పేదపిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉంటాడు

ఎవరు అడ్డుకున్నా పేదవాడికి రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ మా లక్ష్యం

ఇంగ్లిష్‌ మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వస్తాయి

గతంలో మండలిలో ఇంగ్లిష్‌మీడియం బిల్లుకు టీడీపీ అడ్డుపడింది

జూన్‌ 1వ తేదీన పిల్లలకు విద్యాకానుక కిట్‌ ఇవ్వబోతున్నాం

36.10 లక్షల మంది పిల్లలకు కిట్ల కోసం రూ.487 ఖర్చు చేయబోతున్నాం  

మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: పేదల బతుకులు మార్చడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను తీసుకువచ్చాం. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదు.. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ అందించాలనేది మా లక్ష్యం. ఎవరు అడుకున్నా.. పేదపిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉంటాడని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.  పేదవాడికి న్యాయం చేసే కార్యక్రమాన్ని ఆలస్యం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదన్నారు. జూన్‌ 1వ తేదీన విద్యాదీవెన కింద పిల్లలకు కిట్లు అందజేయబోతున్నామని వివరించారు. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయగలుగుతున్నామని, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరారు. 

ఇంగ్లిష్‌మీడియం బిల్లుపై సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే.. ‘గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ప్రైవేట్‌ స్కూళ్లకు వేలకు వేల రూపాయలు పెట్టలేక ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం దొరికితే మా బతుకులు మారుతాయని దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. ఈ రోజు అటువంటి వారి గురించి పట్టించుకోని పరిస్థితుల్లో వ్యవస్థలు తయారయ్యాయి. పేదల బతుకులు మార్చడం కోసం.. ప్రభుత్వ బడుల్లో పేదలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలను బడులకు పంపించి ఇంగ్లిష్‌ మీడియంలో చదివించే పరిస్థితి క్రియేట్‌ చేస్తున్నాం. 

దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు 45 వేలకు పైచిలుకు ఉన్నాయి. ఈ 45 వేల స్కూళ్లలో ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పునాది పడాలి. పెరిగేకొద్ది ఇంగ్లిష్‌లో మాట్లాడడం, చదవడం సులభం అవుతుంది. అలాంటి ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌మీడియం తీసుకువస్తే పిల్లల భవిష్యత్తు మెరుగు అవుతుందనేది సత్యం. అలాంటి గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంత వరకు ఇంగ్లిష్‌ మీడియం శాతం ఎంత అంటే.. కేవలం 23.67 శాతం మాత్రమే ప్రైమరీ స్కూళ్లలో ఉంది. మొత్తం చూస్తే 35 శాతం దాటని పరిస్థితి. అదే 98.05 శాతం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలోనే ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాలు పేదలకు ఇంగ్లిష్‌ రాకూడదని, పేదరికంలోనే ఉండాలనే కుట్ర పూరితమైన పరిస్థితుల్లో వదిలేశారు. ఈ వ్యవస్థ మార్చాలి.. పేదవాడికి భావి ప్రపంచంలో పోటీ పరిస్థితి తీసుకురావాలనుకున్నాం. 

కంప్యూటర్లలో మనకు కనిపించే లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌. ఈ రోజు మనం మాట్లాడుకుంటే మెరుగైన జీతాలు ఎవరికైనా రావాలంటే ఇంగ్లిష్‌ అనే భాష మాట్లాడితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలి.. పిల్లల బతుకులు మారాలి.. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదరికంలోని అగ్రవర్ణాలు ఎవరైతే ప్రైవేట్‌ స్కూళ్లకు డబ్బులు కట్టలేక తమ పిల్లలను తెలుగు మీడియానికి పరిమితం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చడం కోసం వ్యవస్థలో మార్పు తీసుకువస్తున్నాం. 

పేదల జీవితాలు మార్చాలంటే ఇంగ్లిష్‌ మీడియం బోధన తీసుకురావాలని చెప్పి ఇదే బిల్లు ఇంతకు ముందే తీసుకువచ్చాం. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదు.. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ తీసుకువచ్చే కార్యక్రమం చేయాలని ధృడ సంకల్పంతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేయించాలని ఇదే బిల్లు కొద్ది నెలల కింద తీసుకువచ్చాం. పేదవాడికి మంచి చేసే బిల్లు, వారి జీవితాలు బాగుచేసే బిల్లు అని తెలిసినా కూడా బిల్లును కౌన్సిల్‌లో అడ్డుకున్నారు. అడ్డుకున్న తరువాత సవరణలు సూచిస్తూ రిజక్ట్‌ చేశారు. ఆ బిల్లు మళ్లీ శాసనసభకు వచ్చింది. దీనిపై చర్చ కొనసాగిస్తున్నాం. ఆ తరువాత అడ్డుకున్నా.. చట్టం అయిపోతుంది. అన్ని తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్లకే తెలియదు. పేదవాడికి న్యాయం చేసే కార్యక్రమాన్ని ఆలస్యం చేసేందుకు ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు. 

ఆ పేదపిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా బిల్లును మళ్లీ ఇదే చట్టసభలో పెట్టి పేదవాడికి ఇంగ్లిష్‌ మీడియం అనేది ఒక హక్కుగా చెబుతున్నాం. అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియం చదువుల గురించి, నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే పరిస్థితి గురించి, చివరకు చిన్న పిల్లలు తినే మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి ఒక మెనూ తయారు చేసి సోమవారం ఏమి ఉండాలి.. మంగళవారం ఏమి ఉండాలి.. బుధవారం ఏమి ఉండాలి.. గురువారం ఏమి ఉండాలి.. శుక్రవారం ఏమి ఉండాలి.. శనివారం ఏమి ఉండాలని ఒక మెనూ తయారు చేసి.. దానికి గోరుముద్ద అని నామకరణం చేశాం. ప్రతి అడుగులో పిల్లల జీవితాల మార్పు దిశగా అడుగులు వేస్తున్నాం. 

జూన్‌ 12వ తేదీన బడులు తెరిచే సమయానికి జూన్‌ 1వ తేదీనే పిల్లలు అందరికీ స్కూల్‌ బ్యాగులు, నోట్‌ బుక్కులు, పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్స్‌లు, బెల్టులు పెట్టి ఒక కిట్‌ ఇవ్వబోతున్నాం. దాదాపుగా ఒక ఒక్క పిల్లాడి మీద రూ.1350 కేటాయిస్తూ.. దాదాపు 36.10 లక్షల మంది పిల్లలకు విద్యా కానుక కింద జూన్‌ 1వ తేదీన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. సుమారు రూ.487 కోట్లు దీని కోసం ఖర్చు అయినా పర్వాలేదు.. ఆ బరువు కూడా తల్లిదండ్రుల మీద పడకూడదు. జీవితాల్లో మార్పు రావాలని అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఇంగ్లిష్‌ మీడియం బోధన బిల్లుకు సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. 
 

Back to Top