విశాఖ హార్బ‌ర్‌లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం దిగ్భ్రాంతి

బాధితుల‌ను ఆదుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశం

విశాఖ: ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని, ప్రమాదంపై స‌మ‌గ్ర‌ దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఘటనాస్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఆదివారం అర్ధ‌రాత్రి విశాఖ ఫిషింగ్‌ హర్టబర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెప్పారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలలో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో ఎస్పీ వివరాలు సేకరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఐదు గంటలు పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

తాజా వీడియోలు

Back to Top