనిప‌క్షంలో ప్ర‌భుత్వం ద్వారా ఇస్తాన‌ని చెప్పాన‌న్నారు. ఆ మాట ప్రకార‌మే 7 నెల‌ల బకాయిలు ప్ర‌భుత్వం చెల్లిస్తోంద‌న్నారు. మీ అన్న‌లా త‌మ్ముడిలా ప్ర‌తి కుటుంబానికి అంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఇల్లు, చ‌దువులు, ఆరోగ్యం కోసం కూడా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జ‌లు ధ‌ర్నాలు చేస్తుంటే బాధేసిందని, ఆ క‌ష్టాలు నేను విన్నాను- నేను ఉన్నాను అని హామీ ఇచ్చాన‌ని చెప్పారు. ఉపాధి కోసం గుజ‌రాత్‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను చూస్తే బాధేసింద‌ని తెలిపారు. వేట కోసం వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌రణించే గంగ‌పుత్రుల కుటుంబాల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు. మృతుల కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌లకు పెంచిన విష‌యాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10 వేల‌కు పెంచ‌డంతోపాటు వీలైనంత తొంద‌ర‌గా అందేలా చూస్తాన‌న్నారు. దాంతోపాటు డీజీల్ స‌బ్సిడీని 50 శాతం పెంచి ఇచ్చే రూ. 9ని .. ఆయిల్ కొట్టించుకునే స‌మ‌యంలోనే జ‌మ‌య్యేలా ఈరోజు నుంచే అమ‌లు జ‌రుగుతుంద‌న్నారు. దారిపొడవునా ఫిషింగ్ జెట్టీలు కావాలని పాదయాత్రలో గంగపుత్రులు విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు ప్రారంభిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాన‌ని అన్నారు. అహ‌ర్నిశ‌లు ప్ర‌జా సంక్షేమం కోసం క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్లాల‌ని ప‌నిగా పెట్టుకుని ప్ర‌తిప‌క్షంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 790 మంది మ‌త్స్య‌కారుల పిల్ల‌లు గ్రామ సెక్ర‌టేరియ‌ట్‌లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం మీద రాద్ధాంతం చేసే ప‌త్రికాధిప‌తుల పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దువుతున్నారో ప్ర‌శ్నించాల‌ని సూచించారు. మ‌న పిల్ల‌లు ఇంగ్లిష్ మీడియంలో చ‌దివి టైలు క‌ట్టుకుని ఇంజినీర్లు, డాక్ట‌ర్లు, క‌లెక్ట‌ర్లుగా కారుల్లో తిరుగుతుంటే చూడాల‌న్న‌దే త‌న కోర‌క అని వివ‌రించారు. మ‌న పిల్ల‌లు ప్ర‌పంచంతో పోటీ ప‌డొద్దా అని ప్ర‌శ్నించారు.. ఐదు నెల‌లుగా  రాష్ట్రంలో అమ‌లు  జ‌రుగుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఒక‌సారి ప‌రిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 4 నెల‌ల్లో 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు, రైతు భ‌రోసా కింద 46 ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ. 13500 వంతున పెట్టుబ‌డి సాయం, ఆటో ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు రూ. 10 వేల సాయం, అగ్రి గోల్డ్ బాధితుల‌కు బ‌కాయిల చెల్లింపు.. అడుగ‌డుగునా ప్ర‌జా సంక్షేమం కోసం త‌పిస్తున్న ప్ర‌భుత్వాన్ని దీవించి అండ‌గా నిల‌వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బీసీలంటే బ్యాక్‌వ‌ర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాసుల‌నే విధంగా వారికి నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కూడా మ‌న‌దేన‌న్నారు. మ‌హిళ‌ల‌ను అన్ని రంగాల్లో ప్రోత్స‌హించేలా 50 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ప్ర‌జ‌ల కోసం అహ‌ర్నిశ‌లూ శ్రమిస్తున్న త‌న‌పై బుర‌ద జ‌ల్లాల‌ని చూస్తున్నార‌ని.. మీ అంద‌రి దీవెన‌లు అందించి అండ‌గా నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Read Also: ఏపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట

తాజా వీడియోలు

Back to Top