పేద రైతులకు స‌ర్వ‌ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే

నూజివీడు బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి  

రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను, వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ 

శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు  

అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం 

ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి

 దొంగల ముఠా మాట‌లు నమ్మి మోసపోవద్దు

2014లో చంద్రబాబు, పవన్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలి?

ప్రజల దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను

 ఏలూరు: పేదల భూముల‌పై వారికి స‌ర్వ‌ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామ‌ని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కు కల్పిస్తున్నామ‌న్నారు. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామ‌న్నారు. మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించామ‌న్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు.

 

 • ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....

  మీ అందరి చిక్కటి చిరునవ్వులు, ఇంతటి కేరింతలు, ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతటి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

  నేడు- రాష్ట్ర చరిత్రలో గొప్పగా నిల్చిపోయే రోజు
  ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గొప్పగా నిలబడే రోజుగా మిగులుతుంది. కారణం దశాబ్ధాలుగా కేవలం అనుభవదార్లుగానే ఉన్న రైతన్నలకు వాళ్లు సాగుచేసుకుంటున్న భూములు మీద చట్టబద్ధంగా సంపూర్ణ హక్కులు వారికే ఇచ్చే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలిచ్చే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరగబోతోంది. ఈ 53 నెలల పరిపాలన గమనిస్తే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ముందడుగులు పడుతున్నాయి.
  ప్రతి పేదవాడినీ గుండెల్లో పెట్టుకొని మరీ ముందడుగులు వేయిస్తున్న కార్యక్రమం మీ బిడ్డ పాలనలో జరుగుతుంది.
   
  నా చిత్తశుద్ధికి నిదర్శనం- నేటి కార్యక్రమం.
  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ.. నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చినా వీరి మీద నా ప్రేమ చూపిస్తూ నేను ఎప్పుడు మాట్లాడినా... పెత్తందారులకు ఇలాంటి ప్రేమ, ఇలాంటి పిలుపులు ఏ మాత్రం నచ్చవని నాకు తెలుసు.
  అయితే నా పిలుపులోనూ, నా మనసులో మాత్రమే కాకుండా ఈ 53 నెలల పాలన చూస్తే నా చేతల్లో కూడా ఈ వర్గాల పట్ల ఎంతటి బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరించామో అన్నది వివరించడానికి నిజంగా ఈ కార్యక్రమం గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. నూజివీడులో మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

  1 చరిత్రను తిరగరాస్తూ- 100 ఏళ్ల తర్వాత రీసర్వే.
   
  చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి. మొట్ట మొదటగా ఎప్పుడూ జరగని విధంగా 100 సంవత్సరాల తర్వాత మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమం. 

  భూముల రీ సర్వే కార్యక్రమం చేస్తున్నాం. 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను... మొదటి, రెండు దశల్లో ఏకంగా 4 వేల రెవెన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం. 
  మొదటి విడతగా 2 వేల గ్రామాల్లోనూ, రెండో విడతగా మరో 2 వేల గ్రామల్లో పూర్తి చేసుకొని ఈ రోజు ఇక్కడ నుంచి మూడో విడత కార్యక్రమం చేపడుతున్నాం. 

  మొదటి దశలో 18 లక్షల ఎకరాలు, రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు మొత్తంగా 42,60,000 ఎకరాల్లో రీసర్వే పూర్తయింది.
  మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు రెండో దశలో 9.73 లక్షల ఎకరాల్లో భూ హక్కు పత్రాలు రైతులకు ఇప్పటికే అందజేశాం. మొదటి దశలో 19 వేలు, రెండో దశలో 26 వేలు మొత్తంగా 45 వేల సరిహద్దు తగాదాలు పరిష్కరించామని గర్వంగా చెబుతున్నాను. 

  మొత్తంగా 4 వేల గ్రామాలకు సంబంధించిన రీసర్వే పూర్తి చేసి... ఈ గ్రామాల్లో 43 లక్షల 33 కమతాలను నిర్ధారిస్తూ వాటి సరిహద్దులు నిర్ణయిస్తూ 50 లక్షల సరిహద్దు రాళ్లు పాతడం పూర్తయింది. 
  సర్వే పూర్తయిన ఈ 4 వేల గ్రామాల్లో, మనం ఆ గ్రామ సచివాలయాలకే వెళ్లి మన భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకొనే అవకాశం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోంది. 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలు.. స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ సర్వేలు జరగలేదు. ఈ రోజు భూ తగాదాలకు అన్నింటికీ పరిష్కారం చూపిస్తూ...  రికార్డుల అప్‌ డేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేగంగా అడుగులు ముందుకు పడుతున్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతున్నాయి.

  15 వేల మందికి పైగా గ్రామ వార్డు సచివాలయాల్లో  సర్వేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతూ, ప్రతి రైతన్నకూ మంచి చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితులు. 

  2.
  పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు...
  రెండోది.. 20 ఏళ్లకుపైగా అసైన్డ్‌ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులూ కల్పించే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈరోజు జరుగుతోంది. 
  దీని వల్ల అక్షరాలా 22.42 లక్షల ఎకరాలకు సంపూర్ణ భూహక్కులు కల్పించగా, దీని వల్ల 15.21 లక్షల మంది పేద రైతన్నలకు మంచి జరుగుతోంది. ఇది ప్రధానంగా పేద సామాజిక వర్గాల వారికి మంచి జరిగే గొప్ప కార్యక్రమం.  ఇది పెత్తందారీ పోకడల మీద మీ పేదల ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా చరిత్రలో మిగిలిపోతుంది.

  అసైన్డ్‌ భూములంటే గతంలో చంద్రబాబు హయాంలో అత్తగారి సొత్తన్నట్లుగా అక్వయిర్‌ చేసుకొనే పరిస్థితులు నుంచి...  ఈరోజు అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులను పేదవాడికే ఇచ్చే గొప్ప మార్పు, అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే పడింది.

  3.
  నిషేధిత జాబితా నుంచి చుక్కల భూముల తొలగింపు
  ఇక మూడో అడుగు.. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం.
  ఆశ్చర్యంగా అప్పుడెప్పుడో  బ్రిటీష్‌ పాలనలో రీసర్వే సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ రూపొందించే సమయంలో వివరాలన్నీ అందుబాటులో లేని పరిస్థితిలో... వివరాలు అందుబాటులో లేని  ఆ భూములను చుక్కల భూములుగా చూపారు.  ఇలాంటి భూములను కూడా చంద్రబాబు ప్రభుత్వంలో 2016లో వీటిని నిషేధిత జాబితాలో, 22ఏలో చేర్పించారు. దీంతో రైతన్నలు అల్లాడిపోయారు. భూములున్నాయి అమ్ముకోలేరు. భూములన్నాయి కానీ,  హక్కులు లేవు. కారణం 2016లో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితాలో చేర్చడమే. చుక్కల భూములకు సంబంధించి...  2.06 లక్షల ఎకరాలకు సంబంధించిన భూములు మన ప్రభుత్వం చొరవ తీసుకొని నిషేధిత జాబితా నుంచి తొలగించడం వల్ల 1 లక్షా 7 వేల మంది రైతులకు మంచి జరిగింది.  

  4.
  షరతులు భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ....
  నాల్గవది.. పేద వాడికి భూ హక్కులు కల్పించడం కోసం మీ బిడ్డ ఎంతో తపన, తాపత్రయం పడుతూ అడుగులు వేశాడు.  షరతులు గల పట్టా భూములు కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అప్పుడెప్పుడో... 1932–34లో రీసర్వే సెటిల్మెంట్‌ రిజిస్టర్లో రిమార్క్స్‌ కాలమ్‌లో షరతులు గల పట్టాగా నమోదు చేసిన ఆ భూములను కూడా.. ఆ రైతన్నలకు హక్కులు ఇవ్వని పరిస్థితులు.  ఆ రైతన్నలకు మంచి చేసేందుకు అలా షరతులు గల భూముల జాబితాలో పేర్కొన్న వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాం. రైతన్నలకు విముక్తి కలిగిస్తూ... వారికి  సర్వ హక్కులూ ఇస్తూ ఏకంగా 33,394 ఎకరాల భూ సమస్యలు పరిష్కరించాం. దీనివల్ల ఆ భూములు సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు మంచి జరిగింది. 

  5.
  ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన భూములపై హక్కుల కల్పన
  ఐదవ అంశం.. పేద వాడి కోసం తపిస్తూ, వారికి భూ హక్కులు కల్పించాలని ఆరాట పడుతూ మనందరి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.
  ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొన్న భూములను, ఎస్సీ కార్పొరేషన్‌ లో లోన్ల కింద రాసుకోవడం వల్ల ఆ భూముల మీద హక్కులు కోల్పోయిన పరిస్థితులలో ఉన్న దళితులకు మంచి చేస్తూ నిర్ణయం తీసుకున్నాం.  ఆ దళిత రైతన్నలకు మంచి చేస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనిచ్చిన భూముల మీద వారి రుణాలు మాఫీ చేస్తూ, వారికి సర్వ హక్కులూ కల్పించింది కూడా మనందరి ప్రభుత్వమే. 
  దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 22,387 ఎకరాలను నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసి... ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడం, వాటిపై ఉన్న రుణాలను మాఫీ చేయడం జరిగింది. 
  తమకు భూమి ఇచ్చినా వాటిపై ఏ హక్కులు లేక, క్రయ, విక్రయాలకు అవకాశం లేక ఆ లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి మనం ఈ మంచి నిర్ణయాన్ని తీసుకున్నాం. 

  6.
  ఆర్‌ ఓ ఎఫ్‌ ఆర్ భూముల పంపిణీ
  ఆరవ అంశం.. ప్రతి పేద వాడినీ చేయి పట్టుకొని నడిపించాలని, తోడుగా నిలబడాలని, నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఇందులో  ఆర్వోఎఫ్‌ ఆర్‌ పట్టాల పంపిణీ మరో ప్రధాన నిర్ణయం. 
  తరతరాలుగా  కొండలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తూ అక్షరాలా 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి జరిగిస్తూ 3,26,982 ఎకరాలను కూడా మీ బిడ్డ ప్రభుత్వమే పంపిణీ చేసింది. 

  7.
  లంక భూముల సాగుదార్లకు పట్టాలు
  ఏడవ అంశం.. మన ప్రతి అడుగులోనూ, ప్రతి అంశంలోనూ పేదవాడికి ఎక్కడెక్కడ మేలుచేయాలన్న ఆరాటమే కనిపిస్తుంది. ఆ ఆరాటం నుంచి   రైతుల సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేదవాడికి తోడుగా నిల్చి అక్కడ భూములు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో చేశాం. 

  లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి పట్టాలు లేకపోవడం వల్ల వారికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ సహకారం అందని పరిస్థితుల్లో ఉన్నారు. 
  తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న ఇటువంటి రైతన్నలందరినీ... గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. 

  ఆ మేరకు జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేశాం. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా నిర్ధారించి వారిని ఏ, బీ, సీ క్లాస్‌లుగా గుర్తించాం.
  ఏ, బీ కేటగిరీలకు సంబంధిచి డీకేటీ పట్టాలు, సీ కేటగిరీకి సంబంధించి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. దీనివల్ల 9,064 ఎకరాలకు సంబంధించి 17,768 మంది నిరుపేదలకు మంచి జరిగిస్తూ అడుగులు ముందుకు వేసి ఈరోజు ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నాం. 

  భూములకు సంబంధించి పేదవాడికి మంచి చేయాలని ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చాం, ఎన్ని అడుగులు ముందుకు వేశాం అనేది చెప్పడానికి ఇవన్నీ చెబుతున్నాను.

  8.
  నిషేధిత జాబితా నుంచి ఈనాం భూముల తొలగింపు
  ఎనిమిదవ అంశం.. సర్వీసు ఈనాం భూములు. అన్ని గ్రామాల్లో సర్వీసు ఈనాం భూములను నిషేధిత జాబితాలో, 22ఏ కింద పెట్టడం జరిగింది. 
  ఒక్కదేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా, మిగిలిన అన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. 
  1,61,584 మంది నా రైతన్నలకు, మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి తదితర వృత్తుల్లో ఉన్న వారు సర్వీసు ఈనాం భూములు పొందిన వారి సమస్యను పరిష్కరిస్తూ వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ పూర్తి హక్కులను వాళ్లకే ఇవ్వడం జరిగింది.  1,58,113 ఎకరాలకు సంబంధించిన 1,61,584 మంది నా బీసీ రైతన్నలకు మేలు చేశాం. 

  9.
  పేదలకు భూ పంపిణీ
  తొమ్మిదో అంశం.. పేదల భూములకు సంబంధించిన మరో మంచి నిర్ణయం.
  ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరో 42307 మంది నిరుపేదలకు 46463 ఎకరాలకు సంబంధించిన భూ పంపిణీకి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం.  దీనివల్ల  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగించే అడుగులు ఇక్కడి నుంచి పడుతున్నాయి. 

  ఇలా ఈ 53 నెలల్లో నేను చెప్పిన 9 అంశాలు కేవలం భూములకు సంబందించి, పేదవాడిని చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పాను. 

  పేదవాడు కాలర్ ఎగరేసేలా - చరిత్రలో నిల్చిపోయే అడుగులు.
  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అడుగులు పడ్డాయి. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా 35,44,866 ఎకరాల భూములపై మొత్తంగా 20,24,709 మంది పేదలకు,పేద రైతన్నలకు హక్కులు కల్పించి వారి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 
  ప్రతి పేదవాడూ కాలర్‌ ఎగరేసి అదిగో మా అన్న..  ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడున్నాడని చెప్పుకొనే విధంగా మీ బిడ్డ పాలన సాగింది. 

  ఇళ్ల స్ధలాల కేటాయింపులోనూ ...
  ఈ  భూముల విషయంలోనే కాకుండా... నివసించే స్థలాల విషయంలో కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులుపడ్డాయి. నా పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని,వారికి సొంత ఇల్లు ఉండాలని వారి కోసం పరితపించాం. 

  రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను సేకరించి అక్షరాలా 17,005 లే అవుట్‌ లను ఏర్పాటు 30,65,315 మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది కూడా మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోనూ కేవలం ఇంటి స్ధలం విలువ తీసుకున్నా.. ఒక్కో ఇంటి స్ధలం ప్రాంతాన్ని బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ. 15 లక్షల దాకా పలుకుతోంది.  ఉజ్జాయింపుగా కనీసం రూ.5 లక్షలు వేసుకున్నా 31,65,311 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టిన స్థలాల విలువే కనీసం రూ. లక్ష కోట్లకు పైచిలుకుగా ఉంటుంది. 

  అంతిమ సంస్కారాల కోసం భూమి కేటాయింపు
  మరో గొప్ప మార్పు... ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ, ఎలా ఉన్నాడు ? ఎలా బతుకుతున్నాడు ? ఆ పేద వాడి కష్టం ఏంటి ? అని ప్రతి విషయంలోనూ ఆలోచన చేసి.. ఇంకో గొప్ప విషయం గురించి ఆలోచన చేశాం. 
  స్వతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేదు. 
  తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరాని తనం పాటించే పరిస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. 
  ఇలాంటి ఆలోచనే మీ బిడ్డకు వచ్చింది. మొత్తం రాష్ట్రంలో శ్మశాన వాటికలు అవసరం అని గ్రామ సచివాలయాలకు ఆదేశాలిచ్చాం. 
  1,854 గ్రామ సచివాలయాల పరిధిలో 1,230 ఎకరాలు అవసరం అని అధికారులు అంచనా తెచ్చారు. 
  వాటికి సంబంధించి ఇప్పటికే 1,563 సచివాలయాల పరిధిలో 951 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించి ఆ భూములను... ఆయా గ్రామ పంచాయతీలకు కూడా అప్పగించాం. ఇంత సూక్ష్మంగా వాటిని పరిశీలించి, నా పేదవాడికి, నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు, ఎక్కడ ఏం అవసరం ఉందని పరితపిస్తూ వారి కోసం అడుగులు వేశాం. 

  ఈ రోజు మనందరి ప్రభుత్వం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఇలా... 35 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చిందంటే దానికి కారణం మనది పేదలు, రైతులు, వారి గుండె చప్పుడుగా మారిన ప్రభుత్వం మనది కాబట్టే మనసు పెట్టి చేశాం.

  సామాజిక న్యాయం నినాదం కాదు విధానం...
   మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అన్నది ఒక నినాదంగా కాదు, ఒక విధానంగా అమలు చేస్తున్నాం. 
  ప్రతి విషయంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు నా పేదవర్గాలు అంటూ.. నిరుపేదలుగా ఉన్న వారిని అక్కున చేర్చుకొని మీ బిడ్డ ప్రభుత్వంలో 53 నెలల కాలంలో సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగాం. నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ. 2.40 లక్షల కోట్లు పంపించగలిగాం. ఎక్కడా ఎవరూ లంచాలు అడగరు. వివక్ష చూపరు. అర్హత ఉంటే చాలు ఎవరైనా కూడా, మన పార్టీ వాళ్లు కాకున్నా ఓటు వేయకపోయినా పర్వాలేదు. వారికి అందేటట్టు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది. 

  పేదల కోసం రూ.4.10 లక్షల కోట్లు.
  ఈ 53 నెలల కాలంలోనే డీబీటీగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలఖాతాల్లోకి పంపించగలిగితే .... మరో రూ.1.70 లక్షల కోట్లు పైచిలుకు నాన్‌ డీబీటీ కూడా కలుపుకుని మొత్తంగా రూ. 4.10 లక్షల కోట్లు నా పేదలు, అక్కచెల్లెమ్మల కోసం పరితపిస్తూ ఇవ్వగలిగాం. 
  ఈ డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో ఇచ్చిన సొమ్ములో.... ఇందులో దాదాపు 80 శాతం డబ్బు, ప్రయోజనం పేద వర్గాలకే ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. 

  53 నెలల్లోనే 2.07 లక్షల ఉద్యోగాలు.
  దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా కేవలం 53 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 2.07 లక్షల ఉద్యోగాలు.  స్వతంత్య్రం వచ్చిన తర్వాత 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత  మరో 2.07 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు. 
  ఇందులో 80 శాతం ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లే ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. సామాజిక న్యాయానికి అర్థం ఇది కాదా? అని అడుగుతున్నాను.

  మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని... అక్షరాలా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇందులో  80 శాతం పట్టాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. 
  సామాజిక న్యాయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల కోసం పేద కులాల కోసం పేద వర్గాల కోసం ఆలోచించడం. అంతే కాదు ప్రతి శ్వాస కూడా మంచి చేయడం కోసం అడుగులు వేయడం. అంతేకానీ.. గత ముఖ్యమంత్రిలా తన వర్గం కోసం, తన వాళ్ల కోసం, తన గజదొంగల ముఠా కోసం పేదల ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు.. జరిగేది సామాజిక అన్యాయం అవుతుంది. 

  గత ప్రభుత్వం- గజ దొంగల ముఠా
  తన గజదొంగల ముఠా కోసం, జన్మభూమి కమిటీల కోసం వీళ్లంతా దోచుకోవాలని, దోచుకున్నది పంచుకోవాలని కోరుకొనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తన దోపిడీకి రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో చూశాం.  తన దోపిడీకి అక్కచెల్లెమ్మలకు ఎంతగా అన్యాయం చేస్తాడో చూశాం.  తన దోపిడీకి నిరుద్యోగులను, అవ్వాతాతలు, చిన్న పిల్లల్ని సైతం వదలకుండా ఎంతగా దోపిడీ చేస్తాడో మనమంతా చూశాం. 
  ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉండి చూశాం.  ఇవన్నీ ఆలోచన చేయమని, గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతున్నాను. 

  రానున్నది ఎన్నికల సంగ్రామం
  ఇవాళ ఎన్నికల సంగ్రామం సమీపిస్తోంది. ప్రజలెవ్వరికీ అన్యాయం జరగకూడదు. ఈ పెద్దమనిషి ఈ చంద్రబాబు.. ఏనాడూ ప్రజలకు మంచి చేసి సీఎం కూర్చీలో కూర్చోలేదు. 
  తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో, తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడూ సీఎం కాలేదు. 

  మొట్ట మొదటి సారి ఈ మనిషి ఎలా  సీఎం అయ్యాడు?. సొంత కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు.
  అప్పట్లో కార్గిల్‌ యుద్ధం పుణ్యాన రెండోసారి సీఎం అయ్యాడు. ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి... మళ్లీ మూడోసారి సీఎం అయ్యాడు. రైతన్నలకు రుణమాఫీ అంటూ రూ. 87612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. చదువుకుంటున్న పిల్లలను వదలకుండా... ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే  నిరుద్యోగభృతి అన్నాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 
  రైతులను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, పిల్లల్ని సైతం వదలకుండా ఎంతగా మోసం చేశాడో మనందరం చూశాం.
  – కాబట్టే 2019లో చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్‌ అనిపించే విధంగా, రీ సౌండ్‌ వచ్చే విధంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. 

  బాబు గత పాలన మర్చిపోవద్దు...
  గత చంద్రబాబు పాలనను మర్చిపోవద్దు. మిగతా సామాజిక వర్గాలంటే కూడా చంద్రబాబుకు ఎంత చులకనో గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. 
  ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనుకుంటారా? అన్నమాటలు గుర్తు తెచ్చుకోవాలి.  బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్‌ అన్నమాటలు గుర్తు తెచ్చుకోవాలి. అక్కచెల్లెమ్మల మీద తనకున్న చులకన భావన తో.... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా ?అన్నమాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి.

  బాబు సమాజంపై ప్రేమ- హామీలపై శ్రద్ధలేని వ్యక్తి
  ఇలా సమాజంపై ప్రేమ, రైతులపై గౌరవం, అక్కచెల్లెమ్మలపై శ్రద్ధ, మేనిఫెస్టో హామీలపై కమిట్‌ మెంట్‌ లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు. ఇలాంటి వారిని నమ్మగలమా? 
  రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో మోసాలు, అబద్ధాలు ఎక్కువ అవుతాయి. రాబోయో రోజుల్లో ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడుగారి నోంట్లోంచి... ఈయనకతోడు తోడు గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అంతా కలిసి ఏకమవుతారు. ప్రజల్నిమోసం చేసేందుకు అడుగులు వేస్తారు.  ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు, కేజీ బంగారం ఇస్తామంటారు. మోసపోకండి. అబద్ధాలు నమ్మకండి. గతంలో ఇదే పెద్దమనుషులు ఇద్దరూ కలిసి వచ్చి 2014లో మీకు ఏం చెప్పారో జ్ఞాపకం తెచ్చుకోండి. చేశారా ? లేదా ? అన్నది మెదడుకు పని పెట్టండి

  తోడేళ్లు ఏకమవుతారు జాగ్రత్త
  మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేతకాదు, కుట్రలు, కుతంత్రాలు చేతకాదు. ఈ బిడ్డ మీ బిడ్డ. మోసం చేయడు. అబద్ధాలు ఆడడు. ఇది మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

  ఎన్నికలు దగ్గరవుతున్నాయి. తోడేళ్లంతా ఏకమవుతారు. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు ఉండదు.  మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా ? లేదా ‘అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.  

  నా పొత్తు మీతోనే - అండగా ఉండండి
  మిమ్నల్ని ఒక్కటే కోరుతున్నాను. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా, తోడుగా నిలబడండి. 
  మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సుల వల్ల మంచి చేస్తూ, అనేక అడుగులు వేయగలిగాం. రాబోయే రోజుల్లో ఇలాంటి అడుగులు ఇంకా పడతాయి. 

  దేవుడి చల్లని దీవెనలు,మీ ఆశీస్సులు ఉన్నంత వరకు మీ బిడ్డ ఎవరికీ భయపడడు. ఎవరితో పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది. 
  తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒక్కడుగానే నడుచుకుంటూ వస్తుంది. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ?... ఈ ధైర్యం మీ దగ్గర నుంచి వచ్చిందని తెలియజేస్తున్నాను.
  దేవుడిని నమ్ముతాను. మీ ఆశీస్సులమీద ఆధారపడతాను. ఇవే మీ బిడ్డకు ధైర్యం. మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డకు, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని, మంచి చేసే పరిస్థితులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.  

  చివరిగా.... 
  కాసేపు క్రితం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ... నూజివీడు మున్సిపాల్టీ గురించి అడిగారు. ఇక్కడ 16 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మున్సిపాల్టీ మరీ వెనుకబాటుకు గురైన ప్రాంతం. ఎన్నో దశాబ్ధాలుగా ఈనియోజకవర్గం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని అడిగాడు.. దీనికోసం ప్రత్యేకంగా జీజీఎంపీ పరిధిలో ఒక్కో వార్డుకు రూ.1 కోటి మంజూరు చేస్తున్నాను. మున్సిపాల్టీ అభివృద్దికి తోడుగా ఉంటాం.
  అదేవిధంగా రైతులకు సంబంధించి ఇక్కడ మ్యాంగో పల్ఫ్‌.. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకుని వస్తే... మామిడి రైతులకు మంచి జరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించి మ్యాంగో పల్ఫ్‌ యూనిట్‌ ను రూ.275 కోట్లతో నిర్మించబోతున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి పునాది రాయి వేయబోతున్నాం. అదే విధంగా చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికిన ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 

  మీ అందరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ...   దేవుడి చల్లని దయ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

 •  
Back to Top