సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో నకిలీ చలాన్లపై సీఎం సీరియస్‌

కార్యాలయాల్లోకి నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి..?

వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో ఎందుకు చూడడం లేదు..?

అవినీతి నిర్మూలనకు సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలి

అవినీతిపై ఫిర్యాదు నంబర్‌ ప్రతి ఆఫీస్‌లోనూ డిస్‌ప్లే చేయాలి

మీ–సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ఉన్నతాధికారులను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్, జీఎస్టీ, ఎక్సైజ్‌ శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ చలాన్ల ఉదంతంపై సీరియస్‌ అయ్యారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేశామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

తప్పులు జరుగుతుంటే ఎందుకు మన దృష్టికి రావడం లేదని ఉన్నతాధికారులను నిలదీశారు. ఎప్పటి నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయని, వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో ఎందుకు చూడడం లేదని అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలని, అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీస్‌లోనూ నంబర్‌ డిస్‌ప్లే చేయాలని అధికారులను ఆదేశించారు. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. అవినీతి నిర్మూలనకు సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలని ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సహా అన్ని ఆఫీసుల్లోనూ చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలని ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని నిశితంగా పరిశీలించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని  ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలియజేశారు. మీ–సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ప్రణాళిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ టాక్స్‌ పియూష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఐజీ ఎం వి శేషగిరిబాబు, ఎస్‌ఈబీ కమిషనర్‌ పీ హెచ్‌ డీ రామకృష్ణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top