దైవ‌సాక్షిగా, ప్ర‌జ‌ల‌సాక్షిగా మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నా

ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నా

పాలన ఏడాది పూర్తిచేసుకున్న రోజు రైతులకే కేటాయించడం ఆనందంగా ఉంది

రైతుకు తోడు, నీడగా రైతు భరోసా కేంద్రాలు

ఏడాది పాలనలో వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేశాం

విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం

అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నాం

మొదటి ఏడాదిలో రూ.40,627 కోట్లతో 3.57 కోట్ల మందికి లబ్ధిచేకూర్చాం

గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థతో పాలన గుమ్మం ముందుకే తీసుకొచ్చాం

మద్యనిషేధం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం

దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలు చేస్తున్నాం

రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పాలన అందిస్తా

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘వైయస్‌ జగన్‌ అనే నేను.. ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా.. మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా.. ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను.’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. అవ్వాతాతలపై గుండెల నిండా ప్రేమతో.. అక్కచెల్లెమ్మల మీద మమకారంతో.. రైతుల పట్ల బాధ్యతతో.. అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో.. పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో.. మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి 6 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నానన్నారు. 

రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 13 జిల్లాల్లో 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రత్యక్షప్రసారం చూస్తున్న 5లక్షల మంది రైతులను, రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఈ రోజును రైతులకే కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..

మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తుంది. ఈ రోజున రైతులతో గడపడం.. ఈ రోజును రైతులకే కేటాయించడం ఎంతో ఆనందంగా ఉంది. దాదాపుగా 10641 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతుందో.. అక్కడ రైతుకు తోడు నీడగా ఉండేందుకు ప్రతీ గ్రామీణ ప్రాంతంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాదాపు 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇదొక విప్లవాత్మక మార్పు గ్రామాల్లో ఇకమీదట రైతు భరోసా కేంద్రాలతో రాబోతుంది. మరీ ముఖ్యంగా రైతుల జీవితాల్లో.. మొదటి ఏడాది పూర్తిగా అధికారంలోకి వచ్చిన తరువాత రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పాను.. 

రైతు  బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది..

మన రాష్ట్రంలో దాదాపు 62 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రైతు  బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది.. రైతు, రైతు కూలీల ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదే.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చాం. వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ద్వారా మొట్టమొదటి ఏడాదిలోనే రూ.10,200 కోట్లు మనం రాష్ట్రంలోని దాదాపు 49 లక్షల రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేశాం. 

ఈ మూడింటిలోనూ అడుగులు పడాలి

రైతుకు అవసరం ఉన్నప్పుడు సహాయం అందాలి. పెట్టుబడి ఖర్చు తగ్గాలి.. రైతుకు ఏదైనా విపత్తు వస్తే తోడుగా ఉండాలి. ఆ తరువాత రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ మూడు ఉద్దేశాలను మనసులో పెట్టుకొని వ్యవసాయం అన్నది బాగా జరగాలంటే.. లాభసాటిగా ఉండాలంటే.. ఈ మూడింటిలోనూ అడుగులు పడాలి. ఈ మూడింటిని ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. 

విత్తనం మొదలు.. పంట అమ్మకం వరకు..​

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు.. పంట అమ్మకం వరకు.. రైతుకు అడుగడుగునా.. మీ గ్రామంలోనే రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసా కేంద్రాలు అన్ని రకాలుగా తోడుగా ఉంటాయి. సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. ఈక్రాపింగ్, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్, పంట రుణాలు, చివరకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో ఆర్బీకేలు తోడుగా ఉంటాయి. 

తిరగని ప్రదేశం లేదు.. తిరగని జిల్లా లేదు..​

ఈ సంవత్సరకాలపు మన పరిపాలన.. చిత్తశుద్ధితో జరిగిందని, నిజాయితీ, నిబద్ధతతో జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా.. దాదాపు 11 సంవత్సరాలైంది.. రాజకీయాల్లోకి వచ్చి.. 2009లో మొట్టమొదటి సారిగా ఎంపీగా ఎన్నికయ్యాను. దాని తరువాత 11 ఏళ్లుగా ఈ రాజకీయ ప్రయాణం సాగుతోంది. ఈ ప్రయాణంలో కోట్ల మందిని కలిసి ఉంటా.. రాష్ట్రంలో ఏ మూలా విడిచిపెట్టకుండా.. ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు అడుగులు వేశా.. 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. తిరగని ప్రదేశం లేదు.. తిరగని జిల్లా లేదు.. ప్రతి గ్రామాన్ని నా 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తగిలే ఉంటా. ఇలా సాగిన నా ప్రయాణంలో మనసులో చాలా సమస్యలు ఉత్పన్నం అయ్యేటివి. ప్రజల సమస్యలు విన్నప్పుడు.. వాళ్ల మాటలు విన్నప్పుడు.. చదువు రాని వారిని చూసినప్పుడు చదువు ఎందుకు చదివించలేకపోతున్నారనే ప్రశ్నలు నా మనస్సుకు వచ్చేవి.. చదివించడం ఇష్టం లేక కాదు.. చదివించే స్థోమత లేక చదువులు ఆగిపోయిన పరిస్థితులు చూశా..

పొలాల్లోనే విడిచిపెట్టే పరిస్థితిని చూశా.. 

వైద్యం అందక అప్పులపాలయ్యే పరిస్థితులు కళ్లముందే కనిపించాయి. కేన్సర్‌ వంటి రోగాలు వస్తే.. చాలిచాలని సొమ్ముతో చేశామంటే.. చేశాం అన్న పరిస్థితులు చూశాం. గవర్నమెంట్‌ ఆస్పత్రుల పరిస్థితి చూశా.. వైద్యం అందించాలన్న చిత్తశుద్ధి కనిపించని రాజకీయ వ్యవస్థను చూశా.. రైతుల సమస్యలు చూశా.. పెట్టుబడి సైతం డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏదైనా విపత్తు వస్తే ఆదుకునే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా సరైన సమయంలో అందని పరిస్థితిని గమనించా.. చివరకు గిట్టుబాటు ధర లేక పంటలను పొలాల్లోనే విడిచిపెట్టే పరిస్థితిని చూశా.. 

పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తీసుకురావాలి..​

ఈ 11 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నా అక్కచెల్లెమ్మల పరిస్థితిని చూశా.. గ్రామాల్లో వీధి చివర, గుడి పక్కన, బడి పక్కన విచ్చలవిడిగా మందు అమ్ముతున్న పరిస్థితులు చూశా.. అక్కచెల్లెమ్మలను బాగా చూసుకుంటేనే కుటుంబం బాగుంటుందని తెలిసినా కూడా.. ఆ అక్కచెల్లెమ్మల ముఖంలో కన్నీరు రాకుండా చూడాలనే ఆరాటపడే ప్రభుత్వాలను చూడలేదు. ఆ అక్కచెల్లమ్మల జీవితాలను ఎలా మార్చాలని నా మనసు నిండా ఆలోచనలు వచ్చాయి. పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తీసుకురావాలి.. ఆ కుటుంబం అప్పులపాలు కాకుండా ఎలా నిలబడాలని.. ఏరకమైన పాలన అందిస్తే.. అది జరుగుతుందనే ఆలోచనలు ఈ 11 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఆలోచనలు చేశా.. 

నాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని..

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మేనిఫెస్టోను తీసుకువచ్చాం. ఆ మేనిఫెస్టోను తీసుకువచ్చేటప్పుడు కూడా నా మనసులో కదిలిన ప్రశ్నలు.. ‘నాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని.. కులాలు చూడకూడదు.. మతాలు, వర్గాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. అర్హత ఉంటే చాలా ప్రతి ఒక్కరికీ మంచి కచ్చితంగా జరగాలనే ఆలోచనలు కలబోసిన తరువాత.. నా పాదయాత్ర ముగిసిన తరువాత మేనిఫెస్టో రిలీజ్‌ చేశా’ం. ఈ మేనిఫెస్టో కూడా కేవలం రెండే పేజీల్లోనే రూపొందించాం.  మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని.. చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చగలిగితే.. ప్రజలకు నవరత్నాలను తీసుకుపోగలిగితే వారి జీవితాలు బాగుపడతాయని నమ్మాను. 

తూచా తప్పకుండా అమలు చేస్తున్నా​

ఏడాదికాలంలోనే మేనిఫెస్టోలోని వాగ్దానాలను 90 శాతం మేరకు అమలు చేసేందుకు అడుగులు వేశామని గర్వంగా చెప్పగలను. అవ్వాతాతలపై గుండెల నిండా ప్రేమతో.. అక్కచెల్లెమ్మల మీద మమకారంతో.. రైతుల పట్ల బాధ్యతతో.. అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో.. పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో.. మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి 6 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నానని వైయస్‌ జగన్‌ అనే నేను.. ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా.. మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా.. ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను. 

ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద మేనిఫెస్టో

కేవలం ఏడాదికాలంలోనే 90 శాతం వాగ్దానాలు అమలు దిశగా అడుగులు వేశాం. ఈ మేనిఫెస్టో నా కార్యాలయం నుంచి మొదలుపెడితే.. సచివాలయంలోని ప్రతి సెక్రటరీ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర, వారి కార్యాలయాల్లో కూడా మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి జిల్లా కలెక్టర్‌ దగ్గర మేనిఫెస్టో కనిపిస్తుంది. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా నేను ఎలా భావిస్తున్నానో.. అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం కూడా అంతే∙చిత్తశుద్ధి పెట్టి ఈ సంవత్సరకాలం పరిపాలన సాగింది. మేనిఫెస్టోను ఐదేళ్లలో చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానపత్రం. ఈ వాగ్దాన పత్రం.. ఐదు సంవత్సరాలకు అయితే.. తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలు ఎన్ని.. అమలు కోసం క్యాలెండర్‌తో సహా డేట్లు ఇచ్చేసి సిద్ధంగా ఉన్న పథకాలు ఎన్ని అని నిజాయితీగా లెక్కలు వేస్తే.. మొత్తం మేము ఇచ్చిన హామీలు 129 అయితే ఇప్పటికి అమల్లోకి వచ్చినవి 77, అమలు కోసం ప్రారంభోత్సవాల తేదీలు ఇచ్చి సిద్ధంగా ఉన్నవి మరో 36. రెండూ కలిపితే 129 వాగ్దానాలకు 90 శాతం అమలు చేశాం.. అమలుకు సిద్ధంగా ఉన్నాం.. కేవలం ఏడాది పాలనలోనే ఇది జరిగింది. 

ప్రజల సంక్షేమం మీద నేను పెడుతున్న సంతకం

మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఈ ఏడాది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేసినవి మరో 40 ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేశాం. ఇది మొదటి ఏడాది పాలనలో ప్రజల సంక్షేమం మీద నేను పెడుతున్న సంతకం. రాబోయే రోజుల్లో గ్రామ వలంటీర్ల చేత.. మేనిఫెస్టో, ఒక బుక్‌ ప్రతి ఇంటికి పంపిస్తాం. మేనిఫెస్టో అంటే ఏమిటీ..? ఏ రాజకీయ పార్టీ అయినా మేనిఫెస్టోను ఎలా తీసుకోవాలి..? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలని చెప్పే పాలనలో భాగంగా మేనిఫెస్టో ప్రతి ఇంటికి పంపిస్తాం.. ప్రతి అంశం చేశామా.. చేయలేదా అనేది ప్రజలే నిర్ణయించాలి.మొదటి ఏడాదిలోనే 3.57 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించగలిగాం. ఏడాదిలో రూ.40,627 కోట్లు నేరుగా ఎటువంటి అవినీతికి తావులేకుండా.. ప్రజల బ్యాంక్‌ అకౌంట్లకే అందించగలిగాం. 

ప్రతి పేదవాడికి తోడుగా ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు..

పెన్షన్‌ కానుక గతంలో రూ. వెయ్యి ఇచ్చేవారు.. ఈ రోజు అదే పెన్షన్‌ రూ.2250 అందిస్తున్నాం. గతంలో నెలకు రూ.400 కోట్లు వచ్చే పెన్షన్‌ ఖర్చు.. నేడు రూ.1500 కోట్లపైచిలుకు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్‌ కానుక నుంచి మొదలుపెడితే.. అమ్మఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీలో కూడా విప్లవాత్మక మార్పులు చేశాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.686 కోట్లు తీర్చడమే కాకుండా.. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్చుతూ.. ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకువచ్చి వైద్యం అనంతరం విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేల చొప్పున అందిస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పిల్లల చదువులకు భరోసా ఇస్తూ.. పేదవారు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం చదివిస్తుందనే నమ్మకాన్ని కల్పించాం. కంటి వెలుగుతో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేయించాం. చదువుకుంటున్న పిల్లలకు కూడా చేయించాం. కళ్లజోళ్ల నుంచి శస్త్ర చికిత్సల వరకు వెళ్లాం. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ, లా నేస్తం, అగ్రిగోల్డ్‌ అనేక పథకాలు, చివరకు గోరుముద్ద కూడా అమలు చేశాం. వీటన్నింటికి లబ్ధిదారులకు మనీ ట్రాన్స్‌ఫర్‌ లేదా డబ్బు చేతిలో పెట్టడం ద్వారా ఇచ్చిన సొమ్ము సంవత్సరకాలంలో రూ.40,627 కోట్లు అని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా.. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు.. మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరిగింది. 

ఎక్కడా చిరునవ్వు పోనివ్వలేదు..​

గత ప్రభుత్వం పెట్టిన సుమారు రూ.39 వేల కోట్లు బకాయిలు, గత ప్రభుత్వం మన నెత్తిన వదిలివెళ్లిన రూ.2.60 లక్షల కోట్ల అప్పులు.. వాటికి వడ్డీలు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఒక్క విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సింది.. రూ.20 వేల కోట్లకు చేరడం.. వీటికి తోడు కోవిడ్‌ తెచ్చిన కష్టాలు.. ఇలాంటి ప్రతిబంధకాలు, అవరోధాలు ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి చేయలేను అనే మాట రానివ్వలేదు. ఎక్కడా చిరునవ్వు పోనివ్వలేదు.. గుండెనిండా ప్రేమతో, దేవుడి దయతో ఈ మేరకు చేయగలిగాను..

మొదటి ఏడాదిలో రూ.40,627 కోట్లతో 3.57 కోట్ల మందికి లబ్ధిచేకూర్చాం

  • ఇందులో బీసీలు 1కోటి 78 లక్షలా 42 వేల 48 మంది.. వీరి కోసం రూ.19 వేల 309 కోట్లు బీసీల మేలు కొరకు ఖర్చు చేశాం.
  • ఎస్సీలు 61 లక్షలా 26 వేల 203 ఎస్సీలు ఉంటే వీరి కోసం మనం ఖర్చు చేసింది రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం. 
  • ఎస్టీలు అయితే 18లక్షలా 40 వేల మంది అయితే వీరి కోసం రూ.2,136 కోట్లు అని గర్వంగా చెప్పగలుగుతున్నా. మన్యంలో ఉంటారు.. కానీ, మనసులో మాత్రం కల్మషం ఉండదు. 
  • మైనార్టీలు 19లక్షలా 5వేల మంది అయితే వీరి కోసం రూ.1722 కోట్లు ఖర్చు చేయగలిగాం.
  • మిగతా వారందరినీ లెక్కవేసుకుంటే 77 లక్షలా 84 మంది వీరి కోసం ఖర్చు చేసింది.. రూ.10,760 కోట్లు. 
  • మొత్తం మీద 3.58 కోట్ల మందికి.. రూ. 40,627 కోట్లు ఖర్చు చేసి దేవుడి దయతో వీరి జీవితాల్లో మార్పు తీసుకురాగలిగాం..

ఎక్కడా అవినీతికి తావులేకుండా..

ఇందులో నా మనసుకు తృప్తి అనిపించేది.. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. నిధులు దారిమళ్లించే అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్‌లోకే వేశాం. పాత అప్పుల జమ చేసుకోకూడదని బ్యాంకర్లకు చెప్పి మరీ లబ్ధిదారులకు అందించాం. ఇది మనసుకు చాలా తృప్తిని ఇచ్చే కార్యక్రమం. 

గత పాలనకు.. మన పాలనకు మధ్య తేడా

గత పాలనకు.. మన పాలనకు మధ్య తేడా కూడా కొన్ని మాటల్లో చెబుతా.. ఇంతకు ముందు పరిపాలన మేనిఫెస్టో పుస్తకంలా ఉండేది. ఆ పుస్తకంలో 650 పైచిలుకు వాగ్దానాల్లో ఎన్ని అమలు చేశారని చూస్తే.. 10 శాతం కూడా అమలు చేయని పరిస్థితి. ఈ రోజు కష్టం,నష్టం వచ్చినా ప్రతికూల వాతావరణం ఏర్పడినా.. చెప్పిన మాటకు కట్టుబడి ఈ మేనిఫెస్టోను రెండే పేజీల్లో రూపొందించాం.. ఇందులో 90 శాతం అమలుకు అడుగులు పడ్డాయని గర్వంగా చెప్పగలను. 

గత ప్రభుత్వ పాలనలో గ్రామం నుంచి రాజధాని వరకు అన్నీ తన మనుషుల చేతుల్లోనే ఉంచుకోవాలనే ఆరాటం కనిపించింది. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. రాజధాని భూముల వరకు అంతా తన కబ్జాలోనే.. తన కనుసన్నల్లోనే నడవాలని ఆరాటపడే పరిపాలన గత ప్రభుత్వ హయాంలో చూశాం. అలాంటి పాలన కాబట్టే రాజధాని అని డిక్లేర్‌ చేసిన ఇదే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తే.. సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని గత ప్రభుత్వం వారు కోర్టుకు వెళ్లి.. కోర్టుల్లో కూడా నిసిగ్గుగా సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని వాదించిన పరిస్థితులు కనిపించాయి. భూములు సేకరిస్తుంటే.. కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలను చూశాం గానీ, ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాన్ని ఈ రోజే చూస్తున్నా..

ప్రతిరంగం తనకు కావాల్సిన మనుషుల చేతుల్లోనే ఉండాలని.. ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదని ఒక పద్ధతి ప్రకారం.. మన స్కూళ్లు, హాస్టళ్లు, చివరకు ఆస్పత్రులు, డెయిరీలు అన్నీ మూసివేయడం గతంలో చూశాం. ఈ రోజు వీటిని ఎలా నిలబెట్టాలని మన ప్రభుత్వం ఆరాటపడుతుంది. పేదలకు ఎలా ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఆరాటపడుతున్నాం. 

అర్హుల గుమ్మం ముందుకే ప్రభుత్వ పథకాలు ​

గతంలో ప్రభుత్వ పథకాలు కావాలంటే జన్మభూమి మాఫియా ముఠాల సంతకాలు కావాల్సి ఉండేది.. అందరికీ మంచి చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరి ప్రమేయం లేకుండా.. ఏ సిఫారస్సు లేకుండా నేరుగా అర్హులందరికీ కూడా గుమ్మం ముందుకే వచ్చి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. 

గతంలో రేషన్‌ కార్డు కావాలంటే రూ.500 లంచం, పెన్షన్‌ కోసం రూ.3 వేల లంచం, బీమా కావాలంటే రూ. 20 వేలు లంచం, మరుగుదొడ్లు కావాలంటే రూ. 2 వేల లంచం, ఇల్లు కావాలంటే రూ.15 వేలు లంచం.. లంచం, సిఫారస్సు లేనిది పని జరిగే పరిస్థితి గతంలో ఎప్పుడూ ఉండేది. ఈ రోజున ఏ ఒక్కరికి పైసా లంచం ఇవ్వకుండా.. వివక్షకు తావులేకుండా.. పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే.. ఇంటికే నేరుగా ఇస్తున్నాయి.. ఇది గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడా.. 

పెన్షన్, రేషన్‌కార్డు, ప్రభుత్వ పథకాలు, పట్టాదారు పాస్‌బుక్, క్యాస్ట్‌ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్, డెత్‌ సర్టిఫికేట్‌ కావాలన్నా.. ఏది కావాలన్నా గతంలో చెప్పులు అరిగేలా తిరిగేవారు.. చేతులు తడిపేవారు.. ఈ వ్యవస్థను మార్చేశాం.. ఇవాళ మీ కళ్ల ముందే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 540 రకాల సేవలు.. డెడ్‌లైన్‌ పెట్టి మరీ ప్రజలకు ఇవాళ అందించే కార్యక్రమం చేస్తున్నాం. గ్రామంలోనే లంచం, వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాం. 

గతంలో నచ్చిన వారికి పథకాలు అందించేవారు.. దరఖాస్తుకు సమయం ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు ముగుస్తుందో తెలిసిది కాదు.. ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవు.. అంతా పారదర్శకంగా జరుగుతుంది. దరఖాస్తు దగ్గర నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అంతా గ్రామ సచివాలయ బోర్డుపై పెడుతున్నాం. ఎవరికి వచ్చిందో చూసుకోవచ్చు.. తెలుసుకోవచ్చు.. అర్హత ఉండి పథకం అందకపోతే.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఉంటుంది.

గతంలో పెన్షన్‌ తీసుకోవాలంటే ఒక నరకం.. ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాళ్లు అరిగేలా తిరగాలి.. లంచం లేనిదే పని జరిగే పరిస్థితి గతంలో లేదు. మళ్లీ మొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారని అడిగేవారు.. ఈ రోజు అవ్వాతాతల ఇంటి గడప వద్దకే సూర్యభగవానుడు ఉదయించకముందే గ్రామ వలంటీర్లు చిరునవ్వుతో అవ్వాతాతల చేతుల్లో పెన్షన్‌ సొమ్ము అది ఆదివారమైనా.. పండగ అయినా సరే అందిస్తున్నారు. నాకు ఓటు వేయనివారైనా సరే వారి గౌరవం ఎక్కడా తగ్గించకుండా.. వారి  ఇంటికి కూడా నేరుగా వెళ్లి సంక్షేమ పథకాలు అందించి వారి ముఖంలో కూడా చిరునవ్వు చూస్తున్నాం. 

గతంలో గ్రామాల్లోకి వెళితే శిథిలావస్థకు చేరిన స్కూల్‌ కనిపించేవి.. బాత్‌రూంలు కాదు కదా.. కనీసం కూర్చునేందుకు ఫర్నిచర్‌ కూడా స్కూల్‌లో ఉండేవి కాదు. బాత్‌రూమ్‌లు లేక ఆడపిల్లలు స్కూల్‌ మానేసే పరిస్థితి. అక్టోబర్, నవంబర్‌ అయినా పుస్తకాలు అందవు.. మధ్యాహ్న భోజన పథకానికి 10 నెలల వరకు సరుకుల బిల్లులు ఇవ్వరు. ఆయాలకు ఇచ్చే రూ.వెయ్యి కూడా పెండింగ్‌ పెట్టిన పరిస్థితి. ఈ రోజున మన కంటి ముందే మన గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకేస్తే.. ఒక ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కనిపిస్తుంది. నాడు–నేడుతో స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డు, ఫర్నీచర్, పెయింటింగ్, ఫినిషింగ్, చివరకు ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలు తినే మెనూ మీద కూడా ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి ఈరోజున ఉంది. మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు ఇస్తున్నాం. సరుకుల బిల్లులు కూడా గ్రీన్‌ఛానల్‌లో పెట్టాం. గోరుముద్ద అని పేరుపెట్టి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. 

ఇంతకు ముందు ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలపై నియంత్రణ లేదు. సదుపాయాలు ఉన్నాయా..? ఫీజులు ఎంత తీసుకుంటున్నారు..? టీచర్లు ఉన్నారా.. లేదా..? అని పట్టించుకునే పరిస్థితులు గతంలో ఉండేవి కాదు. కేవలం పిల్లల భవిష్యత్తు కోసమని ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనే ఆరాటంతో వేలకు వేల డబ్బు స్కూళ్లకు చెల్లించే పరిస్థితి. చాలీచాలని ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు గతంలో చూశాం. 

ఈ రోజున రెండు రెగ్యులేటరీ సంస్థలు నియమించాం. స్కూల్‌ రెగ్యులేటరీకి ఒక కమిషన్, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు ఒక కమిషన్‌ వేశాం. ప్రైవేట్‌ స్కూళ్లు కూడా ఎలా ఉండాలి.. ఎంత ఫీజులు చార్జ్‌ చేయాలి.. దాంట్లో ఫెసిలిటీలు ఎలా ఉండాలని చెప్పి.. మానిటర్‌ చేసే వ్యవస్థ ఈ రోజు కనిపిస్తుంది. 

గతంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్తే.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వెనక్కిపంపించే పరిస్థితి. కారణం ప్రభుత్వం బిల్లులు బకాయిలు పెట్టడం. కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తే చాలీచాలనట్టు ఇచ్చే పరిస్థితి. 108, 104 వాహనాలు ఎప్పుడు వస్తాయో.. తెలియదు.. వస్తాయో.. రావో పరిస్థితుల్లో గతంలో ఆరోగ్యశ్రీ నడిచేది. 

ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.686 కోట్లు తీర్చడమే కాకుండా.. ఒక్కరూపాయి కూడా బాకీ లేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని మన ప్రభుత్వం నడిపిస్తుంది. వైద్యం కోసం వెళ్లిన రోగిని ఆస్పత్రులు చిరునవ్వుతో స్వాగతించి వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు పెంచాం. వెయ్యిని 1200 చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో 2000 రోగాలతో పైలెట్‌ ప్రాజెక్టు చేపడుతున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లినా 132 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందుతుంది. జూలై 1వ తేదీన బెంజ్‌ సర్కిల్‌లో 1060 కొత్త 104, 108 వాహనాలకు జెండా ఊపబోతున్నాం. 1060 కొత్త వాహనాలు బెంజ్‌ సర్కిల్‌ నుంచి జిల్లాలకు చేరుతాయి. 

తలసేమియా ఉన్నా.. పెరాలసిస్‌ వచ్చినా.. సికిల్‌సెల్‌ అనేమియా, హిమోఫేలియా వచ్చినా, చివరకు లెప్రసీ ఉన్నవారిని గతంలో పట్టించుకోలేదు. కిడ్నీ, గుండె, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ గురించి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. 

ఈ రోజు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 3 వేల నుంచి రూ.10 వేల పెన్షన్‌ ఇస్తున్నాం. గ్రామ వలంటీర్లు ఇంటికే వచ్చి చేతుల్లో సాయం పెట్టి వెళ్తున్నారు. 

గతంలో గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వెళ్తే మెడిసిన్‌ ఉండేవి కాదు.. ఉన్నా నాసిరకం మందులు వాటితో తలనొప్పి కూడా పోయేది కాదు. గతంలో గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో సెల్‌ఫోన్‌ లైట్స్‌తో ఆపరేషన్లు, ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోతున్నారనే ఘటనలు పేపర్లు, టీవీల్లో సర్వసాధారణంగా కనిపించేవి. 

ఈరోజు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. 500 రకాల మందులు అందిస్తున్నాం. అన్నీ కూడా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ స్టాండెట్స్‌ మెడిసిన్‌ అందిస్తున్నాం. ‘నాడు–నేడు’ కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. ఇందుకు రూ.16 వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి.. గతానికి ఇప్పటికి మధ్య తేడా చూడాలని కోరుతున్నాం.. 

గతంలో రూ.87,612 కోట్ల రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. చివరకు రైతులకు సున్నావడ్డీ కూడా ఎగరగొట్టారు. రుణమాఫీ పేరిట గత ఐదేళ్ల పాలనలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. 
ఈరోజు సంవత్సరం తిరిగముందే రైతుల ఖాతాల్లోకి అక్షరాల రూ.10,200 కోట్లు జమ చేశాం. సున్నావడ్డీ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చాం. జూలై మాసంలో మరో రూ.2 వేల కోట్లు సున్నావడ్డీ పథకం కోసం రైతుల తరుఫున కట్టబోతున్నాం. గతంలో కౌలురైతుల గురించి పట్టించుకోలేదు. ఈ రోజున కౌలు రైతు కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చాం. కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకం అందజేస్తున్నాం. 

గత ప్రభుత్వ హయాంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందులు. గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోతే దానికి బాధ్యత వహించక అపహాస్యం చేసిన ఘటనను చూశాం. కల్తీ పురుగుమందులు ఎవరు సప్లయ్‌ చేస్తారంటే.. గతంలో స్పీకర్‌గా పనిచేసిన వాళ్లే.. కల్తీ విత్తనాలు వాళ్లే.. ఇక వీళ్లు కల్తీ అనే పదంపై ఏం యాక్షన్‌ తీసుకోగలరు..

ఈరోజు గవర్నమెంట్‌ సర్టిఫై చేసి.. క్వాలిటీపై గ్యారంటీ ఇచ్చి ఎవరికి విత్తనాలు, పురుగుమందు కావాలన్నా.. ఎరువులు కావాలన్నా.. గుమ్మం ముందుకే గవర్నమెంట్‌ క్వాలిటీ మార్క్‌ వేసి సప్లయ్‌ చేసే పరిస్థితి. 18వ తేదీన విత్తనాల పంపిణీ మొదలుపెట్టాం. గతంలో చాలా పెద్ద క్యూలు కనిపించేవి.. అన్ని పత్రాలు ఉన్నా చివరకు విత్తనాలు ఇచ్చేవారుకాదు.. ఇప్పుడు ఎవరి దగ్గరకు పోవాల్సిన పనిలేదు.. నేరుగా మీ గ్రామంలోని ఇంటి వద్దకే విత్తనాల పంపిణీ జరుగుతుంది. 

పంటలకు తగిన గిట్టుబాటు ధర లేక రైతు ఇబ్బంది పడితే.. గ్రాఫిక్స్‌ చూపించే నాయకులు పట్టించుకున్న పాపానపోలేదు. వారి పార్టీ నాయకులకే ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలు, జ్యూస్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లు కూడా వారికే.. ఒకరికి గల్లా ఫుడ్స్, ఒకరికి శ్రీని ఫూడ్స్‌.. ఇక వీళ్లు రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తారు..

ఆ పరిస్థితి నుంచి ఇవాళ కోవిడ్‌ వచ్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అక్షరాల ఈ సంవత్సరకాలంలో రూ.2,200 కోట్లు ఖర్చు చేసి రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ చేశాం. గతంలో టమాటాలు రోడ్డు మీద పడేసేవారు.. ఈ రోజు టామాటాలు 14 వందల చిల్లర టన్నులు కొనుగోలు చేశాం. ఉల్లి, మొక్కజొన్న, అరటి, చీనీ కొనుగోలు చేశాం. 

గతంలో పోలీసుల చేత బండచాకిరి చేయించుకునేవారు తప్ప.. వారి కుటుంబాల గురించి ఆలోచన చేసేవారు కాదు.

పోలీస్‌ వ్యవస్థలో ఈ రోజు మార్పులు తీసుకువచ్చాం. వారికి మనఃశాంతి ఉంటే బాగా పనిచేస్తారని, పోలీసులకు వీక్లీఆఫ్‌ కూడా ఇచ్చాం. పోలీస్‌ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాం. 

గతంలో ఇంటిపక్కనే, గుడిపక్కనే, బడిపక్కనే వీధికి రెండు చొప్పున బెల్టుషాపులు కనిపించేవి.. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టుషాపులు ఉండేవి. మద్యం ఎలా తాగించాలనే ఆరాటంతో అమ్మకాలు జరిగేవి.. మద్యం షాపు పక్కనే పర్మిట్‌రూం కనిపించేది. ఆ దారి గుండా అక్కచెల్లమ్మలు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. సమయం మించినా అమ్మకాలు జరిగేవి. 

ఈ రోజు ఒక్క బెల్టుషాపు కనిపించదు. 43 వేల బెల్టుషాపులు రద్దు చేశాం. ప్రైవేట్‌ తీసేసి గవర్నమెంట్‌షాపులు నడుపుతోంది. గతంలో పోల్చితే 33 శాతం మద్యంషాపులు తగ్గాయి. 4380 పర్మిట్‌రూమ్‌లు రద్దు చేశాం. మద్యం విక్రయం 11 నుంచి 8 గంటల వరకు చేశాం. మద్యం షాక్‌ కొట్టేలా రేట్లు పెంచాం. మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 

గత ప్రభుత్వంలో బీసీల మీద ప్రేమ అని చెప్పారు కానీ, చేసిందేమీ లేదు. పేదవాడికి చేసిందేమీ లేదు. సామాజికన్యాయం కనిపించేది కాదు. పిల్లల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇందుకు ఉదాహరణ. 

ఈరోజు అట్టడుగు వర్గంలోని వారంతా పేదరికం నుంచి బయటకు వచ్చే రోజు కనిపిస్తుంది. ఎందుకుంటే చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేదు కాబట్టి. ప్రతి ఒక్కరికి ఇంగ్లిష్‌మీడియం చదువులు అందించనున్నాం. మన ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. స్పీకర్‌ పదవిలో బలహీనవర్గాలకు చెందిన తమ్మినేని సీతారాం అన్నను కూర్చోబెట్టాం. 

గ్రామ సచివాలయాల్లో దాదాపు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 82.05 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సామాజిక న్యాయం ఏ స్థాయిలో ఉందంటే.. నామినేటెడ్‌ పదవులు, వర్క్‌లలో 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. 50 శాతం పూర్తిగా మహిళలకే కేటాయించాం. 

ఇదే విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి చైర్మన్‌గా బీసీ ఎప్పుడైనా కనిపించారా.. కమిటీలో 50 శాతం సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనిపించారా..? ఈ రోజున కనిపిస్తున్నారు. ఇదే కృష్ణాజిల్లా ఏఎంసీలు తీసుకుంటే.. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సామాజిక న్యాయం అన్నది చిత్తశుద్ధితో అమలు జరుగుతుంది. శాశ్వత బీసీ కమిషన్‌ తీసుకువచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు రెండు సపరేట్‌ కమిషన్‌లు తీసుకొస్తాం.. చట్టం చేశాం. ఎస్సీల్లోనే మూడు కార్పొరేషన్లు మాల, మాదిగ, రెల్లీ అని తీసుకువచ్చాం. ఎక్కడా కూడా ఇంతగా పరితపించి ఆరాటపడిన ప్రభుత్వం లేదు. గతాన్ని.. ఇప్పటి పాలనను కాస్త పోల్చి చూడమని అడుగుతున్నా.. గతంలో ఇళ్ల స్థలం ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజున ప్రభుత్వం రూ.6 వేల కోట్లపైచిలుకు ఖర్చు చేసి ఇళ్ల స్థలాలు సేకరించి.. ఇంటిస్థలం లేనివారు రాష్ట్రంలో ఉండకూడదని గ్రామ సచివాలయాల్లో జాబితా పెట్టాం. ఇప్పటికైనా రాకపోతే అర్హత ఉంటే నమోదు చేసుకోవాలని ట్రాన్స్‌పరెంట్‌గా చేస్తున్నాం. అక్షరాల నాన్న పుట్టిన రోజున నాటికి 29 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. 

చేనేత గురించి గతంలో మాట్లాడేవారు.. కానీ నేతన్నలకు చేసిందేమీ లేదు. ఈ రోజున మగ్గం ఉంటే చాలు చేనేతలకు రూ.24 వేలు చేతుల్లో పెడుతున్నాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10 వేల సాయం అందిస్తున్నాం. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలుపెడితే.. రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు ఏవర్గాన్నైనా చూసుకోండి.. పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే కృషిచేస్తున్నాం. 

గత ప్రభుత్వంలో అవినీతి గురించి మాటలు చెప్పేవారు.. అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఈ రోజు గత ప్రభుత్వం చేసిన పనులను క్యాన్సిల్‌ చేసి అదే పనులకు రివర్స్‌టెండర్లకు వెళ్లి రూ.2 వేల కోట్లు మిగిల్చాం. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక జడ్జి చేత టెండర్‌ డాక్యుమెంట్స్‌ వెట్టింగ్‌ చేసి జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటు చేశాం. రివర్స్‌టెండరింగ్‌లో ఎవరైనా తక్కువ రేట్‌ కోట్‌ చేస్తే.. అంతకంటే తక్కువ రేట్‌కు కోట్‌ చేసేందుకు అవకాశం ఇస్తూ.. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఇంకా రేట్లు ఎలా తగ్గించాలని ఆలోచన చేస్తున్నాం. 

అవినీతి చేయాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం చేసే పనులకు దేవుడి దయతో పాటు, మీ అందరి చల్లని దీవెనలు కూడా ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. 
రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నాలుగు మాటలు చెబుతా.. వ్యవసాయంలో సమస్యలకు సమూల మార్పుల ద్వారానే సమాధానాలు లభిస్తాయి. వ్యవసాయం మీద 62 శాతం మంది ప్రజలు బతుకుతున్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకువస్తేనే.. ఈ రంగాన్ని కాపాడుకోగలుగుతాం. రైతులు అప్పులపాలుకాకుండా చేయగలుగుతాం. రైతు వేసే విత్తనం దగ్గర నుంచి రైతు పండించిన పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతు ఎలాంటి మోసానికి గురికాకుండా.. రైతుకు అన్ని విధాలా అండదండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతన్న కష్టాల చరిత్రను మార్చుతామని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. గ్రామస్థాయిలో 10641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం

ప్రభుత్వం పరిశీలన చేసి.. గ్యారంటీ ఇచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే ఆర్బీకేల ద్వారా విక్రయించబడతాయి. ఈ కేంద్రంలోనే వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాల్లోనూ రైతులకు సలహాలు, సూచనలు అందుతాయి. ఇదొక విజ్ఞాన శిక్షణ కేంద్రంగా పనిచేస్తోంది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పించి, ప్రోత్సహిస్తుంది. 

రైతు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర ఏంటని, పంట వేయకముందే రైతు భరోసా కేంద్రాల్లో లిస్టు పెడుతాం. గిట్టుబాటు ధర అందని పరిస్థితుల్లో ఆర్బీకేల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. తద్వారా మార్కెట్‌లో పంటల కొనుగోళ్లకు పోటీ పెరుగుతుంది. దీంతో రైతుకు పంట రేట్లు పెంచే దిశగా అడుగులు పడతాయి. ఇదే రైతు భరోసా కేంద్రం ద్వారా ఈమార్కెటింగ్‌తో గ్రేటింగ్, మార్కెటింగ్‌ చేయడంలో సహాయపడతాయి. ఆర్బీకేల్లో ఒక టీవీ ఉంటుంది.. భూసారం, విత్తనాల నాణ్యతను పరీక్షించే పరికరాలు ఉంటాయి. ఆర్‌బీకే కేంద్రాల్లో కూడా ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించాం. 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గస్థాయి ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 

గ్రామాల్లో ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. వీరికి ఒక ట్యాబ్‌ ఇస్తున్నాం. గ్రామాల్లో ఏ రైతు ఏ పంట వేశాడో.. ఈక్రాపింగ్‌ చేసే బాధ్యత వీరిది. ఈక్రాపింగ్‌ ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ కూడా ఆర్‌బీకేల ద్వారా జరుగుతాయి. ప్రతి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లకు ట్యాబ్‌ ఇచ్చాం.. దాంట్లో సీఎం యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాం. సీఎం యాప్‌ అంటే కాంప్రిహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ యాప్‌.. దీని ద్వారా ప్రతి రోజు అగ్రికల్చర్‌ అసెంట్లు వ్యవసాయ పరిస్థితులను నమోదు చేస్తాడు. సీఎం యాప్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి.. ఏదైనా పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉందా..? ఉంటే మార్కెటింగ్‌ ఇంట్రవెన్షన్‌ చేయాల్సిన అవసరం ఉందా.. అని ప్రతి రోజు యాప్‌ ద్వారా పంపిస్తారు. ఆ డేటాను తీసుకొని ఎక్కడైనా రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో ధర కల్పించేందుకు నేరుగా మార్కెటింగ్‌  శాఖ, జాయింట్‌ కలెక్టర్‌ ఇద్దరూ రైతును ఆదుకునే పరిస్థితి చేస్తారు. 

రాబోయే రోజుల్లో మీ గ్రామంలో భూసార పరీక్షలు మొదలు.. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వాతావరణ సూచనలు, ఏ పంట వేయాలనే సూచనలు, వ్యవసాయ యంత్ర సామగ్రి, పంట సంరక్షణకు సైతం రైతు భరోసా కేంద్రాలు సహకరిస్తాయి. ఈక్రాపింగ్, బీమా నమోదు, పంట రుణాలు ఇప్పించడం, పంట నష్టపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస గిట్టుబాటు ధర లభించకపోతే ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తాం. 

రైతు వేసే విత్తనం దగ్గర నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా ఆర్‌బీకేలు ఉంటాయి. ఈ వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కంటే ఎక్కువ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ సంవత్సరం కన్నా.. ఇంకా మెరుగైన పాలన మీ బిడ్డ రాబోయే సంవత్సరాల్లో ఇవ్వగలగాలని దేవున్ని కోరుకుంటున్నాను. 
 

Back to Top